విజయాలు -వైఫల్యాలు ఎదుర్కొంటూ యాభైఏళ్లు నిర్మాతగా!!

Sharing is Caring...

A company named by NTR…………………

తెలుగు నాట సినిమా నిర్మాణ సంస్థలు ఎన్నో పుట్టాయి .. అయితే కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డాయి. ఈనాటికి సినీ నిర్మాణం చేపడుతూ దూసుకుపోతున్న సంస్థగా  వైజయంతీ మూవీస్‌ ఖ్యాతి గడించింది.

ఆ ‘వైజయంతీ మూవీస్‌’ ను అశ్వనీదత్‌ 1972 లో స్థాపించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అశ్వనీదత్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.  యాభై మూడేళ్లుగా ఒక సంస్థను నడపడం .. నిర్మాతగా నిలబడటం మామూలు విషయం కాదు. 

ప్రస్తుతం అశ్వనీదత్‌  భారీ బడ్జెట్‌ తో  ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్న  కల్కి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్‌ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ లో  ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్,దీపికా పదుకొణె, దిశా పటానీ తదితర నటులు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. 

ఇక వైజయంతీ మూవీస్ ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే .. అశ్వనీదత్‌ కి చిన్నప్పటినుంచి సినిమాలు అంటే మక్కువ ఎక్కువ. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కి వీరాభిమాని.. ఈ క్రమం లోనే 19ఏళ్ల వయసులో ‘సావరిన్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌’ బ్యానర్‌పై ‘ఓ సీత కథ’  అనే సినిమా తీశారు. దానికి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు మంచి పేరొచ్చింది.  నంది అవార్డు కూడా గెలుచుకుంది.  

ఆ సమయంలోనే  అశ్వనీదత్‌ తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. ఓ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. మనసులోని మాటను చెప్పారు. అది విని ఎన్టీఆర్  ఆశ్చర్యపోయారట. ‘సరే చూద్దాంలే’ అన్నారట.  ఆ తర్వాత మరో రెండు సార్లు కలసి సినిమా సంగతి చెప్పారట. అశ్వనీదత్‌ పట్టుదల చూసి ముచ్చటేసి ఎన్టీఆర్ ‘ఒకే’ అన్నారట. 

ఇక అగ్రిమెంట్ పై సంతకం చేస్తూ ‘సంస్థ కు పేరు ఏమి పెట్టారు’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘కృష్ణుడి పేరు వచ్చేలా  పెట్టాలనుకుంటున్నాను. మీరే సూచించండి ‘ అని అశ్వనీదత్‌ అడిగారు. ఎన్టీఆర్ వెంటనే  కృష్ణుడి మెడలో వైజయంతిమాల ఉంటుంది కదా..  దాని గుర్తుగా ఎన్టీఆర్‌ తన స్వహస్తాలతో ‘వైజయంతీ మూవీస్‌’ అని రాశారు. అలా ఎన్టీఆర్  నామకరణం చేసిన  సంస్థ  కాలక్రమంలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. 

‘వైజయంతీ మూవీస్‌ మొదటి సినిమా  ‘ఎదురులేని మనిషి’.. బాపయ్య  డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్‌, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.  ఇక రెండో సినిమా కూడా ఎన్టీఆర్‌తోనే తీశారు.  దాని పేరు ‘యుగపురుషుడు’.  ఈ సినిమాకు కూడా బాపయ్యనే దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత  అడవి సింహాలు, అగ్నిపర్వతం,బ్రహ్మ రుద్రులు ,జగదేకవీరుడు అతిలోకసుందరి .. ఆఖరి పోరాటం ..శక్తి .. కంత్రి .. చిరుత .. సైనికుడు … జై చిరంజీవ .. స్టూడెంట్ నంబర్ 1 .. ఆజాద్ … రాజకుమారుడు.. చూడాలని ఉంది .. గోవిందా గోవిందా.. అశ్వమేధం.. మహానటి  తదితర చిత్రాలు నిర్మించారు.

2011 లో  జూనియర్ ఎన్టీఆర్‌తో అయన తీసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి. ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌ కావడంతో  రూ.32 కోట్ల నష్టం వచ్చింది.. దీంతో సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నారు కానీ పరిశ్రమను వదిలి వెళ్ళలేదు.  ప్రస్తుతం తన కుమార్తెల సహకారంతో ‘కల్కి’ సినిమా తీస్తున్నారు. అన్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ అశ్వినీ దత్ అల్లుడే.

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!