చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” ఒకటి.
దీన్నే “మంకీ గాడ్ సిటీ ” అని కూడా అంటారు. 1940 వ సంవత్సరం నుంచే ఈ నగరం కోసం అన్వేషణలు మొదలైనాయి. ఎన్నో గుప్త నిధులు కూడా అక్కడ ఉన్నాయని ప్రచారం జరిగింది . జార్జి గుస్తావ్ అనే వ్యక్తి థియోడర్ అనే పరిశోధకుడిని ఈ నగర అన్వేషణ కోసం నియమించుకున్నాడు. థియోడర్ తన సహచరులతో కలసి మధ్య అమెరికా లోని హోండురస్ .. నికరాగువా దేశాల మధ్య విస్తరించిన దట్టమైన అడవుల్లోకి వెళ్లారు.
దాదాపు నాలుగు నెలలు అక్కడే గడపిన థియోడర్ తర్వాత వెనక్కి తిరిగివచ్చాడు. అక్కడ తమ బృందం కళాత్మక శిల్పాలు, బంగారం, వెండి వస్తువులను చూసినట్టు మీడియాకు తెలియజేశారు. ఆ తర్వాత అతను రెండో ప్రపంచ యుద్ధం లో చేరాడు. అదే సమయంలో అతగాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మిస్టరీ. దీంతో మంకీ గాడ్ సిటీ విషయాలు మరుగున పడిపోయాయి.
తర్వాత కాలంలో ఇదే అంశంపై రచయిత డగ్ల ప్రెస్టన్, పరిశోధకుడు స్టీవ్ ఎల్కేస్ పరిశోధన చేశారు. 2015 మార్చిలో ఈ చరిత్ర పరిశోధకుల బృందం ఈ మంకీ గాడ్ నగరాన్ని అన్వేషించడానికి వెళ్లారు. దాదాపు 32 వేల కిలోమీటర్ల మేరకు విస్తరించిన మొస్కిటియా రైన్ ఫారెస్ట్ లో ఈ నగరం ఎక్కడ ఉందో మొదట్లో వారు కనుక్కోలేకపోయారు. రచయిత డగ్ల ప్రెస్టన్, పరిశోధకుడు స్టీవ్ ఎల్కేస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరం అవశేషాలను కనుగొన్నారు. లేజర్ ఇమేజింగ్ పరికరాన్ని స్కై మాస్టర్ ప్లేన్ కి అమర్చి ఆ ప్రాంతాన్ని స్కాన్ చేశారు. స్కానింగు సమాచారాన్ని త్రీడీ కంప్యూటర్ మోడల్స్ గా తయారు చేసి విశ్లేషించారు. దీంతో మంకీగాడ్ సిటీ ఉనికి తెలిసి పోయింది.
16 శతాబ్దానికి చెందిన ఈ నగరం పై యూరప్ వలసదారులు దాడులు చేశారు. ప్రజలను బానిసలుగా మార్చారు. ఈ బానిసత్వాన్ని తట్టుకోలేక., అనారోగ్య కారణంగా అక్కడినుంచి ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. మంకీ గాడ్ శాపం వలనే వారంతా నగరాన్ని విడిచి వెళ్లారనే కథనం కూడా ప్రచారం లో ఉంది. ఇప్పటికి ఆ శాపం ఉందని … అక్కడికి వెళ్ళిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చి వెనక్కి తిరిగి రాలేదని అంటారు.
2017 కి ముందు కొంతమంది పరిశోధకులు వెళ్లి తిరిగిరాలేదని కూడా చెబుతారు. అలాంటి నేపథ్యంలో డగ్లస్ ప్రెస్టన్, స్టీవ్ ఎల్కేస్ లు తమ టీమ్ తో అక్కడికి వెళ్లాలని నిర్ణయించారు. ఆఅడవిలోకి కాలినడకన వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. సాహస యాత్ర మొదలు పెట్టారు. ప్లేన్ లో అక్కడికెళ్లి అడవిలోకి ప్రవేశించారు. అడవిలోకి వెళ్లిన పరిశోధకుల బృందానికి భయంకరమైన అనుభవాలు ఎదురైనాయి.
————– KNM
Pl. Read it Also …………..… మాయమైన నగరాలు ! (2)