అప్పట్లో ఆ పాత్ర చేయడం సాహసమే !

Sharing is Caring...

తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. నర్తనశాల 57 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు.

అప్పటికే ఎన్టీఆర్ రాముడు,రావణుడు, కృష్ణుడు,భీష్ముడు వంటి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరో గా పరిశ్రమలో గుర్తింపు పొందారు. సరిగ్గా ఆ సమయంలో లక్ష్మీ రాజ్యం నర్తనశాల సినిమా తీయాలనుకుంటున్న విషయం చెప్పి,ఎన్టీఆర్ ను బృహన్నల పాత్ర పోషించమని అడిగారు. ఆ పాత్ర పేరు వినగానే తొలుత ఎన్టీఆర్ కంగారుపడ్డారు. హీరో గా మంచి రైజింగ్ పీరియడ్ లో ఉండగా బృహన్నల వంటి పాత్ర చేస్తే అభిమానులు అంగీకరిస్తారా ? అభిమానుల సంగతి పక్కన పెడితే సినిమా జయాపజయాల్లో తేడా వస్తే పరిస్థితి ఏంటి అని రెండు రోజులు ఆలోచించారు.

సినిమా స్క్రిప్ట్ ఎవరో తయారు చేస్తున్నారో వాకబు చేశారు. సీనియర్ సముద్రాల గారని తెలిసింది.ఆయన ఎన్టీఆర్ ఆస్థాన రచయితే. ఎన్టీఆర్ నిర్మించిన,నటించిన చాలా పౌరాణిక సినిమా కథల రూప కర్త సముద్రాల వారే. వెంటనే ఆయనను పిలిపించి మాట్లాడారు. సినిమా మొత్తంలో బృహన్నలదే కీలకపాత్ర .

దాదాపుగా 80 శాతం సినిమా లో ఆ క్యారెక్టర్ ఉంటుందని సముద్రాల వారు చెప్పారు. అంతే కాదు బృహన్నల నాట్యాచారుడు కాబట్టి తమరు నృత్యం నేర్చుకుంటే మంచిదని సెలవిచ్చారు. సముద్రాల బృహన్నల పాత్ర గురించి వర్ణించి  చెబుతుంటే ఎన్టీఆర్ ఆ పాత్రలో తాను నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని మురిసిపోయారు. అంతే … ఆక్షణానే నిర్ణయం తీనుకున్నారు.

ఒక దశలో ఎన్టీఆర్ అంగీకరించకపోతే సినిమా ప్రతిపాదన విరమించుకుందామని నిర్మాత లక్ష్మీరాజ్యం అనుకున్నారట. అయితే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నర్తనశాల పట్టాలెక్కింది. ఎన్టీఆర్ విభిన్నపాత్రలు పోషించాలన్నలక్ష్యంతోనే  బృహన్నల పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారు. మరే హీరో చేయని సాహసానికి పూనుకున్నారు.

ఇక ఆ పాత్రలో లీనమయ్యేందుకు నృత్య దర్శకులు వెంపటి సత్యం గారి వద్ద నాట్యం గురించి బేసిక్స్ ,మరికొన్ని మెళకువలు నేర్చుకున్నారు. బృహన్నల పాత్రకు ఒక మేనరిజాన్ని ఎన్టీఆర్ క్రియేట్ చేశారు. నర్తనశాల చూస్తే  బృహన్నల నడక, చేతులు తిప్పడం, హావాభావాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. రోజూ ఒక గంట సేపు నాట్యం ప్రాక్టీస్ చేశారు. 

ఎన్టీఆర్ బృహన్నల పాత్ర చేస్తున్నారని తెలిసిన కొంతమంది ఇక ఎన్టీఆర్ పని అయిపోయిందని అప్పట్లో ప్రచారం చేశారు. అలా చేసిన వారిలో పెద్ద నటులు , నిర్మాతలు కూడా ఉన్నారు. అలా గేలి చేసినవారే సినిమా చూసి ముక్కుమీద వేలు వేసుకున్నారట. ఇక కథ విషయానికొస్తే ఇది మహాభారతం లోని రసవత్తర ఘట్టం విరాట పర్వం.కమలాకర కామేశ్వర రావు ఈ కథను అద్భుతంగా తెరపై కెక్కించారు.

కీచకుడిగా ఎస్వీఆర్, సైరంధ్రిగా సావిత్రి, భీముడిగా దండమూడి, ఉత్తర గా ఎల్ విజయలక్ష్మి, ఉత్తర కుమారుడిగా రేలంగి, అభిమన్యుడిగా శోభన్ బాబు నటించారు. నరవరా, జననీ శివకామిని , సలలిత రాగ వంటి పాటలకు సుసర్ల మాష్టారు అద్భుతమైన ట్యూన్స్ అందించారు. సముద్రాలవారు సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా సంభాషణలు సమకూర్చారు. అలా నర్తనశాల దృశ్యకావ్యంగా రూపొందింది. 

 

ఇదే కథను మళ్ళీ ఎన్టీఆర్  ‘శ్రీమద్ విరాటపర్వం’ పేరిట స్వీయ దర్శకత్వంలో తీశారు. ఈ సినిమాలో కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, కీచకుడు, బృహన్నల పాత్రల్లో నటించారు. ‘దానవీరశూరకర్ణ’ (1977) సూపర్ హిట్ అయ్యాక ‘విరాటపర్వం’ (1979) సినిమా కలర్ లో తీశారు. కర్ణకు డైలాగ్స్ రాసిన కొండవీటి వెంకట కవి స్క్రిప్ట్  తయారు చేశారు. సుసర్ల వారే సంగీతం అందించారు. వేటూరి, సినారే  పాటలు రాశారు.

మంగళంపల్లి బాలమురళి కృష్ణ రెండు పాటలు పాడారు. వాణిశ్రీ, బాలకృష్ణ ఇంకా ప్రముఖ నటులు ఎందరో నటించారు. అయినప్పటికీ ఈ సినిమా  ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. నర్తనశాలను   విరాట్ పర్వాన్ని పోల్చి చూసిన జనాలు పెదవి విరిచారు. నర్తనశాల విడుదలైన 16 ఏళ్లకు తీసిన విరాట పర్వం ఎన్టీఆర్ విఫలయత్నంగా మిగిలింది.  వయసు పైబడటం తో బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ అదోలా కనిపించారు. అయిదు పాత్రలు చేయడం .. పాత్రకు పాత్రకు భిన్నత్వం చూపడంలో ఎన్టీఆర్ సక్సెస్ కాలేకపోయారు. విరాటపర్వంలో కొన్నిపాటలు బాగున్నప్పటికీ నర్తనశాల పాటలను మరిపించలేకపోయాయి. పీక్ పీరియడ్ లో ఎన్టీఆర్ కి ఈ సినిమా ఒక షాక్ ఇచ్చింది.

——   KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!