గిర్నార్ పరిక్రమ.. ఇదొక ప్రకృతి యాత్ర !!

Sharing is Caring...

Girnar Parikrama …………………..

ఇదొక ఆహ్లాదకరమైన యాత్ర. ప్రకృతి ఒడిలో పర్వతం చుట్టూ నడిచే యాత్ర. గుజరాత్‌లోని జూనాగఢ్‌లో జరిగే గిర్నార్ పరిక్రమ (లీలీ పరిక్రమ)  అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి నుండి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా నవంబర్ నెలలో వచ్చే ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

గిర్నార్ పర్వతం చుట్టూ కాలినడకన చేసే ఈ పరిక్రమ సుమారు 36 కిలోమీటర్లు ఉంటుంది. జూనాగఢ్ సమీపంలోని ‘భవనాథ్ తలయేటి’ (గిర్నార్ అడుగుభాగం) వద్ద ప్రారంభమై మళ్ళీ అక్కడే ముగుస్తుంది. ఈ యాత్రలో జీణా బావా ని మఢీ, మాల్వేలా, బోరదేవి వంటి దట్టమైన అడవి ప్రాంతాల గుండా ప్రయాణం సాగుతుంది.

గిర్నార్ పర్వతం శివుడు, దత్తాత్రేయ స్వామి,అంబికా మాతకు నిలయంగా భావిస్తారు. ఈ 36 కి.మీ పరిక్రమ చేయడం వల్ల 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో, గిర్ అడవుల గుండా సాగే ఈ యాత్ర భక్తులకు శారీరక, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 

ఈ పరిక్రమ మధ్యలో రాత్రి బస చేయడానికి మూడు ప్రధానమైన పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ భక్తులు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.. జినా బావా ని మఢీ (Zina Bava ni Madhi): ఇది పరిక్రమ ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి ప్రధాన బస. ఇక్కడ విశాలమైన మైదానం..  పందిళ్లు వేస్తారు. భక్తులు ఇక్కడ వంట చేసుకుని, రాత్రి నిద్రపోతారు.

మాల్వేలా (Malvela): ఇది రెండో రోజు రాత్రి బస చేసే చోటు. దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో పాత దేవాలయం ఉంటుంది. ఇక్కడ ప్రకృతి ఒడిలో గడపడం ఒక గొప్ప అనుభవం.

బోరదేవి (Boradevi) ఇది మూడో రోజు లేదా చివరి బస. ఇక్కడ బోరదేవి మాత ఆలయం ఉంటుంది. ఇక్కడి నుండి పరిక్రమ ముగింపు దశకు చేరుకుంటుంది. ఇక్కడ హోటళ్లు ఉండవు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే అన్నక్షేత్రాల్లో ఉచితంగా భోజనం దొరుకుతుంది.

రాత్రిపూట అడవిలో చలి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా దుప్పట్లు,ఒక చిన్న టార్చ్ లైట్ ఉంచుకోవాలి. మరుగుదొడ్ల సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది..యాత్ర పొడవునా స్థానిక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, తాగునీరు అందిస్తాయి .

ప్రభుత్వం భారీ భద్రత కల్పిస్తూ ..  వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.గిర్ సింహాల సంరక్షణ దృష్ట్యా యాత్రికులు క్రమశిక్షణతో ఉండాలి. కొంతమంది ఒక రోజులోనే యాత్ర పూర్తి చేస్తుంటారు.  కార్తీక మాసం లోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వెళ్తుంటారు.ప్రకృతి ప్రేమికులకు యాత్ర బాగా నచ్చుతుంది.కారులో వెళ్లే అవకాశం లేదు,తప్పనిసరిగా నడవాలి.  

ఈ యాత్ర చేయాలనుకుంటే …రాజ్‌కోట్ విమానాశ్రయం జూనాగఢ్‌ కు సుమారు 100 కి.మీ దూరంలో ఉంది. అక్కడికి చేరుకుంటే టాక్సీ లేదా బస్సులో 2 గంటల్లో జూనాగఢ్ చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జూనాగఢ్‌కు అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్,ముంబై వంటి ప్రధాన నగరాల నుండి నేరుగా రైళ్లు ఉన్నాయి. అక్కడ నుంచి బస్సులో వెళ్లవచ్చు.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!