హీరోకృష్ణ కు స్కూటర్ డ్రైవింగ్ నేర్పిన డైరెక్టర్ విశ్వనాథ్!

Sharing is Caring...

హీరో ఘట్టమనేని కృష్ణ కు తేనెమనసులు సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం హీరో కృష్ణ తో సహా అందరూ కొత్తవాళ్లను తీసుకోవడం తో విశ్వనాథ్ కు పని భారం పెరిగింది. ముందుగా అందరికి సీన్ వివరించి స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి రిహార్శల్స్ చేయించేవారు.

ఇప్పటికి పరిశ్రమలో ఇదే విధానాన్ని అనుసరిస్తారు. కొత్త వాళ్లలో ఉన్న బెరుకు, భయం పోగొట్టడానికి ఇదే మంచి పద్ధతి. విశ్వనాధ్ కూడా  కృష్ణ కు పలు అంశాలలో శిక్షణ ఇచ్చారు. సినిమాలో హీరో స్కూటర్ నడిపే సన్నివేశాలున్నాయి. కృష్ణ కేమో డ్రైవింగ్ రాదు. దాంతో విశ్వనాధ్ స్వయంగా కృష్ణకు స్కూటర్ నడపడం నేర్పారు.

హైదరాబాద్ లోని సారధి స్టూడియో లోను, అమీర్పేట్ రోడ్లమీద రెండురోజులు  ప్రాక్టీస్ చేయించారు. మూడో రోజుకి కృష్ణ సొంతంగా స్కూటర్ స్టార్ట్ చేసి .. నడపడం మొదలెట్టారు. అంత త్వరగా బండి నేర్చుకోవడం చూసి విశ్వనాధ్ ఆశ్చర్య పోయారట.ఆ స్కూటర్ నటుడు రావికొండలరావు ది. ఆయన కూడా కృష్ణ డ్రైవింగ్ నేర్చుకోవడంలో సహకరించారు.


సినిమాలో నాలుగైదు సన్నివేశాల్లో కృష్ణ  తొణుకు బెణుకూ లేకుండా స్కూటర్ నడిపి సింగల్ టేక్ లో షాట్ ఒకే చేశారు.
అలాగే మరో సన్నివేశంలో హీరో కారును స్కూటర్ పై ఛేజ్ చేస్తూ .. ఆ కారులోకి జంప్ చేయాలి. డైరెక్టర్ ఆదుర్తి డూప్ పెడదామంటే .. కృష్ణ తానే చేస్తానని రిస్క్ తీసుకుని స్కూటర్ పైనుంచి కారులోకి జంప్ చేశారట. ఇది కూడా సింగల్ టేక్ లో షాట్ ఒకే అయింది. అలా ఏది చెప్పినా కృష్ణ చక చకా చేసేసేవారు. ఆదుర్తి  కృష్ణ ధైర్యాన్ని మెచ్చుకుని ” నువ్వు గ్యారంటీగా డాషింగ్ .. డేరింగ్ హీరో అవుతావు” అన్నారు. ఆయన వాక్కు ఫలించి అలాగే కృష్ణ సాహసానికి మరోపేరుగా మారారు.

ఈ విషయాలన్నీ సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా విశ్వనాధ్  మీడియాతో పంచుకున్నారు. “ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే కొన్ని విషయాలు చిత్రంగా అనిపిస్తాయి. అప్పట్లో కృష్ణ నటన పట్ల ఉత్సాహంగా.. ప్రతిదీ నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు. అప్పట్లో సారధి స్టూడియో లో లంచ్ చేసి అక్కడున్న చిన్న పార్కులో బెంచీ మీద సామాన్యుడిలా పడుకునే వాడు.

అదే సామాన్యుడు అనన్య కృషితో హీరోగా .. నిర్మాతగా .. దర్శకునిగా .. స్టూడియో అధినేతగా ఇంత ఎత్తుకు ఎదగడం గొప్పవిషయం. మేమెవరం ఊహించని విజయాలను కృష్ణ సాధించారు. అప్పుడెలా మంచితనంతో ఉన్నారో నేటికీ అదే విధంగా ఉండటం హీరో కృష్ణ ప్రత్యేకత” అన్నారు విశ్వనాథ్.

విశ్వనాధ్ డైరెక్షన్ లో కృష్ణ  ప్రయివేటు మాస్టారు .. ఉందమ్మా బొట్టు పెడతా .. నేరము శిక్ష చిత్రాల్లో నటించారు. ఆదుర్తి డైరెక్షన్ లో కన్నెమనసులు, మాయదారి మల్లిగాడు, గాజుల కృష్ణయ్య వంటి చిత్రాల్లో నటించారు. ఆదుర్తి ఆర్ధికంగా దెబ్బతిన్న రోజుల్లో ‘మాయదారి మల్లిగాడు’ చిత్ర నిర్మాణానికి కృష్ణ పెట్టుబడి కూడా అందించారు.

————-theja  

   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!