ఉప ఎన్నికలో ఓడిపోయిన తొలి ముఖ్యమంత్రి !

Sharing is Caring...

ఏ సభలో ఎమ్మెల్యే .. ఎమ్మెల్సీ కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి త్రిభువన్ నారాయణ్ సింగ్. అలాగే సీఎంగా చేస్తూ ఉప ఎన్నికలో ఓడిపోయిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఈ తరం వాళ్లకు ఈ త్రిభువన్ గురించి తెలియదు. ఈయన ఉత్తర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు.

69 తర్వాత యూపీ లో కొన్నాళ్ళు రాజకీయ అస్థిరత నెలకొంది. దీంతో ప్రభుత్వాలు తరచుగా మారేవి. సీఎం ల సంగతి సరే సరి.1969 లో యుపి అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌కు చెందిన చంద్ర భాను గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన వివిధ కారణాల వలన కేవలం 19 రోజుల్లోనే  కుర్చీని కోల్పోయారు. దీంతో భారతీయ క్రాంతి దళ్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్‌ సీఎం అయ్యారు.

ఎమ్మెల్యేలు అటు ఇటు ఫిరాయిస్తున్న కారణంగా సీఎంలు తరచుగా మారేవారు. చరణ్ సింగ్ కూడా ఒక ఏడాది అధికారంలో ఉన్నారు. అంతలో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన కొన సాగింది. తర్వాత అప్పటికున్న బలం ప్రకారం మళ్ళీ చంద్రభాను గుప్తా సీఎం అయ్యారు. ఆయన 356 రోజుల పాటు అధికారంలో ఉన్నారు.

తర్వాత చౌదరి చరణ్ సింగ్ మళ్ళీ సీఎం అయ్యారు. 225 రోజులు గడిచాక చరణ్ సింగ్ దిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన అసెంబ్లీ ని రద్దు చేయమని అడగగా అప్పటి గవర్నర్ బి గోపాల రెడ్డి సింగ్ నే రాజీనామా చేయమని కోరారు.మళ్ళీ 17 రోజుల రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీ ,కాంగ్రెస్ (O) నాయకులు కలిసి సంయుక్త విధాయక్ దళ్ పేరిట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

అపుడు త్రిభువన్ నారాయణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఇందిరాగాంధీ వ్యతిరేకి. కాంగ్రెస్ చీలిక వర్గంలో ఉన్నారు. ఈ త్రిభువన్ నారాయణ్ సింగ్ అంతకుముందు ఎంపీ గా కూడా చేశారు. అక్టోబర్ 18, 1970న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువైన దివంగత మహంత్ వైద్యనాథ్ నాడు త్రిభువన్ అసెంబ్లీ కి ఎన్నిక కావడానికి తన మణిరామ్ అసెంబ్లీ సీటు ను త్యాగం చేసారు.

మార్చి 1971లో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గా రామకృష్ణ ద్వివేది పోటీ చేశారు. త్రిభువన్ కాంగ్రెస్ చీలిక వర్గం నుంచి బరిలోకి దిగారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా ద్వివేది తరపున ప్రచారం చేశారు. ఆనాటి ఎన్నికలో ద్వివేదీకి 33,230 ఓట్లు వచ్చాయి, సింగ్‌కి 17,137 ఓట్లు వచ్చాయి.

దీంతో త్రిభువన్ నారాయణ్ సింగ్ ఉప ఎన్నికలో ఓడిపోయిన మొదటి ముఖ్యమంత్రి గా చరిత్ర కెక్కారు. ఆ వెంటనే రాజీనామా చేశారు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన బెడితే ..రాజకీయాల్లో త్రిభువన్ నారాయణ్ సింగ్ కి మంచి పేరు ఉంది. నైతిక విలువలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారని అంటారు. తర్వాత కాలంలో త్రిభువన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!