త్రివేణి సంగమం లోని సరస్వతి నది అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో చెప్పుకుందాం.
“సరస్వతీ నది” హిందూ పురాణములలో ప్రస్తావించిన పురాతనమైన నది. ప్రస్తుతం ఈ నది మనకు భౌతికంగా పైకి కనిపించదు. “ఋగ్వేదము” లోని “నదిస్తుతి” లో సరస్వతి నది ప్రస్తావన ఉందని పెద్దలు చెబుతారు. ఆ తరువాత కాలంలో, “మహాభారతములో” ఈ నది “ఎండిపోయినట్లు” పేర్కొన్నారు.
అయితే దీని అవశేషాలు సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా” నది ప్రాంతంలో లభించాయి. అక్కడ “సరస్వతి అనే పేరు”మీద ఓ “చిన్న నది” కూడా ఉంది. ఇది “ఘగ్గర్” నదికి “ఉపనది”. బహుశా, పురాతన సరస్వతీ నదికి ఓ “శాఖ” అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇక ఇస్రో అందించిన “ఉపగ్రహ ఛాయాచిత్రాల” ఆధారంగా సరస్వతీ నది “హిమాలయాల్లో పుట్టి వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ వద్ద అరేబియా సముద్రంలో” కలిసింది. ఈ మార్గంలో చాలా ప్రాంతాలలో “ఓ.ఎన్.జి.సి. భూగర్భ జలాల నిల్వ”లను కనుగొంది. రాజస్థాన్ లోని “జైసల్మేర్ ఎడారి ప్రాంతం”లో 13చోట్ల “బోరుబావులు” తవ్వగా “35-40 మీటర్ల లోతున” సరస్వతి నది నీటి నిల్వలు లభించాయి.
“కార్బన్ డేటింగ్” ద్వారా ఈ నీరు “4 వేల సంవత్సరాల నాటి”దని గుర్తించారు.అంటే సరస్వతి నది ఈనాటికీ “అంతర్వాహిని”గా ప్రవహిస్తూ “సజీవ నది” గా విరాజిల్లుతోందని భావించాలి. దీనిపై చాలా గ్రంధాలు, పుస్తకాలను కూడా రాశారు.
ఇదివరలో అసలు సరస్వతి నది ఉందా, లేక అది పుక్కిటి పురాణమా అని ఎన్నో చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు పురాణాల్లోనే ప్రస్థావించిన సరస్వతి నది నిజంగానే భారత ఉపఖండంలో ప్రవహించినట్లు సాధికారిక ఆధారాలు దొరికాయి. నది ఉనికికి సంబంధించిన నిజానిజాలను కనుగొనేందుకు 2016 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణకు వచ్చింది.
సరస్వతి నది నిజంగానే ఉందని కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక సమర్పించింది. హిమాలయాల్లో పుట్టిన సరస్వతి హర్యానా, రాజస్థాన్, ఉత్తర గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించేది. సరస్వతి నది పొడవు మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు కాగా, అందులో మూడు వేల కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతం మనదేశంలోనే ఉంది.
మిగిలిన నది పరివాహక ప్రాంతం మన దాయాది పాకిస్థాన్లో ఉంది.కమిటీని నేతృత్వం వహించిన భూగర్భ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వాల్దీయా కొన్నాళ్ల క్రితం మాట్లాడుతూ తమ పరిశోధన వివరాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమ నివేదికను అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి అందచేసారు. ఆ దరిమిలా ఉమాభారతి మాట్లాడుతూ నదిని పునరుజ్జీవింపచేసేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక యూపీలో ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ల కిందట సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని పరిశోధకులు గుర్తించారు.
అంతేకాకుండా భూగర్భంలో సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు అప్పట్లోనే తేల్చారు. ఈ మధ్య కాలంలో సరస్వతి నదిపై హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సర్వేలో కొన్ని విషయాలు వెలుగు లోకి వచ్చాయి.
త్రివేణి సంగమ ప్రాంతంలో భూగర్భం నుంచి 45 కి.మీ వరకు హిమాలయాల వైపు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు కిలోమీటర్లు వెడల్పున, 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేశారు. గంగ, యమున నదుల నీటికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా సరస్వతి నది ఉపయోగపడిందని గుర్తించారు.
ఈ విషయాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ జర్నల్ ప్రచురించింది.మొత్తానికి లేదనుకున్న నది ఉందని .. అయితే అంతర్వాహిని గా ప్రవహిస్తోందని తేలడం సంతోష కరమే.
సరస్వతి నది జన్మ స్థానం బద్రీ నాద్ క్షేత్రం దగ్గరలోని “మాన” అనే గ్రామం.. ఇప్పటికి అక్కడికి వెళ్లిన వారు ఆ నది చిన్నపాయ ను చూడవచ్చు. రుగ్వేద కాలం నాటికి ఈ నది పెద్దదిగా ఉన్నప్పటికి కాలంతర మార్పుల చేత తన జన్మ స్థానం నుండి కొంత దూరం ప్రవహించాక, గంగ, యమున నదులతో కలసి అంతర్వాహినిగా మారి అలాహాబాద్ వద్ద త్రివేణి సంగమం గా దర్శనమిస్తుందని చెబుతుంటారు.
కాగా సరస్వతి నది పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. రివర్ వ్యాలీ . జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం నిపుణుల అంచనాల కమిటీ అధ్యయనాలు చేయాల్సి ఉంది.