ఏమీటీ గూంజ్ ? ఆ సంస్థ గురించి విన్నారా ?

Sharing is Caring...

Great Ambition…………………………………….

ఒక గొప్ప ఆశయంతో స్థాపితమైన సంస్థ గూంజ్. పేదరికం కారణంగా దేశంలో ఎందరికో వంటిపై సరైన బట్టలుండవు. ఇక పిల్లలైతే దిశ మొలతోనే తిరుగుతుంటారు. అలాంటి బీద,బిక్కిజనాలకు అవసరమైన వస్త్రాలను పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. గూంజ్ స్వచ్చంద సంస్థ ఎగువ మధ్య తరగతి.. సంపన్నవర్గాల ప్రజల నుంచి పాత బట్టలను లేదా వాడని బట్టలను సేకరించి వాటిని రీ సైక్లింగ్ చేయించి ఉచితంగా పంపిణీ చేస్తుంది.

ఢిల్లీ శివారు గ్రామం మదన్‌పూర్-ఖాదర్‌ కేంద్రం గా‘గూంజ్’ సంస్థ పనిచేస్తున్నది. దేశవ్యాప్తంగా ఎందరో స్వచ్చంద కార్యకర్తలు గూంజ్ కోసం పనిచేస్తున్నారు. వీరు సేకరించిన బట్టలు దాచటానికి .. వాటిని మళ్ళీ వాడేందుకు పనికొచ్చేలా మార్చడానికి ఇక్కడి కార్యాలయం లో పనులు జరుగుతుంటాయి.ఇక్కడ పనిచేసే వారు వాటిని భద్రంగా బీరువాలలో దాచిపెడుతుంటారు.

గూంజ్ 1999 నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ‘ఏదీ వృథా కాదు…ప్రతిదీ ప్రయోజనకరమే’ అనే నినాదం తో గూంజ్ పనిచేస్తున్నది. ఇంటింటికీ వెళ్లి…‘మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక్క వస్తువు ఇచ్చినా సంతోషమే’ అని కార్యకర్తలు అడుగుతారు. సంస్థ లక్ష్యాల గురించి వివరిస్తారు. సందేహాలుంటే తీరుస్తారు. గూంజ్ కార్యకర్తలు కేవలం ఇళ్లకే కాకుండా కాలేజీలు, కంపెనీలు, పాఠశాలలకు వెళుతుంటారు. ప్రతి చోట సంస్థ ఆశయాలను వివరిస్తుంటారు.

పేదలకు బట్టల పంపిణీ తో పాటు కాటన్ దుస్తుల నుంచి శానిటరీ నాప్‌కిన్‌లను తయారుచేసి ప్యాక్‌ల రూపంలో మహిళలకు అంద జేస్తుంటారు. ప్రతి ప్యాక్‌లో అయిదు న్యాప్‌కిన్‌లు ఉంటాయి. వాటిని క్లాత్‌బ్యాగ్ లో పెట్టి ఇస్తూనే నాప్‌కిన్‌లను ఎలా శుభ్రపరచాలి, ఎంత కాలం ఉపయోగించాలి వంటి విషయాలు కూడా మహిళలకు చెబుతుంటారు. ఇక చలికాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే దుప్పట్లను ..రగ్గులను .. స్వేట్టర్లను సేకరిస్తుంది. వాటిని అవసరమైన పేదలకు పంపిణీ చేస్తుంది.

ప్రస్తుతం గూంజ్ ఏటా 3000 టన్నుల బట్టలను .. సామాగ్రిని రీసైకిల్ చేస్తోంది… పాతబడిన, ఎక్కువగా వాడని బట్టలు, ఇతర సామాగ్రి సేకరించి వాటిని శుభ్రపరిచి .. అవసరమైన మార్పులు చేయించి పేదలకు అందిస్తున్నది. ఢిల్లీలో మొదలు పెట్టి దేశంలో 22 రాష్ట్రాల్లో పేదలకు సహాయం చేస్తున్నది.వరదలూ, కరువులూ భూకంపాలూ వచ్చినపుడు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి ప్రజలకు సహాయపడుతుంది.

గూంజ్ ద్వారా చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతోంది… వాళ్ళు చేసిన పనికి బదులుగా సరిపడా దుస్తులు, ఆహారం ఇస్తారు..ఈ ‘గూంజ్’ సంస్థను అన్షు గుప్తా .. మీనాక్షీ గుప్తాలు స్థాపించారు. ఆ ఇద్దరూ భార్యాభర్తలు. గూంజ్ చేసే ఈ కార్యక్రమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2015 లో అన్షు గుప్తా  రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. అయినా కించిత్ గర్వం చూపకుండా ఒక సామాన్యుడిలా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు . పేదల అవసరాలను తీర్చడమే లక్ష్యం గా అన్షుగుప్తా పనిచేస్తుంటారు.

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!