ఈ ‘డగ్లస్’ టార్గెట్ చేస్తే యుద్ద విమానం నేల కూలాల్సిందే !!

Sharing is Caring...

సుదర్శన్ టి……………………….

భారత సైనిక దళాలలో ఉద్దండులు ఉన్నారు. అలాగే విదేశ సైనిక దళాల్లో కూడా గొప్ప వీరులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఈ Douglas Bader. ఓ విమాన దుర్ఘటనలో రెండు కాళ్ళు పోగొట్టుకుని కూడా పైలట్ గా రెండవ ప్రపంచ యుద్ధంలో 21 జర్మన్ యుద్ద విమానాలను కూల్చిన Flying Ace.

డగ్లస్ కు ఫైటర్ పైలట్ అవ్వాలని చిన్నప్పటి నుండి చాలా కోరిక. ఆ కోరిక బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ లో చేరడంతో తీరింది. 1930లో ఈయన RAF లో చేరాడు కానీ 1931లో జరిగిన ఓ విమాన దుర్ఘటనలో రెండు కాళ్ళు కోల్పోయాడు. చేరిన సంవత్సరానికే కథ ముగిసింది.

బ్రతకడు అనుకున్నోడు కాస్తా బ్రతికాడు. రెండు కాళ్ళు లేకున్నా మళ్ళీ అన్ని టెస్టులు పాస్ అయ్యాడు కానీ అతనిని మళ్ళీ పైలట్ గా బ్రిటీష్ వైమానిక దళం తీసుకోలేదు. ప్రారంభమైన సంవత్సరానికే కెరీర్ అంతం అయింది.

1939లో మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం మొదలవడంతో డగ్లస్ ను RAF ఫైటర్ పైలట్ గా విధుల్లోకి తీసుకుంది. డగ్లస్ చాలా వేగంగా ఎదిగాడు. డగ్లస్ టార్గెట్ చేస్తే ఎంతటి యుద్ద విమానం అయినా నేల కూలవలసిందే. కేవలం రెండేళ్లలో ఒక్కడే 22 యుద్ద విమానాలు కూల్చిన ట్రాక్ రికార్డ్ డగ్లస్ ది.

మిగిలిన వాళ్ళతో కలిసి కూల్చింది అదనం. ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు పొందాడు. 1941, ఆగస్టు 9 న ఫ్రాన్స్ మీద 27,000 అడుగుల ఎత్తులో గస్తీ కాస్తున్నపుడు తను 3000 అడుగుల కింద కొన్ని జర్మన్ యుద్ద విమానాలను గమనించాడు. వాటిమీద దాడి చెయ్యాలని దూసుకెళ్లాడు. అవి 3 శత్రుదేశ విమానాలు..  24,000 అడుగుల ఎత్తులో పోరు మొదలయ్యింది.

వాటిల్లో ఒకదానిని డగ్లస్ కూల్చేశాడు. మరో రెండింటి మీద దాడికి దిగాడు. పోరులో వాళ్లు పేల్చిన మిసైల్ డగ్లస్ విమానాన్ని తాకింది. విమానం వెనుక భాగం, ఒక రెక్క గాల్లోకి ఎగిరిపోయింది. విమానం గింగిరీలు తిరుగుతూ నేల వైపు దూసుకెళుతోంది. 

దాదాపు 650 కిమీల వేగంతో విమానం నేల కూలుతోంది. చావు తప్పదని గ్రహించిన డగ్లస్ కానోపీ ఓపెన్ చేసాడు. ఒక్క ఉదుటన గాలి డగ్లస్ ను విమానం బయటకు లాగేసింది. కానీ తన కాళ్ళ prosthetic leg విమానం లోపలే ఇరుక్కుపోయింది.

మనిషి సగం విమానం బయట మిగిలిన సగం విమానంలో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. డగ్లస్ అలాగే ఆగిపోయి గట్టిగా 3 సార్లు ఊపిరి పీల్చుకున్నాడు.మెల్లగా తన ప్యారాచుట్ ఓపెన్ చేసాడు.

ఆ ఫోర్స్ కు విమానంలో ఇరుక్కుపోయిన ప్రోస్తేటిక్స్ ఊడిపోయాయి. మనిషి గాల్లో తేలాడు. నేల మీద వాలగానే జర్మన్ సైనికులు డగ్లస్ ను బందీగా పట్టుకున్నారు. తమ airforce బేస్ కు తీసుకొచ్చారు. డగ్లస్ శక్తిసామర్థ్యాలు సాహసాల గురించి శత్రుదేశ వైమానిక దళ అధికారులకు బాగా తెలుసు.

వాళ్లు ఈయన్ను చాలా మర్యాదగా చూసేవారు. పై స్థాయి అధికారులు కూడా చాలా గౌరవం ఇచ్చేవారు. డగ్లస్ ను బందీగా పట్టుకున్న విషయం RAF కు తెలిసింది.  విమాన దుర్ఘటనలో డగ్లస్ తన prosthetic leg కోల్పోయిన విషయం కూడా తెలిసింది.

జర్మనీ అధికారుల అనుమతితో ఓరోజు బ్రిటీషు బాంబర్ విమానం జర్మన్ స్థావరం మీదుగా వెళుతూ డగ్లస్ కోసం మరో prosthetic leg పారాచూట్ ద్వారా జారవిడిచింది. రెండు కాళ్ళు లేకున్నా డగ్లస్ మళ్ళీ మళ్ళీ క్యాంప్ నుండి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో అతన్ని జర్మన్ అధికారులు, తప్పించుకోడానికి సాధ్యపడని Colditz Castle కు తరలించారు.

1942 నుండి 45 వరకూ డగ్లస్ ఇక్కడే బందీగా గడిపాడు. చివరికి అమెరికా జర్మనీని ఓడించి అన్ని క్యాంప్ లు స్వాధీనం చేసుకున్నప్పుడు డగ్లస్ విడుదల అయ్యాడు. డగ్లస్ జీవితం ఆధారంగా Reach for the Sky ,Focke Wulf 190 ,Douglas Bader: Fighter Ace  అనే  3 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి .. ఆసక్తి ఉన్నవారు చూడోచ్చు.

ఇక డగ్లర్ గురించి   3 పుస్తకాలు వెలువడ్డాయి. ఇప్పటికీ వివిధ దేశాల సైనికులు యుద్ధంలో కాళ్ళు చేతులు కోల్పోతే డగ్లస్ జీవిత చరిత్ర పుస్తకం గిఫ్ట్ గా ఇస్తారు. ఈయన జీవితం ఇచ్చిన ప్రేరణతో ఎంతో మంది క్షతగాత్ర సైనికులు మళ్ళీ అద్భుతాలు సాధించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!