పెళ్ళీ చేసుకొని .. జంట కవుల వలే …

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………

టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన పెళ్లి చేసి చూడు…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.షావుకారు…పాతాళభైరవి…తర్వాత ముచ్చటగా మూడో సినిమా పెళ్లి చేసి చూడు.

విజయా కేరాఫ్ విజయంగా సెటిలైపోయింది. అంతే కాదు…వి ఫర్ వినోదం అనే మాట కూడా జనంలోకి క్యారీ అయిపోయింది. చక్రపాణి తయారు చేసిన కథను అత్యద్భుతంగా తెరకెక్కించారు ఎల్వీ ప్రసాద్. ఎన్టీఆర్‌కు జోడీగా జి.వరలక్ష్మిని తీసుకున్నారు.సెకండ్ పెయిర్‌గా యండమూరి జోగారావు, సావిత్రి.కీలకమైనది ధూపాటి వియ్యన్న పాత్ర లో ‘పాతాళభైరవి’లో మాంత్రికుడు ఎస్వీ రంగారావు….ఫుల్ కామెడీ… మీ సినిమాలో మెసేజ్ ఏమిటి అని అడిగిన ఓ జర్నలిస్ట్ కు చక్రపాణి విచిత్రమైన సమాధానం చెప్పారట.

మెసేజ్ ఇవ్వడానికి సినిమా ఎందుకు తీయడం? టెలిగ్రామ్ ఇస్తే సరిపోద్ది కదా అనేది గురువుగారు చెప్పిన మాట.అలా వరకట్న సమస్య నేపధ్యంగా తీసుకున్నా ఏ పాత్ర చేతా నినాదాలిప్పించరు.పాత్రల నడవడికతో…కథాగమనంలో విషయాన్ని ఆడియన్స్ కు కన్వే చేస్తారు.జి.వరలక్ష్మి మేనమామ పాత్ర గానీ … ఆయన భార్య పాత్ర చేసిన సూర్యకాంతంగానీ ఎవరూ మరీ పోత పోసిన విలన్లులా కనబడరు … అనివార్య కారణాల చేత దుష్టస్వభావం పొందినట్టుగానే ఉంటారు… అది ఈ కథలో గొప్పతనం …

ఇక పెళ్లి చేసి చూడు సక్సస్ కావడానికి ఇంకో కారణం … అందులో హీరోగా నటించిన ఎన్.టి.ఆర్ గ్లామర్. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో నడివయసు హీరోలను చూసి చూసి బోర్ కొట్టేసిన ఆడియన్స్ కు కుర్ర నందమూరి తారకరాముడు చాలా హాయిగా అనిపించాడు. పాతాళభైరవిలో వీరుడిలా కత్తిదూసిన ఎన్.టి.ఆర్ పెళ్లి చేసి చూడులో రొమాంటిగ్గా కనిపిస్తాడు.

ముఖ్యంగా పాటల్లో ఆయన చాలా అందంగా కనిపిస్తారు. పెళ్లి చేసి చూడులో ఇంకో విశేషం ఏమిటంటే…ఇందులో హీరో చాలా సేపటి వరకు కనిపించడు. సుమారు సినిమా మొదలైన ఓ గంట తర్వాత ప్రత్యక్షమౌతాడు.అయినా ఆడియన్స్ అదేం ఫీల్ కాలేదు. ఎన్.టి.ఆర్ చలాకీతనం వరలక్ష్మితో కలసి చేసే చిలిపి తనాలు…ఏడు కొండల వాడ వెంకటా రమణా లాంటి పింగళి వారి చిలిపి గీతాలు…ఆడియన్స్ ను గిలిగింతలు పెట్టేస్తాయి.

ఇక పెళ్లి చేసి చూడులో పిల్లల హడావిడి చాలా ఉంటుంది. అందుకు తగ్గ బాలనటుల్ని ఎంపిక చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం లాంటి పనులన్నీ రేడియో అన్నయ్య న్యాపతి కామేశ్వర్రావుగారు చేసి పెట్టారట. ఆ పిల్లలందరూ బాలానందం ట్రూప్ వాళ్లే. గుణసుందరి కథలో నటించిన మాస్టర్ కుందు తదితర పిల్లలందరూ కల్సి అమ్మో నొప్పులే …అమ్మమ్మో నొప్పులే పాట కడుపుచెక్కలు చేసేస్తుంది. అన్నట్టు ఇంకో విశేషం..ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా ఇందులో బాలనటుడుగా కనిపిస్తారు. అంతేకాదు నాగిరెడ్డిగారబ్బాయి వెంకట్రామిరెడ్డి కూడా పిల్లల గ్యాంగులో ఒకడుగా నటించాడు.

ధూపాటి వియ్యన్నగా ఎస్వీ ఆర్ నటన మామూలుగా ఉండదు. తర్వాత రోజుల్లో ఉత్పల్ దత్ ఎస్వీఆర్ ను ఇమిటేడ్ చేశాడా అనే సందేహం వస్తుంది. పైగా పాతాళభైరవిలో మాంత్రికుడే వేసిన నటుడేనా ఇతను అనిపిస్తుంది కూడా. అసలా మేనరిజమే తమాషాగా ఉంటుంది. మద్రాసు రైల్వే స్టేషన్‌లో విచిత్రంగా ముక్కు పుటాలను కదిలిస్తున్న ఓ ప్రయాణికున్ని చూసి ఇన్‌స్పైర్ అయి దాన్ని అడాప్ట్ చేసుకున్నాననేవారు ఎస్వీఆర్. .

సావిత్రికి ఈ సినిమా ఓ ప్రమోషన్ కిందే లెక్క. ‘పాతాళ భైరవి’లో ఓ డాన్సర్‌గా చేసిన ఆమెకు ఇందులో సెకండ్ హీరోయిన్ ఛాన్సంటే ప్రమోషనే కదా. సావిత్రి, జోగారావుపై ఇందులో ఓ డ్రీమ్ సాంగ్ కూడా ఉంది. ఆ సాంగులో జోగారావు అర్జునుడైతే సావిత్రి ఊర్వశి. ఈ సినిమాలో సావిత్రి ఎక్స్ ప్రెషన్స్ చూసే తర్వాత రోజుల్లో విజయా పర్మెనెంట్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు చక్రపాణి. ఇక జోగారావైతే చార్లీ చాప్లిన్ ను అద్భుతంగా ఇమిటేడ్ చేస్తాడీ సినిమాలో.
మామూలుగా డైరక్టర్లు అడపాదడపా స్క్రీన్ మీద కనిపించడం మామూలే. పెళ్లి చేసి చూడులో ఎల్వీ ప్రసాద్ ఓ సీన్ లో కనిపిస్తారు. ఎన్టీఆర్ , జి.వరలక్ష్మి షికారుకు వెళ్లినప్పుడు వాళ్లను ఆశ్చర్యంగా చూసే రైతు గా కనిపించేది ఎల్వీనే. నిజానికి ఎల్వీ అంతకు ముందు ఫుల్ లెంగ్త్ రోల్స్ లోనే నటించాడు.ఇక పద్మనాభం ఇందులో మూడు వేషాల్లో కనిపిస్తాడు. ఎస్వీఆర్ సహాయకుడు అప్పన్నగానూ…పోస్ట్ మెన్ పాత్ర రెండోది…రైల్వే గార్ట్ పాత్ర మూడోది.

ఊటుకూరి సత్యనారాయణ రాసిన రెండు పాటలు తప్ప మిగిలిన పదిహేను పాటలూ విజయా ఆస్థాన కవి పింగళే రాశారు. వాటిలో పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని పాట పెద్ద హిట్. ఇంటా బయటా జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్…భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ అంటూ చెలరేగి రాసిన పింగళి బ్రహ్మచారి అంటే ఎవరైనా నమ్ముతారా? ఇదే మాట రేలంగోసారి పింగ‌ళివారినే అడిగేశాట్ట … ఏవండీ డ్యూయ‌ట్లు భ‌లే ఇదిగా రాస్తారు… మీరు బెమ్మ‌చార్లు క‌దా … ఎట్టా సాధ్యం అని అడిగితే … నువ్వు న‌టించ‌డం లేదూ అలాగే అని పింగ‌ళి రిప్లై ఇచ్చార‌ట‌.

ఇక ఘంటసాల పాతాళభైరవి తర్వాత మరో మ్యూజికల్ హిట్ అందించారు విజయావారికి. పెళ్లి చేసి చూడు సినిమాకు విడిగా డైలాగ్ రైటర్ ఎవరూ లేరు. పాటలు పింగళి రాసేస్తే…కథ స్క్రీన్ ప్లే…డైలాగ్స్ మొత్తం కలిపి స్క్రిప్ట్ అనే పేరు మీద చక్రపాణే కానిచ్చేశారు. ఎస్వీరంగారావు డైలాగ్స్ వింటుంటే…ఇవి ఖచ్చితంగా చక్రపాణి రాసినవే అనిపించకమానవు.

మూడు లక్షల బడ్జట్ తో తీసిన పెళ్లి చేసి చూడు… 1952 ఫిబ్రవరి 29న విడుదలైంది. విజయా బ్యానర్ పదికాలాలపాటు నిలిచే రేంజ్ సక్సస్ ఇచ్చింది. విజయావారి టేస్ట్‌కి, ఎల్వీ ప్రసాద్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అన్నట్టు పెళ్లి చేసి చూడు బైలింగ్వల్ గా తీశారు. తమిళ్ లో కళ్యాణం పణ్ణిపార్ కూడా పెద్ద హిట్టు. అయితే చాలా గ్యాప్ తర్వాత హిందీలో ఎల్వీ ప్రసాద్ స్వయంగా ఈ సినిమాను రీమేక్ చేశారు. షాదీకే బాద్ టైటిల్ తో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తెలుగు సినిమా కిక్కే వేరు.

11 కేంద్రాల్లో వంద రోజులాడేసిన పెళ్లిచేసి చూడు శతదినోత్సవం 1952 జూన్ 8న విజయవాడలో ఘనంగా చేశారు. విజయావారికి వరసగా రెండో రజతోత్సవ చిత్రంగా నిల్చిన పెళ్లి చేసి చూడు ఇప్పుడు చూసినా…చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఇక పోతే …. తర్వాత రోజుల్లో శ్రీనువైట్ల దాకా చాలా మంది దర్శకులు ఈ ఫార్ములాను ఫాలో అయ్యారు.

అంటే … పెళ్లి చేసుకున్న అమ్మాయిని తండ్రి కళ్లు కప్పి ఇంట్లోకి తీసుకురావడం … అలా కొంత కామెడీ చేయడం … కోడల్ని నర్సు పిల్లగా ఇంట్లో ప్రవేశపెట్టడానికి హీరోకి పిచ్చి పట్టినట్టు నటించే అవకాశం కల్పించడం …ఆ అవకాశాన్ని తన ఓవర్ యాక్షన్ తో సద్వినియోగం చేసుకుని ఎన్టీఆర్ మాస్ ఆడియన్సును తన వైపు తిప్పేసుకుని ఎన్టీవోడు అయిపోయాడు … అదీ కథ … సినిమా యూట్యూబ్ లో ఉంది ..అసలు చూడని వారు .. చూసిన వారు కూడా చూడవచ్చు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!