PareshTurlapati ……….
ధోతీ కట్టుకున్నాడనీ నాగరాజన్ ను హోటల్ సిబ్బంది లోనికి రానివ్వలేదు .. ఆ అవమానంలో నుంచే ‘రామరాజ్’ బ్రాండ్ పుట్టింది .. ఇవాళ అదే ధోతీకి గొప్ప ఇమేజ్ తీసుకొచ్చి 2,500 కోట్ల టర్నోవరు తో దూసుకుపోతున్న రామరాజ్ నాగరాజన్ విజయగాథ ఇది.
తెలుగు లోగిళ్ళలో పండగలు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు అచ్చ తెనుగు సంప్రదాయంలో ధోతీలు , పంచెలు ,చీరలు కట్టుకునేవారి సంఖ్య పెరిగింది..సెలెబ్రిటీలు కూడా పెళ్లిళ్లలో సూటు బూటు వదిలేసి చక్కటి సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు
ప్రస్తుత స్పీడ్ యుగంలో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కె ఆర్ నాగరాజన్.. ..నాగరాజన్ అంటే చాలామందికి తెలీదు. రామరాజు కాటన్స్ నాగరాజు అంటే అందరికీ తెలుసు.. ఎస్ .. ఈ రోజు దాదాపు ప్రతి పండగలో , పెళ్లిళ్లలో రామరాజు వస్త్రాలు తళుక్కున మెరుస్తాయి. ఆ వస్త్రాలు చూడటానికి హాయిగా ఉండటమే కాకుండా చక్కటి నిండుదనం ఉట్టిపడుతుంది.
ఈ రోజు రామరాజు బ్రాండ్ కాటన్ టెక్సటైల్స్ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందటం వెనుక నాగరాజన్ కష్టం ఉంది..
1983 లో తమిళనాడులోని తిరుపూర్‌లో చిన్నటెక్సటైల్స్ పరిశ్రమగా మొదలైన రామరాజు కాటన్స్ అంచెలంచెలుగా ఎదిగి .. నాణ్యమైన ధోతీలకు పర్యాయపదంగా మారింది. రామ్‌రాజ్ కాటన్ బ్రాండ్, దాని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది.
మలేషియా, అమెరికా సింగపూర్ వంటి దేశాల్లో కూడా రామరాజ్ ధోతీలు,లాల్చీలు,షర్ట్స్ కూడా లభ్యమవుతాయి. రామ్‌రాజ్ కాటన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్‌లను సులభతరం చేసే ఆన్‌లైన్ స్టోర్ కూడా ఉంది.రామరాజ్ వివిధ రకాల ధోతీలను అందిస్తుంది, వాటిలో కాటన్, సిల్క్, లినెన్ రకాలున్నాయి. అలాగే రెడీమేడ్ ధోతీలు ఉన్నాయి..”లిటిల్ స్టార్స్”పేరిట పిల్లలకు “రమ్యం” పేరిట మహిళల దుస్తులు కూడా విక్రయిస్తున్నారు.
మొదట్లో నాగరాజన్ ధోతీ పంచెల వ్యాపారం మొదలుపెడుతున్నాడని తెలిసి బంధువులు కూడా అతన్ని ఎగతాళి చేశారట.ఈ ఆధునిక యుగంలో అందరూ అప్డేట్ అయి సూటుబూటులు వేసుకుంటుంటే ఇంకా ఆ పాతకాలపు సాంప్రదాయ వస్త్రాలు ఎవరు వేసుకుంటారు అని గేలి చేసారు… దీంతో నాగరాజన్ కు మరింత రెచ్చిపోయాడు. సాంప్రదాయ దుస్తులను తక్కువ చేసి చూడటంతో ఆనాడే నాగరాజన్ మళ్ళీ ఆ వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
తనతండ్రి పేరు రామస్వామిలో రామ , తనపేరు నాగరాజన్ లో రాజు కలిపి ‘రామరాజ్ కాటన్స్’ పేరిట వ్యాపారం ప్రారంభించాడు..ఇంటర్ స్థాయిలోనే చదువులో ఫెయిల్ అయిన నాగరాజన్ కేవలం 83 వేలతో వ్యాపారం మొదలుపెట్టి ఇవాళ 2,500 కోట్ల టర్నోవరు సాధించాడు.
చిన్నగా మొదలైన రామరాజ్ వ్యాపారంలో నాగరాజన్ క్వాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడుఇప్పట్లా అప్పట్లో డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు లేవు.. అంతా మౌత్ పబ్లిసిటీ మీదే నడిచేది.. రామరాజ్ క్వాలిటీ ఆనోటా ఈనోటా పాకి ‘రామరాజ్ కాటన్స్ బ్రాండ్’ గా మారి అమ్మకాలు పెరిగాయి..
గతంలో ఎవరైతే ఈయనను ఎగతాళి చేసారో వాళ్ళే పెళ్లిళ్లలో రామరాజ్ కాటన్స్ ధరించి ఫోటోలు దిగారు… ప్రస్తుతం 500 పైగా స్టోర్లతో రామరాజ్ దూసుకుపోతుంది.. ఆ మధ్య తమిళనాడులో చైనా అధ్యక్షుడి పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రామరాజ్ బ్రాండ్ ధోతీ ధరించడంతో ఆ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది.
ఒక్కడుగా ప్రారంభమైన ‘రామరాజ్ కాటన్స్’ ప్రస్తుతం 90 వేలమందికిపైగా చేనేత కార్మికులకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. సనాతన సాంప్రదాయ వస్త్రాలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చి విజయం సాధించిన రామరాజ్ కఠోర శ్రమ , పట్టుదల , అంకిత భావం ఎందరో ఔత్సాహిక వ్యాపారస్తులకు స్ఫూర్తి నిస్తుందని చెప్పుకోవాలి.