ఇరాన్‌లో నిరసనలు తగ్గుముఖం పట్టాయా?

Sharing is Caring...

All is calm outside, unrest inside………..

ఇరాన్‌లో నిరసనలు కొంతమేరకు తగ్గు ముఖం పట్టాయి. 2025 డిసెంబర్ చివరి వారంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు, 2026 జనవరి నాటికి దేశవ్యాప్త ఆందోళనలుగా మారి ప్రభుత్వానికి సవాలుగా నిలిచాయి.జనవరి 8-9 తేదీల్లో భద్రతా దళాలు చేపట్టిన అతిపెద్ద అణిచివేత చర్యల తర్వాత నిరసనల ఉధృతి కొంత తగ్గింది.

అయితే ఈ అణిచివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో వేలాది మంది మరణించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంఖ్య సుమారు 3,000గా ఉంది. ప్రస్తుతం భారీ బహిరంగ ప్రదర్శనలు తగ్గినప్పటికీ, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అలాగే ఉంది. కొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు , భారీగా భద్రతా దళాల పహారా కొనసాగుతోంది. దీనిని “తుఫాను ముందు ప్రశాంతత”గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

జనవరి 8 నుండి దేశంలో ఇంటర్నెట్ సేవలను దాదాపు పూర్తిగా నిలిపివేశారు. సమాచారం బయటకు రాకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.దీనివల్ల బ్యాంకింగ్, ఆన్‌లైన్ వ్యాపారాలు, సామాన్యుల కమ్యూనికేషన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నెట్‌బ్లాక్స్ (NetBlocks) వంటి సంస్థలు ఇరాన్‌లో నెట్ సేవలు అస్థిరంగా ఉన్నాయని ధృవీకరించాయి.

ఇరాన్ కరెన్సీ ‘రియల్’ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు 60% పైగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింది.దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ, ఏ నిమిషంలో మళ్ళీ గొడవలు జరుగుతాయో అన్న భయంతో ప్రజలు అత్యవసర పనులకు తప్ప బయటకు రావడం లేదు.నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో సామాన్యులు తమ రోజువారీ అవసరాల కోసం గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది.

నిరసనకారులపై హింసను నిరసిస్తూ అమెరికా,ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్‌పై సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ప్రతిస్పందనగా ఇరాన్ తన నౌకాదళ విన్యాసాలను ప్రారంభించింది. ఐరోపా సమాఖ్య (EU) ఇరాన్ విప్లవ దళాలను (IRGC) ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

ప్రభుత్వం నిరసనలను అణచివేసినప్పటికీ, ఆర్థిక సంక్షోభం,రాజకీయ అస్థిరత వల్ల ఇరాన్‌లో పరిస్థితి ఎప్పుడు ఏమౌతుందో తెలియని సందిగ్ధంలో ఉంది.ఇక ఇరాన్‌లో జనజీవనం సాధారణంగా లేదు..అక్కడి ప్రజల్లోఒక రకమైన స్తబ్దత, భయం నెలకొన్నాయి.టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో కూడళ్ల వద్ద భారీగా భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. ప్రజలు గుంపులుగా తిరగడంపై ఆంక్షలు విధించారు.

మొత్తం మీద బయటకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా,లోలోపల అశాంతి ఇంకా అలాగే ఉంది. ప్రభుత్వం నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం కోసం రాత్రిపూట దాడులు నిర్వహిస్తోంది.ఇరాన్‌లో సుమారు 9,000 మంది భారతీయులు (ఎక్కువగా విద్యార్థులు) ఉన్నారు.

అక్కడ పెరుగుతున్న అశాంతి,హింసాత్మక నిరసనల దృష్ట్యా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తమ పౌరులను వెంటనే ఇరాన్ విడిచి రావాలని జనవరి 2026లో పలు దఫాలుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సుమారు 1,700 మందికి పైగా భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి చేర్చారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!