ఉద్యోగులపై ప్రజలకు సానుభూతి లేదా ?

Sharing is Caring...

Nirmal Akkaraju …………………….. 

ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, నిరసన ను సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ పనులపై అక్కడ కొచ్చిన ప్రజలు నిర్లిప్తంగా ఉంటున్నారు. కొందరైతే ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను.

అందరూ లంచగొండులు లేదా అవినీతి పరులు లేదా తీసుకున్న పనికి న్యాయం చేయని వారు కాదు కానీ ప్రభుత్వ ఆఫీసులతో సంబంధం ఉన్నవారు .. లేదా పనుల కోసం వచ్చేవారు/గతంలో పనులు చేయించు కున్నవారు ఈ సందర్భంగా తాము పడిన బాధలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.

ఒక పెద్దాయన అయితే ఏదో వెయ్యో రెండు వేలో లంచమయితే ఒకే .. గానీ లక్షలలో గుంజుతారు సార్ అని అన్నారు. “ఒకప్పుడు పిల్లకు పెళ్ళి చేయాల్సి వస్తే , పిల్లవాడిని పై చదువుకు పంపాల్సి వస్తే ఏదో ఒకటి రెండు సార్లు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాదు.. తప్పదు తీసుకోవాల్సిందే అన్న ధోరణిలో ఉన్నారు నిలబెట్టి గుంజుతారు” అన్నారు.

“నిజాయితీ పరులు కూడా ఉన్నారు” సార్. “వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయి ఉంటారు చూడండి. అవినీతి సొమ్ముతో పెళ్ళి చేస్తే వెనక్కు రావడాలు, చదివినా ఉద్యోగం రాకపోవడాలు గమనించండి “అన్నారు. అయితే “ఈ ప్రభుత్వం కూడా జీతాలు పెంచమంటోంది.. కాబట్టి ఎ.సి.బి దాడులు కాకుండా నిజాయితీగా ఎప్పుడూ పని చేయమనండి ” అని సూచించారు .

“అవసరమైనప్పుడు నెత్తిన ఎక్కించుకోని …..లేనప్పుడు దించడం ఇరు వైపులా ఉంది” అన్నారు.”ఉద్యోగుల్లో వైసిపి, తెలుగుదేశం తోపాటు బిజెపి, జనసేన పార్టీల సానుభూతి పరులైన ఉద్యోగులు ఉంటారు. అందరూ ఏకపక్షంగా ఓటు వేయరు. అలాగే ఇప్పుడు సంక్షేమ పధకాలు అందుకునే వారైనా అంతే..ఏకపక్షంగా ఓటు వేయడం జరగద”ని అన్నారు.

ఇంత ఎందుకు సార్” కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో రికమండేషన్ లేకుండా డబ్బులివ్వకుండా పని చేయించుకు రండి.. అప్పుడు మాట్లాడుదాం. ఆ సీటుకు అంత డిమాండ్ ఉందని నాయకులనుండి సెక్రటేరియట్ దాకా అందరికీ తెలుసు. ఒకప్పుడు కలెక్టర్ అంటే గడగడలాడేవారు. ఇప్పుడు ఎవరో కొంత మంది తప్ప మిగిలిన వాళ్ళు పార్టీ నాయకులను చూసి గడగడలాడుతున్నారు.

అందరూ లంచం మరిగారు ఓటరు తో సహా..ఇవ్వకపోతే పని కాదు. దానికోసమా తిరగలేం.అందుకని సరే అంటాం. నిర్దిష్ట కాల వ్యవధిలో పని చేయాలని బోర్డు పై రాసి ఉంటుంది.ఆ సమయం లోపల ఏదో ఒకటి రాసి ఎండార్స్ మెంట్ ఇచ్చి ఫైల్ క్లోజ్ చేస్తారు. లంచం తీసుకోని పట్టుబడితే మూడవ నెల ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం తీయగలిగితే కోర్టు ద్వారా నిజాయితీ పరుడని నిరూపించుకోని తెచ్చుకోగలిగితే అప్పటి దాకా జీతం ఆపగలిగితే చెప్పండి.

సస్పెండైనా 90 రోజల తర్వాత సగం జీతం 180 రోజుల తర్వాత పూర్తి జీతం ఇవ్వాలి. ఇంకెక్కడి భయం.ఎసిబి లో కూడా నిజాయితీ పరులు ఉండాలి కదా..వాళ్ళని వేళ్ళ పై లెక్కపెట్టగలం “అన్నారు. “కొన్ని సీట్లలో తీసుకోకపోతే ఉండనివ్వరు.ఇది పులి స్వారీ దిగితే పులి మింగుతుంది … నేను ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాను” అని ఆయన ముగించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!