Muralidhar Palukuru………………………
Legendary in prison……………………………………..
.మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మనందరికీ గాయకుడిగానే తెలుసు. కానీ ఘంటసాల స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బళ్లారి జైలు లో శిక్ష అనుభవించారు. ఘంటసాల అప్పట్లో సంగీత కచేరీలు చేస్తూనే … నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడుతుండేవారు.
1942 లో కార్చిచ్చు లాగా విప్లవం ఎగిసిపడింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసింది. ఎందరో నాయకులు అప్పటికే జైళ్లలో మగ్గుతున్నారు. ఆ సమయంలో ఘంటసాలలో అంతర్మధనం మొదలైంది. దేశం కోసం తానేమి చేయాలో ఆలోచనలో పడ్డారు. తనకు చేతనైనది చేయాలనే తలంపుతో బ్రిటిష్ వైఖరిని నిరసిస్తూ రాసిన పాటలను, పద్యాలనూ వేదికలెక్కి పాడుతూ .. తన గానంతో వాటిని జనాల్లోకి తీసుకెళ్లారు.
అలా ఉద్యమంలో ఒక కార్యకర్తగా పని చేశారు. అదే సమయంలో కోస్తా జిల్లాలలో రైతు ఉద్యమం సాగుతోంది. 1942 ఆగస్టు 12 న తెనాలి ప్రాంత రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 7 గురు మృతి చెందారు. ఆగస్టు 13 న గుంటూరు లో, ఆగస్టు 17న భీమవరం లో మళ్ళీ రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. కాల్పులు జరిగాయి. దీంతో ఉద్యమం గ్రామ గ్రామాలకు పాకింది. రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. మోటూరు వద్ద రైతులు రైలు పట్టాలు … తీగలు తొలగించారు. అపుడు ఘంటసాల అక్కడ లేరు.
అయినా ఆయనపై కూడా కేసు బనాయించారు. గుడివాడ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో 8 నెలల పాటు విచారణ జరిగింది. విచారణ సమయంలో ఘంటసాల ను గుడివాడ,కైకలూరు,బందరు సబ్ జైళ్లలో నిర్బంధించారు. ఈ జైళ్లలో సరైన తిండి , గాలి లేక ఘంటసాల ఆరోగ్యం పాడైంది. విచారణ లో ఘంటసాల పాడిన ప్రతి పాటకు, పద్యానికి ఒక నెల చొప్పున శిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ వారు కోరారు. అలాగే రైలు పట్టాలు తొలగించినందుకు అదనపు శిక్ష వేయాలని న్యాయమూర్తులకు సూచించారు.
మొత్తం మీద ఘంటసాలకు 6 నెలల జైలు శిక్ష పడింది. 1943 ఏప్రిల్ 24 న బళ్లారిలో అల్లీ పురం కు తరలించారు. ఆ జైలులో 18 బ్లాకులు ఉన్నాయి. అవన్నీ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నాయకులతో .. యువకులతో… మామూలు ఖైదీలతో నిండిపోయాయి. సరైన తిండి కూడా పెట్టేవారు కాదు.
పురుగులున్న ఆహరం పెడుతున్నారని జైలులో పలువురు నేతలు దీక్షలు చేశారు. పాయిఖానాలు కూడా పరిశుభ్రం గా ఉండేవి కావు. దీంతో పొట్టి శ్రీరాములు, గోరా,యెర్నేని సాధు, యలమంచిలి వెంకటప్పయ్య వంటి నేతలు పాయిఖానాలు శుభ్రపరిచే ఉద్యమాన్ని మొదలెట్టి జైలు అధికారుల కళ్ళు తెరిపించారు. ఘంటసాల ఈ నాయకుల సాంగత్యంతో మరింత స్ఫూర్తి ని పొందారు.