బాదుడు లో రైల్వే వారి బాదుడు వేరయా !

Sharing is Caring...

కొవిడ్‌-19 నేపథ్యంలో మామూలుగా తిరిగే రైళ్లను నిలిపివేసి  ప్రత్యేక రైళ్లను  రైల్వే శాఖ నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరిట ప్రయాణీకులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తోంది. దాదాపు ఓ వంద మేరకు ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే మామూలు రైళ్లను ఎందుకు  నడపదో అర్ధం కానీ విషయం. కోవిడ్ అనే నెపం చెప్పేటప్పుడు ప్రత్యేక రైళ్లను కూడా నడపకూడదు. ప్రయాణీకులు ఎందులో తిరిగినా కరోనా వ్యాపించే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ వరకు నడుస్తాయని రైల్వే శాఖ వారు చెబుతున్నారు. అంటే అప్పటివరకు మామూలు సర్వీసులు అందుబాటులోకి రావనే చెప్పుకోవాలి.
లాక్‌డౌన్‌ అనంతరం అన్‌లాక్‌ల పేర కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాట్ల క్రమంలో  ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే తో పాటు నార్త్ సెంట్రల్ రైల్వే … ఇతర రైల్వే డివిజన్లు  ఇదే తరహాలో రైళ్లు నడుపుతున్నాయి. ఇవి కాకుండా పండుగల స్పెషల్స్ పేరిట కూడా మరికొన్ని రైళ్లు నడుపుతున్నారు. వీటన్నింటి లో కూడా చార్జీలు ఎక్కువే. ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. పొరపాటున ఎవరైనా రైల్ ఎక్కారంటే రైలు కదిలిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు అయ్యే చార్జీ కట్టాలిసిందే. ఇపుడు పట్టాలెక్కిన రైళ్లు అన్నీ పాత రైళ్ళే. స్పెషల్ అంటే ప్రత్యేక హంగులు … అదనపు సౌకర్యాలు ఉండబోవు.
హైదరాబాద్-తిరువనంతపురం కేరళ ఎక్స్ ప్రెస్ లేదా కొచ్చివేలి ఎక్స్ ప్రెస్, నరసాపురం-నాగర్ సోల్ స్పెషల్  ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా లాక్ డౌన్ తర్వాత వేసిన వన్నీ పాత బండ్లే.  ప్రత్యేక ఛార్జీల పేరిట  వసూలు చేస్తూ బురిడీ కొట్టించి దోచేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే ఏదో ఒకటి వేశారు కదా అని.. సంతృప్తి పడుతూ అధిక చార్జీలు చెల్లిస్తూ వాటిల్లోనే జనాలు తిరుగుతున్నారు.  

ఇక ప్రజా రవాణా వ్యవస్థలో అత్యధిక ప్రాచుర్యం పొందినవి రైళ్లు మాత్రమే. చౌక ధరల్లో సామాన్యులు కూడా ప్రయాణించేవి రైళ్లు.నిత్యం కొన్నిలక్షలమంది ఈ రైళ్లలో తిరుగుతుంటారు. కాగా మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేటు రైళ్లు నడవనున్నాయి.  దీనికోసం రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని మార్గాల్లో ప్రైవేటుకు పచ్చజెండా ఊపి దశలవారీగా మిగిలిన రూట్లలో రైళ్లు నడపడానికి సిద్ధమౌతోంది ఇండియన్ రైల్వే. లాభనష్టాలతో సంబంధాలు లేకుండా ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు ప్రజారవాణా వ్యవస్థను నిర్వహించాలన్న రాజ్యాంగ నిర్మాతల సూచనలను మన నేతలు పట్టించుకోవడం మానేశారు. మొత్తం మీద  సేవల్లో  దేన్నీ కూడా చౌక ధరల్లో అందించకూడదు అన్న లక్ష్యంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని బట్టి ముందు ముందు రైలు ప్రయాణం ఖరీదైన వ్యవహారంగా మారొచ్చు. 

————–  NIRMAL AKKARAJU 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!