కొత్త సర్వీసు చార్జీలతో వీర బాదుడు !!

Sharing is Caring...

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ అఫ్ బరోడా సర్వీసు చార్జీలు విధించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బ్యాంకులో డబ్బులు వేయాలన్నా చార్జీలు చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఒక్కో లావాదేవీకి రూ. 50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితుల తర్వాత ఒక్కో లావాదేవికి ఈ నిబంధన వర్తిస్తుంది. మెట్రో నగరాలు , పట్టణ ప్రాంతాల ఖాతాదారులు డబ్బు డిపాజిట్ చేయాలంటే 50 రూపాయలు చెల్లించాలి. అదే గ్రామీణ ప్రాంతాలు , చిన్న పట్టణాలలో సీనియర్ సిటిజెన్లు,పింఛనుదారులు, సేవింగ్స్ ఖాతాదారులు మూడు ఉచిత లావాదేవీల తర్వాత ఒక్కో లావాదేవికి రూ. 40 చొప్పున చెల్లించాలి. 

ఇంకా కరెంట్ ఖాతా , ఇతర ఖాతా దారులు  రోజు లో లక్ష డిపాజిట్ చేస్తే, తర్వాత డిపాజిట్ చేసే మొత్తానికి 50 చెల్లించాలి.  బ్యాంకు విధించిన సవరణలు చూసి ఖాతాదారులు బెంబేలెత్తి పోతున్నారు. ఒక ప్రభుత్వ బ్యాంక్ ఈ విధంగా చార్జీలు వేయడం ఏమిటనే ఖాతాదారులు వాపోతున్నారు. ఎక్కడైనా సొమ్ము డిపాజిట్ చేస్తామంటే కాఫీ ,కూల్ డ్రింక్స్ ఇచ్చిమరీ మర్యాద చేస్తారు. కొన్ని బ్యాంకులు అయితే ఇంటికొచ్చి మరీ లాంఛనాలు పూర్తి చేస్తాయి. ఇక విత్ డ్రాయల్ విషయానికొస్తే ఏటీఎం ద్వారా కాకుండా బ్యాంకు నుంచి మూడు లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత 125 చొప్పున చెల్లించుకోవాలి. ఈ బాదుడు కూడా సామాన్యంగా లేదు. ఆ మెట్రో నగరాలకు మాత్రమే. చిన్న పట్టణాలు , గ్రామీణ ప్రాంతాలలో అయితే 100 చొప్పున చెల్లించాలి. కరెంట్ అకౌంట్ హోల్డర్లు కూడా పరిమితి దాటితే ఆ తరువాత రూ, 150 చెల్లించుకోవాలి. పాపం జనధన్  ఖాతాదారుల మీద దయచూపి మినహాయింపు ఇచ్చారు. పెంచిన కొత్త చార్జీలు నవంబర్ 1 నుంచే అమలులో కొచ్చాయి. 

 ఇపుడు బ్యాంక్ అఫ్ బరోడా ను  చూసి మిగతా బ్యాంకులు కూడా ఇవే నిబంధనలు విధిస్తాయి. ఇప్పటికే  సేవింగ్స్ ఖాతాల్లో కనీస నెలవారి నగదు నిల్వ  లేదనే సాకుతో బ్యాంకులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి . ముక్కు పిండి భారీ జరిమానాలు వసూలు చేస్తున్నాయి. రకరకాల రుసుముల పేరిట  ఖాతాదారులను వీర బాదుడు బాదుతున్నాయి.  ప్రభుత్వ,  ప్రైవేట్ రంగ  బ్యాంకులు పోటీ పడి మరి  ఖాతాదారులపై  భారం మోపుతున్నాయి .   ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు వేస్తోన్న జరిమానాలు  పేదలు, మధ్య తరగతి వారికి వ్యతిరేకంగా ఉన్నాయనే  విమర్శలు  వెల్లు వెత్తుతున్నాయి . పేదల నోళ్లు కొట్టి పెద్దలకు కట్ట బెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

బ్యాంకులకు వెళితే మన సొమ్ము అవసరమైన మేరకు తీసుకునే పరిస్థితులు లేవు .  ఏటీఎంల నిర్వహణ సరిగ్గాలేదు.  అధిక భాగం ఏటీఎం లలో నగదు లభించని పరిస్థితి నెలకొంది. ప్రజల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న బ్యాంకులు సేవలు మాత్రం విస్మరిస్తున్నాయి.  ఈ లోపాలకు బాధ్యులు ఎవరు ? వీటి గురించి జవాబు దొరకదు. ఇక దేశంలోని బ్యాంక్‌లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వీటి గురించి పట్టించుకునే నాధుడే లేడు. 

———-  KNMURTHY     

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!