అభిమానులకు నచ్చే సినిమా !

Sharing is Caring...

హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. కథ అంతా ఆమె  చుట్టూనే నడుస్తుంది. రొటీన్ పాత్రలకు భిన్నంగా నయన తార ఇందులో అంధురాలి పాత్రలో నటించింది. నయనతారే ఈ సినిమాలో హీరో .. హీరోయిన్. ఆపాత్రలో నయన బాగానే నటించింది.

సినిమాలో హీరోయిన్  సీబీఐ ఆఫీసర్. ఒక రోడ్డు ప్రమాదంలో కంటి చూపుతోపాటు తమ్ముడిని కూడా కోల్పోతుంది. ఆ క్రమం లో ఒక సైకో దృష్టిలో పడుతుంది.అతగాడు రేపిస్ట్ కూడా. నయనను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తాడు. చూపు లేకపోయినా అతగాడే రేపిస్ట్ అని జరిగిన ఘటనల ద్వారా ఆమె గ్రహిస్తుంది. ఈ రేపిస్ట్ కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసాడని పోలీసుల ద్వారా తెలుసుకుంటుంది. ఆ అమ్మాయిలను ఎలా విడిపించింది ? తనను తాను ఎలా రక్షించుకుంది అనేది క్లుప్తంగా కథ.

ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం నయనతార కు కొత్తేమీ కాదు. కాకపోతే ఈ సినిమాలో క్యారెక్టర్ పూర్తి అంధురాలు. అందులో నయన ఒదిగిపోయింది. ఒక విధంగా డీ గ్లామర్ రోల్ … హీరో ఎవరూ లేరు .. డ్యూయెట్స్ లేవు. కథ బాగానే ఉన్నప్పటికీ కథనం స్లో గా ఉంటుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు గతంలో ఎక్కడో చూసాం అనిపిస్తుంది.(అంధురాలి పాత్రలతో గతం లో వచ్చిన సినిమాల్లో)

సినిమాలో ఎస్ ఐ మణికంఠ పాత్ర ను బాగా మలిచారు. అలాగే గౌతమ్ పాత్రలో నటించిన కుర్రోడు కూడా బాగానే చేసాడు. ఇక విలన్ పాత్ర  పోషించిన అజ్మల్ అమీర్ సహజంగా నటించాడు. కొన్నిచోట్ల కూల్ గా…  అవసరమైన సందర్భాల్లో మరీ క్రూయల్ గా నటించి మెప్పించాడు. నయన తార కు ధీటుగా నటించాడు. అతగాడి ముఖంలో ఎక్సప్రెషన్స్ బాగా పలికాయి. సైకో లు ఇలా ఉంటారా  అనిపించేలా నటించాడు.

సినిమా లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సంభాషణలు బాగున్నాయి. ఇక దర్శకుడు మిలింద్ రావు సినిమా ను బాగానే తెర కెక్కించారు కానీ సస్పెన్స్ … థ్రిల్ కలిగించే సన్నివేశాలు తక్కువ. హింస ఎక్కువగా ఉంది. క్లయిమాక్స్ మరీ సాగదీశారు అనిపిస్తుంది. నయన తార అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాను  క్రైం థ్రిల్లర్ అన్నారు కానీ క్రైం ఎక్కువ. థ్రిల్ తక్కువ. ఒకసారైతే చూడవచ్చు. 

కెమెరామెన్ పనితనం బాగుంది. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అన్నట్టు ఈ సినిమాను నయన తార  భర్త విఘ్నేష్ శివన్ (పెళ్ళికి ముందు )నిర్మించారు. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది. నిర్మాణం ఆలస్యమై థియేటర్ల లో విడుదలకు బదులు ఓటీటీ వేదిక హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది.   తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో చూడవచ్చు.బ్యానర్ పేరు రౌడీ పిక్చర్స్ అట. తమాషాగా ఉంది.  నేత్రికన్  అంటే మూడో కన్ను అని అర్ధం. 

post updated on 15-8-2024

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!