కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో తమిళ ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు అతీతం అంటే అందరిని కలుపుకు పోతారని భావించవచ్చు. మరి ఆధ్యాత్మిక రాజకీయాలకు అర్ధం ఏమిటో … అవి ఎలా సాగుతాయో రజనీ వివరణ ఇవ్వాలి.
ఇక రజనీ ఎంత కాదని చెప్పినా తమిళ రాజకీయాల్లో కులం కీలకపాత్ర పోషిస్తుంది. ఆ రాష్ట్రం లోని ఆధిపత్య కులాలకు ఇప్పటికే నాయకులు ఉన్నారు. గౌండర్లకు ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిసామి, తేవార్లకు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, వన్నీయార్లకు రామాదాస్, షెడ్యూల్డ్ కులాలకు విసిసి (విదుతలై చిరుతైగల్ కచ్చి) వంటి నేతలు ఉన్నారు. కొన్నిసందర్భాల్లో వీరి హవా ఇప్పటికి కొనసాగుతుంది.అదలా ఉంటే కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న రజనీ కాంత్ పార్టీ నిర్మాణం , పొత్తులు వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటున్నారు కాబట్టి క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవాలి. పార్టీకి పటిష్టమైన క్యాడరే బలం. ఇక ఒంటరిగా పోటీ చేస్తారా ? ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారా ? అనే అంశం కూడా తేలాల్సి ఉంది. రజనీ మొదటినుంచి బీజేపీ కి అనుకూలంగా ఉన్నారు. గతంలో ఆయన బీజేపీ విధానాలను సమర్ధించిన సందర్భాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌కున్న ప్రత్యేక హోదాను ఎత్తివేసిన సందర్భంలో రజనీకాంత్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల ను కృష్ణార్జునులతో పోల్చారు. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు కూడా ఇచ్చారు.
రజనీకాంత్ అభిప్రాయాలు బిజెపి అభిప్రాయాలను పోలి ఉన్నాయి కాబట్టి మద్దతు ఇవ్వమని కోరుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆమేరకు వారు రజనీ పై ఒత్తిడి కూడా తేవచ్చు. తమిళనాడులో కాలు మోపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ రజనీ సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. గత కొంత కాలంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు రజనీ తో చర్చలు కూడా జరుపుతున్నారు.అయితే రజనీ ఎటు తేల్చి చెప్పలేదు. ఇటీవలే అన్నా డీఎంకే తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తును వదులుకుని రజనీ తో కలుస్తారా ? లేక మూడు పార్టీలు కలసి ఫ్రంట్ పెడతాయా ? ఇవన్నీ కూడా తేలాల్సివుంది.
కాగా అన్నాడీఎంకే అంటే రజనీకి పడదు. ‘బాషా’ సినిమా విజయోత్సవ సభలో అప్పటి సీఎం జయలలిత సమక్షంలోనే రాష్ట్రంలో బాంబుల సంస్కృతి ఎక్కువైందని రజనీకాంత్ విమర్శలు చేశారు . ఆ దరిమిలా ఆయన అభిమానులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రజనీ కారు కూడా ధ్వంసమైంది. ఆ తర్వాత అన్నాడీఎంకే పాలనను అడ్డుకునే దిశగా డీఎంకే, టీఎంసీ కూటమికి రజనీ బహిరంగంగా మద్దతు కూడా ప్రకటించారు. మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. అవన్నీ మర్చిపోయి … జయలలిత ఇపుడు లేదు కాబట్టి పొత్తుకు ఇష్టపడతారెమో ? రజనీకాంత్ ఒకే అంటే డిఎంకె కు గట్టిపోటీ ఇవ్వవచ్చు. ఆ విషయం అలా ఉంచితే బీజేపీ తో చెలిమిని తమిళులు అంగీకరిస్తారా ? అభిమానులను రజనీ కన్విన్స్ చేయగలరా ? ఇవన్నీ కీలక అంశాలే. జవాబు లేని ప్రశ్నలే . వీటి పట్ల స్పష్టత రావాలంటే మరి కొంత కాలం పడుతుంది.
తమిళనాట ఆరు దశాబ్దాల నుంచి ద్రవిడ సిద్ధాంతాలు, పెరియార్ నాస్తిక వాదాలు కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలే వరుసగా అధికారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీలకు ధీటుగా ఆధ్యాత్మిక రాజకీయం ఎలా పనిచేస్తుందో కొంతకాలం పోతే కానీ తేలదు. ద్రవిడ ఉద్యమాలతో సంబంధంలేని పార్టీని …అంతేకాకుండా రాజకీయాల్లో ఆథ్యాత్మికత గురించి మాట్లాడుతున్న తొలి తమిళ నాయకుడు రజనీ ని ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
———— KNM