చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

Sharing is Caring...

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి  శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. క్రీ.శ: 1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర కారుల కథనం.

ఈ ఘటిక సిద్ధేశ్వరస్వామి ఆలయం  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని శ్రీ సిద్ధేశ్వరకోనలో ఉంది. చుట్టూ నల్లమల కొండలు,పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు.  ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకున్న దశలో ఈ ఆలయాన్ని 1974లో అవధూత కాశినాయన పునరుద్ధించారు. కాశీ నాయన ఆశ్రమం వారు భక్తులకు నిత్యాన్నదానం చేస్తుంటారు.

సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సిద్దేశ్వర కోన అనే పేరు వచ్చింది. ఆలయం  పక్కనే ఉన్న కొండపైన గుహల్లో సాధువులు తపస్సు చేస్తుంటారని అంటారు. కొండపైకి వెళితే ఓంకార ధ్వని వినిపిస్తుందే కానీ సాధువులు మాత్రం కనిపించరని భక్తులు చెబుతారు.కొండ మీద ఉన్న గుహల్లో ఒక చోట శివలింగం .. మరోచోట కాళికా విగ్రహం . ఇంకోచోట సీతారాములు , ఆంజనేయుడు విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలకు రోజు పూజలు జరుగుతుంటాయి. ఎవరు ఎపుడు వచ్చి పూజలు చేస్తుంటారో తెలీదని భక్తులు అంటుంటారు.

ప్రతి ఏటా  శివరాత్రి ., కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భైరవ కోన నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ క్షేత్రం. భైరవకోన దర్శించినవారు ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు.  నెల్లూరు నుండి ఆత్మకూరు, ఉదయగిరి మీదుగ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. బస్సు సదుపాయం తక్కువే.సొంత వాహనాలలో వెళ్ళడం మంచిది. రవాణా సౌకర్యం కల్పించి .. ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!