Are there aliens?……………
ఏలియన్స్ ఉన్నారా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా విశ్వంలో జీవం ఉనికిని అన్వేషిస్తున్నారు, కానీ శాస్త్రీయంగా ఏలియన్స్ ఉన్నారని కనుగొనలేదు. అనంతమైన విశ్వంలో భూమి కాకుండా వేరే చోట జీవం ఉండే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఏ శాస్త్రీయ ఆధారాలు ఇంకా లభించలేదు.
ఏలియన్ల జాడ కనుగొనడానికి నాసా వంటి అంతరిక్ష సంస్థలు, శాస్త్రవేత్తలు నిరంతరం ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.. గ్రహాంతరవాసుల ఉనికి గురించి రకరకాల ఊహాగానాలు, ఊహ జనిత చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి.ఇవి తప్ప ఇంతవరకు ఎలాంటి సమాచారం లభించలేదు.
ఎక్కడైనా ఏలియన్స్ ఉంటే మనుష్యులను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివి చేశారు.ఈ క్రమంలోనే నాసా పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన బంగారు డిస్కులు పంపింది. వాటిని తీసుకెళ్లిన వ్యోమనౌకలు ఇపుడు అంతరిక్షంలో సంచరిస్తున్నాయి.
ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర వాసులు ఉండి ఉంటే.. వారికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్కులను అమర్చారు.
ఆ బంగారు డిస్కులపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు.
ఇప్పటివరకు అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన నాలుగు వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్కులను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్-10, పయోనిర్-11, వోయేజర్-1, వోయేజర్-2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం లో తిరుగుతున్నాయి. డిస్కుల్లో నిక్షిప్తం చేసిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఏలియన్లకు అర్థమయ్యేలా భూమి పై జీవం గురించి వివరించారు.
1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్కులను గ్రామ ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్సు కి సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్ కి సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే డిస్కులను టైం క్యాప్సూల్స్ అని కూడా అంటారు.
ఈ బంగారు డిస్క్ లకు పైన కవర్ ని కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం-238 తో పూత పూశారు. ఈ కవర్ పై “అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..” అని రాశారని సమాచారం.
మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్‌కోడ్ చేసిన 116 చిత్రాలు పెట్టారు. వీటిలో తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్ మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎలక్ట్రానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్ లోని ఓ పేజీ.. ఇలా ఎన్నోవిషయాలను పొందుపర్చారు . హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులను ప్రస్తావించారు. అలాగే డిస్కుల్లో ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం కూడా ఉంది.
భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వను లు అంటే ఉరుములు, మెరుపులు ,పిడుగులు జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దుల శబ్దాలు ఉన్న 12 నిమిషాల ఆడియో ను కూడా డిస్కుల్లో పెట్టారు. అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్ ను పొందుపర్చారు. డిస్క్ లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు .. ఇతర సంకేతాలను సూచించారు. ఈ ప్రయోగం ద్వారా నైనా ఏలియన్స్ వివరాలు తెలుస్తాయేమో చూద్దాం.


