అమ్మకానికి దెయ్యాలు !!

Sharing is Caring...

కావేవీ అమ్మకాని కనర్హం ! దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే  దెయ్యం హాట్ సబ్జెక్టు గా మారింది. దెయ్యాల మీద ఎంతో వ్యాపారం జరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారు. దెయ్యాలతో ఒక రాత్రి అంటూ స్పెషల్ ట్రిప్స్ కూడా అందుబాటులో కొస్తున్నాయి. ఆ మధ్య దెయ్యాల దీవిని అమ్మకానికి కూడా పెట్టారు. అసలు  దెయ్యాలు లేవనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ? ఉన్నాయని వాదించేవాళ్ళు .. నమ్మే వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు.

ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని ఆ మధ్య ఓ ప్రబుద్ధుడు దెయ్యాలను అమ్ముతా అంటూ ప్రచారం చేసాడు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సర్కోబో  అనే ఊళ్ళో ఇది జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా..ఉన్నా ఇది నిజం. సర్కోబో   గ్రామంలో జనాలు దయ్యాలున్నాయని గట్టిగా నమ్ముతారు. వాటితో స్నేహం చేస్తే  ఏ పని అయినా చేసిపెడతాయని .. అదృష్టం కలసి వస్తుందని నమ్మేవారట.

ఇదంతా గమనించి  నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి తన దగ్గర దెయ్యాలు ఉన్నాయని, వాటిని కొనుక్కుంటే అంతా మంచే జరుగుతుందని ప్రచారం మొదలు పెట్టారు. నమ్మిన వారు చాలామంది కొనడానికి వచ్చేవాళ్ళు. కొందరు రహస్యంగా వచ్చి కొనుక్కుని వెళ్లారు. అయితే కంటికి కనపడవని .. మచ్చిక చేసుకోవడానికి వాటితో మాట్లాడుతుండాలని … కొన్నాళ్ళు పోయాక అవి కంటికి కనపడతాయని మాయ మాటలు చెప్పేవాడు అతగాడు. నిజమే కాబోలు అనుకునే వారు కొందరు.

అసలు దెయ్యాలు లేవని వాదించే వాళ్ళతో నారాయణ్ తెలివిగా మాట్లాడేవాడు. హనుమాన్ చాలీసాలో దెయ్యాలు ఉన్నట్లు రాసి ఉంది కావాలంటే వెళ్లి చూసుకోమని చెప్పేవాడు. కొంతమంది ఇతగాడి మాటలు నమ్మి బుట్టలో పడేవారు. వ్యాపారం పుంజుకుని చుట్టూ పక్కల గ్రామాల వారు కూడా ఇతగాడి దగ్గరికి వచ్చే వాళ్ళు. మెల్లగా ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. వాళ్ళు తమదైన శైలిలో కుమ్మేసారు. ఒక్క దెయ్యం కూడా వచ్చి అతగాడిని రక్షించలేదు. ఆరేళ్ళ క్రితం పై  ఘటన జరిగింది. 

ఇలాంటిదే మరో సంఘటన 10 ఏళ్ళ క్రితం న్యూజిలాండ్ లో జరిగింది. అక్కడ ఒకతను రెండు సీసాల ఫోటోలు వెబ్సైటులో పెట్టి వీటిలో దెయ్యాలున్నాయి అంటూ వేలం పాట మొదలు పెట్టాడు. అతగాడు ఈ దెయ్యాల గురించి ఏం చెప్పాడంటే… “ఈ రెండు దెయ్యాలూ నా ఇంట్లో నానా గొడవ చేసేవి. ఒక మాంత్రికుని సహాయంతో ఈ రెండు దెయ్యాలను పట్టి మంత్రించిన నీళ్ళు ఉన్న ఈ సీసాల్లో బంధించి ఉంచాం.

ఆ తెల్లటి నీరు నీలి రంగులోకి మారింది. కాబట్టి ఆ దెయ్యాలు ఆ సీసాల్లో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు అతగాడు. డైలీ టెలి గ్రాఫ్ ఆన్ లైన్ పత్రిక  ఈ కథనాన్ని ప్రచురించింది. వెబ్సైటు లో ప్రకటనను దాదాపు లక్షమందికి పైగా వీక్షించారు.  వేలం పాట 1500 న్యూజీలాండ్ డాలర్ల దాకా వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలీదు. వెబ్సైటు ఆచూకీ లేదు. ఎవరైనా ఆ దెయ్యాలను కొన్నారో లేదో ? అవి వచ్చి చెబితే కానీ తెలీదు. నమ్మి కొనే వాళ్ళు ఉంటే.. దేన్నీ అయినా అమ్మేవాళ్ళు ఉన్నారు ఈ దునియాలో.. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!