Bharadwaja Rangavajhala …………………………………..
“అగ్రహారంలో గాడిద” అని ఓ తమిళ సినిమా ఉంది … జాన్ అబ్రహాం తీశాడు. మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అంటారుగానీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … మతం ఆ పని మాత్రమే చేస్తోంది … ఇది చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని పేరే అగ్రహారంలో గాడిద.
అనగనగా ఓ కాలేజీ ప్రొఫెసర్ కు ఓ గాడిద పిల్ల దొరుకుతుంది. వాకబు చేయగా దాని తల్లిని కొందరు కొట్టి చంపేశారని తెలుస్తుంది … దీంతో అనాధగా ఉన్న పిల్లగాడిద మీద జాలేసి తనతో తెచ్చుకుంటాడు.
అందరూ కుక్కల్ని మాత్రమే పెంచుకుంటున్నారు … మనం వెరైటీగా గాడిదను పెంచుకుంటే తప్పేంటనేదే ఆలోచన చేస్తాడు … అనుకున్నదే తడవుగా ఆ గాడిదను తెచ్చి పెంచుకుంటూంటాడు. దాన్ని అన్ని పెంపుడు జంతువుల్లాగే బైటికి తీసుకెళ్తూంటాడు … స్నానం చేయిస్తూంటాడు.
దీన్ని అడ్వంటేజ్ గా తీసుకున్న కొందరు కాలేజీ కుర్రాళ్లు ఆయన్ని ఆటపట్టిస్తూంటారు … ప్రొఫెసర్ గారి గాడిద గురించి వాల్ రైటింగులూ పోస్టర్లూ కూడా నడుస్తాయి. అది కొంత గొడవకు దారి తీస్తూంటుంది … ఫైనల్ గా కాలేజీ యాజమాన్యం పిల్చి … మీరు ఆ గాడిదను వదిలేస్తారా? లేక ఉద్యోగం వదిలేస్తారా చెప్పండి అన్నారు.
ఇక లాభం లేదనుకున్న లెక్చరర్ గాడిదను తీసుకెళ్లి తన స్వగ్రామంలో ఉంచుతాడు. సిటీ నుంచీ ఆ గాడిదను జాగ్రత్తగా ప్యాక్ చేసి బస్సులో తీసుకెళ్డం ఓ ఫార్సు . ఆయన స్వగ్రామం … అది ఒక అగ్రహారం అలా అగ్రహారపు గాడిద అయ్యింది… అక్కడా ఇదే పరిస్థితి.
ఒక బ్రాహ్మణ అగ్రహారంలో గాడిదను పెంచడమా అని ఇన్ కేబుల్ బ్యాచ్ అంతా కేబుల్లు లాక్కుని మరీ గొడవకు దిగుతారు …అగ్రహారంలో తిరుగుతున్న గాడిద వల్ల నానా ఇబ్బందులూ పడుతూంటారనుకోండి. నా ఇష్టం నా ఇంట్లో నేనేమైనా చేసుకుంటా అని లెక్చరర్ గారు అడ్డం తిరుగుతారు … అయితే అగ్రహారపు పెద్దలు మాత్రం సీరియస్ గా గాడిదను అగ్రహారం నుంచీ తోలేయాలని తీర్మానించుకుంటారు.
ఈ గొడవ సాగుతుండగానే … ప్రొఫెసర్ గారి ఇంట్లో మూగ పనిమనిషిని ఒకడు మోసం చేసి గర్భవతిని చేస్తాడు … అయితే ఆ గర్భం నిలవదు … చనిపోయిన బిడ్డ పుడుతుంది. ఆ గాడిదను తీసుకురావడం వల్లే ఆ అమ్మాయిని వాడెవడో మోసం చేయడం చనిపోయిన బిడ్డ పుట్టడం లాంటి అనర్ధాలన్నీ జరిగాయని అగ్రహారపు పెద్దలు తీర్మానిస్తారు.
ఇంకా మరిన్ని దారుణాలు జరిగే అవకాశాలున్నాయని … గాడిద అగ్రహారంలోకి రావడం వల్ల ధర్మభ్రష్టత సంప్రాప్తించిందని ఇలా పలు విధాలుగా రెచ్చిపోతారు. ఇలా రెచ్చిపోతున్న పరిస్థితుల్లో … ఆ అమ్మాయి తల్లి తన కూతురుని మోసం చేసిన వాడిని శిక్షించే ఆలోచన చేయకుండా గాడిద చుట్టూ విషయం తిప్పుతున్నారని తన నిరసన తెలియచేస్తూ చనిపోయిన బిడ్డను తెచ్చి గుడి దగ్గర పెడుతుంది.
నిజంగానే …గుడి దగ్గర మృత శిశువును పెట్టింది గాడిదే అనుకుంటారు అగ్రహారపు జనం. అనుకోవడమే తడవుగా గాడిదను తీసుకొచ్చి కొండమీదకు తీసుకెళ్లి కొట్టి చంపేస్తారు. గాడిద చనిపోయిన తర్వాత ఆ బిడ్డను గుడిదగ్గరకు తెచ్చింది గాడిద కాదనే విషయం తెలుస్తుంది.
అప్పుడు గాడిద గురించిన పాజిటివ్ అంశాలు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటారు … అందరూ గాడిదను చంపినందుకు బాధ పడతారు … ఇలా పడుతుండగా ఓ అగ్రహారపు పెద్ద మనిషి … గాడిదను చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఊరు సర్వనాశనం అవుతుందంటాడు.
ఏం చేయాలి అంటే … గాడిదకు గుడి కట్టించడమే మనం చేయగలది అని వివరిస్తాడు …
గుడి కట్టాలని నిర్ణయించిన తర్వాత ముందు గాడిదకు దహన సంస్కారాలు చేద్దామనుకుంటారు.
గాడిదను తగలెట్టిన మంట అనుకోకుండా అగ్రహారానికి అంటుకుని మొత్తం అందరూ చచ్చిపోతారు.
ప్రొఫెసర్, ఆయన పనిపిల్లా మాత్రం తప్పించుకుంటారు… ఇదీ కథ. జాన్ అబ్రహామ్ తీసిన ఈ సినిమా ను అప్పట్లో తమళనాడు ప్రభుత్వం నిషేదించింది. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ ఆధిపత్యం మూఢ నమ్మకాల మీద సెటైరికల్ గా తీసిన ఈ సినిమా లో హీరో పాత్రలో సంగీత దర్శకుడు ఎమ్బీ శ్రీనివాసన్ నటించడం విశేషం.
సినిమాలో రెండు మూగ జీవాలంటాయి. అందులో ఒకటి గాడిద , రెండు మూగ పనిమనిషి. ఈ రెండు జీవాలూ అన్యాయంగా దౌర్జన్యానికి గురై దెబ్బతింటాయి. గాడిద అయితే చనిపోతుంది కూడా … దీన్ని రాతంటారా? కర్మంటారా? ఏదేమైనా మతం వారి ఉద్దరణకు కాకుండా నాశనానికే దోహదపడిందనేది దర్శకుడు చెప్పదల్చుకున్నదనిపిస్తుంది.