రమణ కొంటికర్ల ……………………………………………
వందల ఎలుకలను గుట్కాయస్వాహా అనిపించిన.. పిల్లుల సమూహం తాము సచ్ఛీలురమన్నట్టు.. బుద్ధిమంతులమన్నట్టు.. నిజాయితీకి మారుపేరన్నట్టు.. మాట్లాడితే.. లోకం ఏమనుకోవాలి…? జంధ్యాల పోయినా.. కామెడీని మాత్రం మన పొల్టీషియన్స్ కు వదిలివెళ్లారనేగా.. ? అనుకోవాల్సింది…? ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నేతలపై వేట్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణల నేపథ్యంలో.. వాస్తవాలేంటో తేలాల్సిన సమయంలో.. అది కాస్తా డైవర్టై.. కామెడీ జానర్ లో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు నడుస్తుండటం విషాదమనుకుంటే మాత్రం పొరబడ్డట్టే! దిగ్భ్రాంతికర సంఘటనలతో మానవత్వానికే సవాళ్ళు విసురుతున్న విషాద కరోనా సమయాన.. సీరియస్ పాలి’ట్రిక్స్’ ను ఎయిర్ గన్ మాటల తూటాలతో కామెడీగా మార్చి యావత్ ప్రజానీకాన్ని విషాదం నుంచి హాస్యం వైపు మళ్లించిన నాయక శిఖామణులు ఇప్పుడు వేనోళ్ల పొగడ్తలకర్హులేగా మరి?!!
తాతకు దగ్గులు నేర్పినట్టని ఓ సామెత.. అదిగదిగో అలాంటి పాతరకపు సంప్రదాయపు సామెతలను న్యూ జనరేషన్ కు తెలియజేసేలా.. ప్రెస్ ముందుకొచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నారే.. అగో అక్కడే వాళ్ళు అభినందనీయులు. ఒక వేలు ఇతరులకేసి చూపిస్తున్నప్పుడు.. అంతకుముందు తామేంటో.. తమ సచ్ఛీలతేంటో.. వచ్చిన ఆరోపణలపై ఇచ్చిన వివరణల విలువెంతో..ఇవ్వకుండా లైట్ తీస్కున్న నిర్లక్యపు వైఖరేంటో.. ఇవేవీ పట్టించుకోకుండా.. స్వామి వీరభక్తిలో.. వైరభక్తిని అమితంగా చాటుతూ.. మిగిలిన నాలుగు వేళ్లూ తమకేసి చూపిస్తున్నాయన్న సోయి అవసరమే లేకుండా.. కామెడీని పంచగల్గడమంటే.. మాటలా..? ఇప్పటివరకు 64 కళల గురించి మాత్రమే విన్నవారికి.. వారే సృష్టించి, కనుక్కుని.. పరిచయం చేసిన అరవైఐదో కళగదా అదీ..?!!
భూమి పుట్టుక కంటే ముందే మానవ జన్మ ప్రారంభమైందన్న వితండవాదం చేసేవారిలా.. సదరు రాజకీయంలో ప్రత్యర్థి ప్రస్థానాన్ని ప్రస్తావించి.. తుపాకీరాముడి తూటాలై పిప్పిచేసి.. తమ జ్ఞానసంపదను మీడియా ముందుంచితే.. ఈలోకానికింతకన్నా కామెడీ జానర్ ఏముంటుంది…?
అంతకుముందు నుంచే గూడు కట్టుకుని.. ఆ గూడు కాస్తా కాంక్రీట్ బిల్డింగ్ లా మారిన అక్కసును చక్కగా ప్రదర్శిస్తూ.. ఏది పడితే అది.. ఎంత పడితే అంత.. ప్రత్యర్థిపై మాటలాడుతున్నప్పుడు.. పౌరసమాజం.. వావ్ ఎంత బాగా మాటలాడుతున్నారు.. ఎంత పరిణతి చెందిన లీడర్లు వీరని గర్వపడేలా రాజకీయాల్లో దైవభక్తిని మించింది స్వామి భక్తని నిరూపించి.. జబర్దస్త్ కామెడీని పంచిన తీరుతో.. ఇవాళ సోషల్ మీడియా కామెడీ హీరోలైన మీకిచ్చేందుకు ఆస్కార్ కూ అర్హత లేదేమో బహుశా!
రాజకీయాలచ్చిరాక తమిళనాడులో నటులు పాలిట్రిక్స్ లో బొక్కబోర్లా పడుతున్న వేళ… రాజకీయ నాయకులూ మంచి హాస్యాన్ని పండించొచ్చన్న చందంగా సాగిన మీ అభినయం.. నటులు రాజకీయ నాయకులవ్వడమన్నది.. రాజకీయాలను శాసించడమన్నది పాత మాట.. రాజకీయ నాయకులు నటులు కావడమన్నది కొత్త పలుకని నిరూపిస్తిరి గదరా..?!!
కరోనా బారినపడి సమాజం ఆందోళన దిశలో సాగుతున్న వేళ.. గిట్టనివారిని పట్టుబట్టి టాపిక్ డైవర్ట్ చేయడమేనన్నవారికి.. కాదు కాదు అంతకుమించి కరోనా గిరోనా ఏదీ గుర్తు రాకుండా.. అధిష్ఠాన పెద్దలే జన భయాందోళనలు తరిమికొట్టేంత… కరోనాతో కాటికెళ్లి క్యూలో విగతజీవులుగా పడి ఉన్నవాళ్లంతా.. పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వేలా ప్రొడ్యూస్ చేసి పండించిన మీ హాస్యభరిత పార్టీకథా చిత్రం విలువను ఏ ఓటీటీ మాత్రం భరించగలదు చెప్పండి..? అందుకే పెద్దమనసుతో.. న్యూస్ ఛానళ్ల ద్వారానే మీ హాస్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు, వీక్షకులందించిన మీ అభినయం.. ఈ కరోనా ఉన్నంతకాలం వర్ధిల్లుగాక.