టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి.
కుటుంబం కాన్సెప్ట్ కి ఆస్తి తగాదాలు .. గ్రామంలోని భూ గొడవలను కలిపారు. దర్శకుడు తాను అనుకున్న అంశాలను తెరపై కళ్ళకు కట్టినట్టు చూపించారు. టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఏదో కథ చెప్పారు కానీ అది నప్పలేదు. అందరికి ఈ సినిమా నచ్చకపోవచ్చు.
ఇలాంటి ఫ్యామిలీ డ్రామా చిత్రాలు ఇటీవల కాలంలో రాలేదు. అదొకటి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు బాగా పండించారు. అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొంతమందికి బోర్ కూడా కొట్టొచ్చు… సినిమా లో కమర్షియల్ అంశాలు కనబడవు.
హీరో హీరోయిన్ల మధ్య శృంగార గీతాలు లేవు. విలన్స్ ఉన్నప్పటికీ నాట్యతార .. వాళ్ళకో పాట అంటూ ఏమి లేవు. పక్కా ఫ్యామిలీ డ్రామా గా రూపొందిన ఈ సినిమాలో హీరో పాత్ర లో నాని మెప్పించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో .. ఫైట్స్ లో నాని తనదైన శైలిలో నటించాడు.
ఇలాంటి సినిమాల్లో పాటలు బాగుండాలి. అదొక లోపం. ఒకటి రెండు చోట్ల జానపద గీతాలు పెట్టారు.అవి మాత్రం బాగున్నాయి. తమన్ సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. హీరో అన్నయ్య బోస్ పాత్రలో జగపతి బాబు సాఫ్ట్ విలనిజం పండించారు. చాలాకాలానికి జగపతి కి మంచి పాత్ర దొరికింది.
నరేష్ తాగుబోతు బావ పాత్రలో సహజంగా నటించాడు. రావు రమేష్ .. రోహిణి లకు కథలో పెద్ద ప్రాధాన్యత లేదు. హీరో తండ్రి గా నాజర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. హీరోయిన్ రీతువర్మ .. హీరో మేనకోడలు చంద్రమ్మ గా ఐశ్వర్య తమ పరిధిలో బాగానే చేశారు. రెండో భాగంలో సినిమాను సాగదీసినట్టు అనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాలు వృధా అనిపిస్తాయి. హీరో ను ఎలివేట్ చేసే ప్రయత్నం బాగా చేశారు. మహిళలను ఆకట్టుకునే.. ఎమోషనల్ టచ్ .. సెంటిమెంట్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఎందుకో ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. అంత చెత్త సినిమా మాత్రం కాదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సకుటుంబ సమేతంగా చూడవచ్చు.
————-KNM