నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది !

Sharing is Caring...
Taadi Prakash …………………………….. 

GUERILLA DOCTOR NORMAN BETHUNE———-

పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం!మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. చివుక్కుమంది. ఆ రోజు జూలై1. మన డాక్టర్స్ డే. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక స్పార్టకస్, ఒక నెల్సన్ మండేలా. వీళ్లని తలుచుకున్నప్పుడు వొక ఉద్వేగం సుడిగాలి అవుతుంది. అలా డాక్టర్లలో ఎవరున్నారు? కెనడా: హెన్రీ నార్మన్ బెథూన్… ఇండియా: ద్వారకానాథ్ కోట్నీస్.. అర్జెంటీనా: ఎర్నెస్టో చేగువేరా. ఈ ముగ్గురిలోనూ ఒక ప్రత్యేకత వుంది.బెతూన్, కోట్నీస్ ఇద్దరూ చైనా వెళ్లి, సైనికులకు వైద్యం చేసి, అక్కడే చనిపోయారు. చేగువేరా క్యూబాలో విప్లవం తెచ్చి, కాంగో, బొలీవియాలనీ విముక్తి చేయాలని వెళ్లి అక్కడ ప్రాణత్యాగం చేశాడు.

16 ఏళ్లకే నార్మన్ బెతూన్ జీవిత కథ చదివాను. మరపురాని అనుభవం అది. వైద్యవృత్తి నెత్తురుతాగే వ్యాపారంగా మారడాన్ని చూస్తున్న ఈ రోజుల్లో రోగుల కోసం రక్తం ధారబోసిన నార్మన్ బెతూన్ని తలచుకుందాం. టొరంటోకి 160 కి.మీ. దూరంలోని GRAVENHURSTలో 1890 మార్చి 3వ తేదీన పుట్టాడు నార్మన్ బెతూన్. బెతూన్ తాత నార్మన్ మిలటరీ సర్జన్. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు HENRY DUNANTతో కలిసి నాటి క్రిమియా యుద్ధకాలంలో పనిచేశారు. వైద్యుల కుటుంబానికి చెందిన బెతూన్ 1909లో టొరంటో యూనివర్సిటీలో ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ చదివాడు. చదువు ఖర్చుల కోసం కొందరికి ఇంగ్లీష్ నేర్పేవాడు. స్థానిక పత్రికకి విలేకరిగానూ పనిచేశాడు. నిక్కచ్చి మనిషి. దూసుకుపోయే తత్వం. జనం కోసం ఏమన్నా చేయాలన్న తపన. 1914 సెప్టెంబర్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికి బెతూన్ వయసు 24 ఏళ్లు. ఫ్రాన్స్ వెళ్లాడు. స్ర్టెచర్ మోసే పని. గాయపడిన సైనికులను గబగబా స్ట్రెచర్ మీద తీసుకెళ్లడం. ఆరు నెలల తర్వాత బెల్జియంలో జరిగిన battle of Ypres యుద్ధరంగానికెళ్లాడు. అక్కడో పదునైన ఆయుధం కాల్లో గుచ్చుకుంది.

వెనక్కివచ్చి 1916 కల్లా మెడిసిన్ పూర్తిచేశాడు.1917 నుంచి మళ్లీ యుద్ధంలోకి.. పూర్తి అయ్యేదాకా నేవీ సర్జన్గా పనిచేశాడు. లండన్, ఎడిన్ బరోలో మూడేళ్లు సర్జికల్ హౌస్ ఆఫీసర్ గా పనిచేశాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. మిచిగన్, డెట్రాయిట్లో సర్జన్ గా చేశాడు. వేల్ యూనివర్సిటీలో టీచర్గా పేరుపొందాడు. సామాజికకార్యకర్తగా, గొప్ప సర్జన్గా బెతూన్ని గుర్తించారు. 34 ఏళ్లకే హృద్రోగ నిపుణుడిగా, థొరాసిక్ సర్జరీ స్పెషలిస్టు గా ఖ్యాతిగాంచారు. 1926లో ఒక రోజు బెతూన్కి అలసటగా అనిపించింది. టెస్ట్ చేయించుకుంటే టి.బి అని తేలింది.. అప్పటికి, విశ్రాంతి తీసుకోవడమే టి.బి.కి మందు. న్యూయార్క్ శానిటోరియంలో చేరాడు. అలా ఖాళీగా మంచంమీదే వుండడం నచ్చలేదు. తోటి రోగుల్ని పోగుచేసి షికార్లు తిప్పి కబుర్లు చెప్పి మంచం మీదే పడి వుండనక్కర్లేదని వాళ్లకి ధైర్యం చెప్పాడు. ఆర్టిస్టు కూడా అయిన బెతూన్ కాగితాలు సంపాదించి రంగుల బొమ్మలు వేశాడు. పెద్ద పెద్ద కుడ్య చిత్రాలు గీశాడు. ఇక కోలుకోలేనేమోననే దిగులు కుంగదీసింది. ప్రతి బొమ్మ కిందా కవిత్వం రాశాడు. ఒక పెద్ద డాక్టరు తెగించి బెతూన్కి ఆపరేషన్ చేశాడు. రెండు నెలల్లోనే బాగా కోలుకున్నాడు. ఒక ఏడాది శానిటోరియంలోనే గడిచిపోయింది.

తర్వాత అమెరికా వైద్యవిద్యార్థులకు తర్ఫీదు యిచ్చాడు. మళ్లీ కెనడా చేరుకున్నాడు. సామాన్యజనానికి వైద్యసేవలు అందించాడు. 1935 వేసవిలో లెనిన్ గ్రాడ్ వెళ్లాడు. అది తొలి అంతర్జాతీయ ఫిజియోలాజికల్ సభ. కండిషన్డ్ రిఫ్లెక్సెస్ గురించి చెప్పిన సుప్రసిద్ధ డాక్టర్ పావ్లోవ్ ఆ సభకి అధ్యక్షుడు. పావ్లోవ్ స్ డాగ్ అంటాం కదా! స్టాలిన్ నాయకత్వంలో సోవియోట్ యూనియన్ వైద్యరంగంలో ఏం సాధించిందో తెలుసుకోవాలని బెతూన్ లెనిన్ గ్రాడ్లో అనేక ఆస్పత్రులకు వెళ్లాడు. క్షయవ్యాధి కట్టడికి రష్యా డాక్టర్లు అనుసరించిన విధానంచూసి ఆనందాశ్చర్యాలతో అవాక్కయ్యాడు బెతూన్. అక్కడి నుంచి తిరిగి రాగానే కెనడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. మాంట్రియల్లో ప్రజావైద్యశాల ప్రారంభించాడు. డాక్టర్లంతా ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలనీ, ప్రభుత్వం డాక్టర్లకి జీతాలు యివ్వాలనీ గట్టిగా ప్రచారం చేశాడు.

కెనడాలో పారిశుధ్యం దుర్భరంగా వుందనీ, ఆస్పత్రుల్లో సౌకర్యాలు అరకొరగా వున్నాయనీ గొంతెత్తి చెప్పాడు. 1936 రానే వచ్చింది. జూలైలో స్పెయిన్ అంతర్యుద్ధం మొదలైంది. నియంత ప్రాన్సిస్కో ఫ్రాంకో ఫాసిస్టు పాలనకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయ్యింది. ఆ సమయంలోనే స్పానిష్ మహాకవి ఫ్రెడరికో గార్షియాలోర్కాని ఫ్రాంకో సైనికులు కాల్చి చంపారు. ప్రఖ్యాత బ్రిటిష్ మార్క్సిస్ట్ రచయిత క్రిస్టోఫర్ కాడ్వెల్ కూడా ఆ యుద్ధంలోనే మరణించారు. అప్పుడు, కాద్వేల్ వయసు 30. లోర్కా వయసు 38. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో వుండాలి. కమ్యూనిస్టుగా కర్తవ్యం నెరవేర్చాలి. నార్మన్ బెతూన్ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చేరుకున్నాడు. ప్రజలు న్యాయంగా ఎన్నుకున్న రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఫ్రాంకో ఫాసిస్టు సేన కుట్ర చేసింది. హిట్లర్, ముస్సోలినీ ఫ్రాంకోకి మద్దతుగా నిలబడ్డారు.

స్పెయిన్ కమ్యూనిస్టుల ప్రతిఘటన తీవ్రంగా అయింది. గాయపడ్డవాళ్లకి బెతూన్ నాయకత్వంలోని డాక్టర్ల బృందం వైద్యం చేస్తోంది. మొబైల్ బ్లడ్ transfusion సర్వీస్ అత్యవసరం అని బెతూన్ గుర్తించాడు. స్పానిష్ అధికారులు ఓకే అన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ వెళ్లి బెతూన్ పరికరాలు తెచ్చాడు. ఒక రిఫ్రిజిరేటర్, ఇంక్యుబేటర్, స్టెరిలైజర్ యూనిట్తో బ్లడ్ transfusion సర్వీసు ప్రారంభించాడు. బెతూన్ కొత్త ఆలోచన, చురుకైన పనితనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెయ్యి కిలోమీటర్లు విస్తరించిన యుద్ధరంగంలో 100 ఆస్పత్రుల్లో ఈ యూనిట్లతో పని మొదలుపెట్టారు. గాయపడ్డ కొన్ని వందలమందిని ఆదుకున్నారు. బెతూన్ ఒక గెరిల్లాలా మెరుపు వేగంతో పనిచేశాడు.కొత్తగా ఆలోచించడం, తక్షణ అమలు చేయడం ఎంత తెగించి పనిచేస్తున్నా, ఆ దారుణమైన పరిస్థితుల నుంచి బయటపడటమే మంచిదని బెతూన్కి సహచరులు నచ్చజెప్పారు. 1937 జూన్లో మాంట్రియల్ తిరిగి వచ్చాడు. వెయ్యి మందికి పైగా జనం స్వాగతం చెప్పారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటం ప్రాధాన్యం వివరిస్తూ ప్రచార సభల్లో మాట్లాడాడు బెతూన్.చిట్టచివరి మజిలీ కమ్యూనిస్టు చైనా 1937లో జపాన్ చైనాపై యుద్ధం ప్రకటించింది. విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి.

ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం పక్షాన నిలబడాలని బెతూన్ నిర్ణయించారు. కెనడా కమ్యూనిస్టు పార్టీ, న్యూయర్క్ లోని చైనా సహాయమండలితో సంప్రదించాడు. తక్షణ వైద్యసహాయం అందాలని చెప్పాడు. 1938 జనవరిలో కెనడా నర్సు నేన్ ఎవెన్తో కలిసి వాంకూవర్ నించి బయల్దేరాడు బెతూన్. సముద్రం మీద హాంకాంగ్ చేరుకున్నారు. అక్కడ్నించి రైళ్లలో, గుర్రాలమీద, నడిచీ..సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఉత్తర చైనాలోని యేనాన్ చేరుకున్నారు. జపాన్ సైన్యం దాడులు చేస్తూనే వుంది. యేనాన్ కొండల్లోని చైనా కమ్యూనిస్టు పార్టీ హెడ్క్వార్టర్స్లో బెతూన్, చైర్మన్ మావో సేటుంగ్ని కలిశాడు. స్పెయిన్లో బెతూన్ సాహసగాథలు విని వున్న మావో ఎంతో ఆదరంతో మాట్లాడి, అదే నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఆల్ చైనా మెడికల్ ఫోర్సెస్కి బెతూన్ని కమాండర్గా నియమించారు. “మావోని కలిసిన వాళ్లెవరైనా మంత్రముగ్ధులవుతారు. ప్రపంచంలో అతి గొప్ప మనుషుల్లో ఆయన ఒకరు“ అని బెతూన్ రాసుకున్నారు.

తక్షణమే రంగంలోకి దిగారు. గాయపడ్డ సైనికుల్ని కలిశారు. మంచి వైద్యపరికరాలు లేవు. కొండల మధ్యే మట్టి కొంపలే ఆస్పత్రులు. అక్కడే గాయాలు నయం చేసేందుకు మందులు ఇవ్వాలి. తగినన్ని పరికరాలు తెప్పించాలని చెప్పాడు. మొదటి నెలరోజుల్లోనే 147 ఆపరేషన్లు చేశాడు బెతూన్. చైనా పార్టీలో ఎనిమిదో రూట్ సైన్యం ప్రధానమైనది. ఆ దళాల్లోని సైనికులకు చికిత్స చేయడమే బెతూన్ పని. అక్కడ దాదాపు నాటు వైద్యమే నడుస్తోంది. యువకులు కొద్దో గొప్పో చదువుకున్న వాళ్లు, ఆధునిక ఆస్పత్రి అంటే తెలీదు. అసలు ఆస్పత్రి చూడనివాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్లకు వైద్యం నేర్పాడు. తీరిక లేకుండా రేయింబవళ్లు పనిచేశాడు. గాయపడిన వాళ్లకు మందులు ఇవ్వడంతోపాటు తనే స్వయంగా బొమ్మలు గీసి, ఎముకలు విరిగిన వాళ్లకి అవసరమయ్యే కర్రచట్రాలూ, మంచాలూ ఎలా తయారు చెయ్యాలో వడ్రంగులకు నేర్పాడు. బెతూన్కి నెలకి 100 యువాన్ల భత్యం ఇవ్వాలని మావో ఉత్తర్వులు జారీ చేశాడు. ఇక్కడి సైనికుల దుఃఖాన్నీ, సంతోషాన్నీ పంచుకొంటున్నానని బెతూన్ మావోకి లేఖ రాశారు. క్షతగాత్రుల ఆహారం కోసం ఆ 100 యునాన్లు వాడాలని పార్టీని బెతూన్ కోరాడు. 

మిగతాది పార్ట్ 2 లో    గుడినే ఆసుపత్రిగా మార్చేశాడు !

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!