Rare Museum
రష్యా లో వందల సంఖ్యలో మ్యూజియాలు ఉన్నాయి. అప్పటి అధినేతలకు ఈ ప్రదర్శన శాలలంటే అభిమానం ఎక్కువ. ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో మ్యూజియాలను నెలకొల్పారు. టాల్ స్టాయి, లెనిన్ ల సంస్మరణ కోసం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం, తిరుగుబాటు వంటి అనేక చారిత్రాత్మక సంఘటనలను చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ ప్రదర్శనశాలలను ఏర్పాటు చేశారు.
అవే కాక చిన్న పిల్లల కోసం,సాంస్కృతిక అంశాల స్మరణ కోసం ప్రత్యేక మ్యూజియాలను నెలకొల్పారు. ఆ కోవలోనిదే “దెయ్యాల మ్యూజియం”. ఇలాంటి మ్యూజియం మరెక్కడా లేదు అంటారు. దీన్నే డెవిల్స్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. రష్యా లోని కౌనస్ ప్రాంతంలోని లిథువేనియాలో ఈ మ్యూజియం ఉంది.
ఈ మ్యూజియంలో దెయ్యాలు, చేతబడులు వంటి మూఢ నమ్మకాలకు సంబంధించిన అనేక వస్తువులను సేకరించి పదిలపరిచారు. మాంత్రికుల విగ్రహాలు, చేత్తో గీసిన బొమ్మలు, మాంత్రికుల దుస్తులు .. ముఖానికి వేసుకునే తొడుగులు , వారి చేతిలో ఉండే మంత్ర దండాలు , కమండలాలు వంటి వస్తువులను ఇక్కడ భద్ర పరిచారు.
ఆఫ్రికా, ఇండియా,జపాన్ , చైనా వంటి దేశాల్లో మంత్రగాళ్ళు వాడిన వస్తువులను కూడా సేకరించి పెట్టారు. క్షుద్ర శక్తుల ఉపాసన లో వాడే వస్తువులను కూడా ఈ దెయ్యాల మ్యూజియంలో భద్రపరిచారు.కాగా అప్పట్లో లిథువేనియాలో మతపరమైన విగ్రహాలపై నిషేధం ఉండేది.అలాంటి విగ్రహాలు ఎవరి దగ్గరైనాఉంటే వారిని శిక్షించేవారు.
అంటనాస్ స్ముడ్జినావియస్ అనే కళాకారుడు ఈ విగ్రహాలను సేకరించి పెట్టుకున్నారు. మ్యూజియం మూల పురుషుడు ఇతనే. లిథువేనియా పై శతాబ్దాలుగా వలస పాలకులు పెత్తనం చెలాయించారు.20వ శతాబ్దానికి ముందు లిథువేనియన్ కళాకారుల గురించి ఎవరికి తెలియదు. వారి గొంతుకలు వినబడలేదు.అంటనాస్ యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో చదువుకుని లిథువేనియాకు తిరిగి వచ్చాడు.
అంటనాస్ వివిధ దేశాల కళా ఉద్యమాలను అధ్యయనం చేసాడు. ఈ నేపథ్యంలోనే కళాప్రదర్శనలు ఏర్పాటు చేసాడు. ఎందరో వీటిని సందర్శించి అతనికి దేశీయ విగ్రహాలను,కళాఖండాలను,డెవిల్ బొమ్మలను ఇచ్చేవారు. అప్పట్లోనే చేతబడులు ఇతర క్షుద్ర విద్యల గురించి పరిశోధనలు చేసిన ఒక ప్రొఫెసర్ కూడా తాను సేకరించిన వస్తువులన్నీ అంటనాస్ కు ఇచ్చేసాడు.
అలా సేకరించిన కళాఖండాలు, ఇతర వస్తువులతో మొదట్లో ఇంట్లో.. తర్వాత ఒక భవనంలో అంటనాస్ ప్రదర్శనశాల ను నిర్వహించాడు. 1966లో అంటనాస్ చనిపోవడానికి ఐదు సంవత్సరాల ముందు తన మొత్తం సేకరణను ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చాడు ఆయన మరణం తరువాత అది స్మారక మ్యూజియంగా మారింది. ఆవిధంగా డెవిల్స్ మ్యూజియం పుట్టింది.ప్రస్తుతం ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తోంది.
———–KNM