కేసీఆర్ తో ఇక సమరమే !

Sharing is Caring...

The screen rose for another fight………………………….. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎట్టకేలకు తెరాసకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ లో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఒక దశలో ఆయన కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు వ్యాప్తిలో కొచ్చాయి. అయితే రాజేందర్ బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలను కూడా కలసి వచ్చారు. స్పీకర్ ను కలసి ఇవాళో రేపో రాజేందర్ రాజీనామా ఇస్తారు. రెండు నెలల్లో మరో ఉపఎన్నిక కు రంగం సిద్ధం అవుతుంది.

తెరాస ఆవిర్భావం నుంచి ఉద్యమంలోఉన్నఈటలకు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంది. అదే ఆయన చెబుతున్నారు కూడా. తాజాగా వచ్చిన అసైన్డ్ భూముల వ్యవహారం తప్పించి ఈటల రాజకీయ జీవితంలో వేరే ఆరోపణలు లేవు. ఆరోపణలు ఉండటం రాజకీయ నేతలకు మైనస్ పాయింట్ ఏమి కాదు.  ఎందరో నేతలపై ఆరోపణలు .. కేసులు ఉన్నాయి. ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రజాభిప్రాయం అనుకూలం గా ఉంటే చాలు.  తెరాస కు ప్రత్యామ్నాయం గా చెప్పుకునే బీజేపీ కి కూడా రాష్ట్రంలో చాలా చోట్ల సమర్ధులైన నాయకులు లేరు.

కేసీఆర్ పై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న బీజేపీకి రాజేందర్ ప్లస్ కావచ్చు. మొదటి నుంచి పార్టీ లో ఉన్న ఈటల కు తెరాస లోటు పాట్లు అన్ని తెలుసు. అవన్నీ రాబోయే కాలంలో బయటి కొస్తాయి. కాగా తనను 2018 లోనే ఓడించేందుకు తెరాస ప్రయత్నించిందని రాజేందర్ కొత్త ఆరోపణ చేశారు. తనకు కేసీఆర్ కు గ్యాప్ ఇవాల్టిది కాదు ఐదేళ్ల క్రితమే వచ్చిందని ఈటెల చెబుతున్నారు. కేసీఆర్ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నారని అంటున్న ఈటల రాబోయే కాలంలో మరిన్ని విషయాలు బయటపెట్టి కేసీఆర్ ను ఇరుకున బెట్టే అవకాశాలు లేకపోలేదు. తాను మరికొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలవడానికి వెళ్లగా రెండు సార్లు ప్రగతి భవన్ గేటు దగ్గరే ఆపేశారని ఈటెల వాపోతున్నారు.

అది ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని  శాపనార్ధాలు పెడుతున్నారు. మంత్రి హరీష్ రావు తనకంటే ఎక్కువగా అవమానాలకు గురయ్యారని రాజేందర్ అంటున్నారు. చాలాకాలంగా హరీష్ రావు కూడా పార్టీ లో ఇబ్బంది పడుతున్నారనే విషయం ప్రచారం లో ఉన్నమాట తెలిసిందే. మొత్తం మీద తెరాస నుంచి ఈటల బయటపడుతున్నారు. ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. తాను బానిసను కాదు సమరం చేస్తానని ఈటల అంటున్నారు. కాగా పదవి పోగానే ఈటల కు ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందని … ఆస్తుల పరిరక్షణ కోసం ఆయన ఢిల్లీ వెళ్లారని తెరాస నేత గంగుల కమలాకర్ విమర్శిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం తప్ప ఈటల బీసీల కోసం ఏనాడు మాట్లాడలేదని అంటున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!