‘మహా’ సర్కార్ ను షేక్ చేసిన ఏక్ నాథ్ షిండే !

Sharing is Caring...

Eknath shinde …………………………………….

ఏక్‌నాథ్ షిండే…. ఇపుడు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది  ఈయనే. మహారాష్ట్రలో  తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెర వెనుక బీజం వేసింది ఈ ఏక్‌నాథ్ షిండే నే. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో మకాం వేశారు. దీంతో ప్రభుత్వం పతనావస్థలో పడింది. ఏకనాథ్ షిండే ముంబైకి సమీపంలోని థానేకు చెందినవారు. పార్టీని ఇతర ప్రాంతాల్లోనూ బలోపేతం చేయడంలో ఆయన కృషి అపారం. మహారాష్ట్ర అసెంబ్లీకి షిండే వరుసగా నాలుగుసార్లు.. 2004, 2009, 2014, 2019లలో ఎన్నికయ్యారు.

గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏక్‌నాథ్ షిండే కీలక పాత్ర పోషించేవారు. ఆయన తనయుడు శ్రీకాంత్ షిండే ఎంపీ కాగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్. ఉద్దేశపూర్వకంగా ప్రకాష్ షిండే ను పక్కన పెట్టడంతో షిండే గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

షిండే కు  అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, పలువురు సేన ఎమ్మెల్యేల నుంచి కూడా ఆయన గట్టి మద్దతు ఉంది. ఇపుడు ఆయనతో ౩౦ మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆయన బలమెంతో ఊహించు కోవచ్చు.

కాగా  సిఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత సహాయకుడు మిలింద్ నార్వేకర్, ఎమ్మెల్సీ రవీంద్ర ఫటక్  మంత్రి ఏక్‌నాథ్‌తో సమావేశమయ్యారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో షిండేను శాంతింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారు. షిండేను ఒప్పించే ప్రయత్నంలో  ఉన్నారు.

ఇదిలా ఉంటే  బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కుటే షిండే బస చేసిన సూరత్ హోటల్‌లో షిండేతో సమావేశమవుతున్నట్లు సమాచారం.షిండే వైఖరి ఏమిటో ఈ రాత్రికి తేలిపోవచ్చు అంటున్నారు.
కాగా పార్టీ గ్రూప్ లీడర్ పదవి నుంచి షిండేను తొలగించారు. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్ చౌదరి ఎంపిక చేశారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ ఈ సమస్యను శివసేన “అంతర్గత విషయం”గా అభివర్ణించారు.మహా వికాస్ అఘాడి ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభానికి  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పరిష్కారం కనుగొంటారనే  ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ప్రయత్నాల్లో ఇది మూడోది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!