It is so written……………………………………………….
దివంగత మావోయిస్టు నాయకుడు ఆర్కే సుమారుగా 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ సమయంలో స్పెషల్ పోలీస్ బృందాలు ఆయనను ఎన్నో మార్లు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు. చివరకు బీజాపూర్ అడవుల్లో ఉన్నారని గమనించి అడవుల్లోకి వెళ్లే దారులను మూసేసారు.
బయటి వాళ్ళు లోపలికి, లోపలి వాళ్ళు బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు.అప్పటికే ఆరోగ్యం క్షీణించిన ఆర్కే కి వైద్య సదుపాయం అందే అవకాశం లేకుండా చేశారని ఆయన భార్య కూడా ఆరోపించింది. దీంతో ఆర్కే ట్రీట్మెంట్ అందక కన్నుమూసారు. పోలీసుల వ్యూహం ఫలించింది. ఆర్కే చుట్టూ బలమైన అంగరక్షకులు ఉన్నప్పటికీ ఏమి చేయ లేకపోయారు. వ్యూహ రచయితగా పేరుగాంచిన ఆర్కే చివరికి పోలీసుల వ్యూహంలో చిక్కుకుపోయారు.
కాగా అంతకు ముందు ఆర్కే నల్లమల, లందుల, దొరగూడ, దల్దాలి, టక్కరపడ, బెజ్జంగి, బడ్జేడు, రామగూడ తదితర ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. 1991లో నల్లమలలో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి 2016లో రామగూడ ఎన్‌కౌంటర్ వరకు ఆర్కే సుమారు 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారని అంటారు. అలాగే 2006 జూలై లో యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ నాటి రాష్ట్ర కార్యదర్శి మాధవ్, మరో ఏడుగురు చనిపోగా ఆర్కే క్షేమంగా బయటపడ్డారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పాలుట్ల అటవీ ప్రాంతం .. పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల అటవీ ప్రాంతం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా ఆర్కే తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2008లో నల్లమలలో ఆర్కే ఉన్న ప్రాంతాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఆర్కే ఎన్కౌంటర్ ఖాయం అన్న వార్తలు ప్రచారంలో కొచ్చాయి. కానీ లాస్ట్ మినిట్ లో ఆర్కే మాయమయ్యాడు. ఎలా తప్పించుకున్నాడో ? ఎవరికి తెలీదు.
నల్లమల అటవీ ప్రాంతంలో దారులన్నీ మావోయిస్టులకు తెలుసు కాబట్టి అప్పట్లో ఆర్కే సురక్షితంగా బయటపడ్డారని అంటారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఒక గిరిజన తండా వద్ద 2010 మార్చిలో జరిగిన ఎన్‌కౌంటర్ లో రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆర్కే బయటపడ్డారు.
2016లో రామగూడ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కి బుల్లెట్ గాయాలైనాయి. అప్పట్లో ఆర్కేని అంగరక్షకులు సురక్షితంగా తప్పించారు. ఆ సంఘటనలో ఆర్కే కుమారుడు మున్నా మరణించారు. ఆర్కే కూడా చనిపోయారని అనుకున్నారు. అలా చాలా సార్లు ఆర్కే ఎన్కౌంటర్ చనిపోయారని వార్తలు వెలువడ్డాయి.
కరోనా పరిణామాల నేపథ్యంలో ఆర్కే లొంగిపోతే వైద్య సదుపాయం అందిస్తామని పోలీసులు సమాచారం పంపితే … ఆర్కే అందుకు అంగీకరించలేదని అంటారు. లొంగిపోతే బతికేవాడేమో !