పసిడి వేటలో ప్రభుత్వాలు! (2)

Sharing is Caring...

 

Gold mining————————–

యూపీ .. బీహార్ రాష్టాల్లో బంగారు గనులున్నాయని జీఎస్ ఐ అధికారులు గుర్తించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీ ఎస్ ఐ కి సహకరిస్తూ బంగారాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని  భూగర్భ గనుల్లో వేల టన్నుల బంగారం ఉన్నట్టు జీఎస్ఐ గుర్తించింది. త్వరలో ఇక్కడ బంగారం నిక్షేపాల తవ్వకాలు మొదలు కానున్నాయి.

జీఎస్ఐ బృందం గత 15 ఏళ్లుగా దీనికోసం సోన్‌భధ్రలో పనిచేస్తోంది. 8 ఏళ్ల క్రితం భూమిలో బంగారం ఖనిజం ఉన్నట్టు కనుగొన్నారు. ఇక బంగారం తవ్వకాలే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ గుట్టను అమ్మడానికి ఈ-వేలం ప్రక్రియ ప్రారంభించింది. జీఎస్ఐ టీమ్ చాలాకాలం గా  ఇదే పనిలో ఉంది. ఇదే క్రమంలో జియో ట్యాగింగ్ కూడా పూర్తి అయింది. ఈ జిల్లాలో యురేనియం నిల్వలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. దీని అన్వేషణ కోసం కేంద్రం కొన్ని బృందాలను నియమించింది.

జీఎస్ఐ వివరాల ప్రకారం సోన్‌భద్రలోని సోన్ కొండపై సుమారు మూడు వేల టన్నుల పసిడి , హరదీ బ్లాక్‌లో సుమారు 600 కిలోల పుత్తడి నిక్షేపాలు ఉన్నాయి. దీనితోపాటు పుల్వార్, సలయ్యా హీడ్ బ్లాక్‌లో కూడా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ముడి ఖనిజం నుంచి ఎంత బంగారం లభిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం.నిపుణులు మాత్రం ఖనిజం నాణ్యమైనది అయితే, దాని నుంచి లభించే బంగారం ఆ ఖనిజంలో దాదాపు సగం ఉంటుందని చెబుతున్నారు.

ఇక్కడ భూమిలో 90 టన్నుల అండలూసైట్, 9 టన్నుల పొటాష్, పది లక్షల టన్నుల సిలెమినాయిడ్ నిల్వలను కూడా జీఎస్ఐ కనుగొన్నది.2005లో సోన్‌భద్రలో సర్వే చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ బంగారం ఉందని కనుగొన్నది. దాన్నిదృవీకరించే సరికి 2012 వచ్చింది.వివిధ శాఖల సమన్వయంతో మొత్తానికి ఇప్పటికి రంగం సిద్ధమైంది.

ఖనిజాలు భారీ స్థాయిలో లభించే అవకాశం ఉండడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వేచేశారు. పసిడి లభించే ఈ కొండ ప్రాంతం దాదాపు 108 హెక్టార్లలో విస్తీర్ణంలోఉంది. సోన్‌భద్ర దుద్ధీ తాలూకాలో ఉన్న సోన్ కొండలకు శతాబ్దాల  చరిత్ర ఉంది. ఇక్కడ ఒకప్పుడు రాజా బరియార్ షా కోట ఉండేది. కోటకు రెండు వైపులా శివ కొండ, సోన్ కొండలు ఉండేవి.

రాజు కోట నుంచి రెండు కొండల వరకూ కింద అపారమైన బంగారం, వెండి, విలువైన ఖజానా దాగివుందని చెబుతుంటారు. దాదాపు పదేళ్ల క్రితం ఒక రైతు ఇదే ప్రాంతంలో దున్నుతుంటే, అమూల్యమైన లోహాలు లభించాయి. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఇక  బీహార్ లో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని కనుగొన్నారు. బీహార్ లోని జముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఆ బంగారాన్ని వెలికితీసేందుకు ప్రణాళికలను తయారు చేస్తుంది.మైనింగ్ నిర్వహణకు చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.  

జముయి జిల్లాలోని గనుల్లో ఉన్నపసిడి నిల్వలు 222.885 మిలియన్ టన్నులని అంచనా. ఈ మొత్తం దేశంలోని పసిడి నిల్వల్లో 44 శాతానికి సమానం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయం ఇటీవల లోక్ సభలో వివరించారు. నేషనల్ మినరల్ ఇన్వెంటరీ ప్రకారం 2015 మార్చి నాటికి దేశంలోని 501.83 మిలియన్ టన్నుల ముడి బంగారు నిల్వలు ఉండగా.. అందులో ఒక్క బీహార్‌లోనే 222.885 మిలియన్ టన్నులు ఉన్నాయని చెబుతున్నారు. తవ్వకాల్లో ఎంత దొరుకుతుందో చూడాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!