He also impressed as an actor ……………………
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకుడి గా ఎంత రాణించారో నటుడిగా కూడా అదే స్థాయిలో తన సత్తా చాటుకున్నారు. ద్రోహి అనే సినిమాలోఆయన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. విశ్వనాధ్ విలన్ పాత్ర పోషించడమేమిటి అని ఆశ్చర్య పోకండి.
విలన్స్ లో రకరకాల విలన్ పాత్రలు ఉంటాయి. హార్డ్ కోర్ విలన్ , సాఫ్ట్ విలన్ , కామెడీ విలన్ పాత్రలను చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం. వాటిలో సాఫ్ట్ విలన్ పాత్రను ఆయన పోషించారు. అంటే మేక వన్నె పులి లా .. తేనె పూసిన కత్తి లా , పైకి సౌమ్యంగా కనిపిస్తూ తెరవెనుక దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.
సరిగ్గా అలాంటి పాత్రను విశ్వనాధ్ ద్రోహి సినిమాలో చేశారు. కమల్ హాసన్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా ద్రోహి సినిమాలోని శ్రీనివాసన్ పాత్రలో నటించి మెప్పించారు. కురుదిపునల్ అనే పేరు తో ఈ సినిమా తమిళం లో నిర్మితమైంది. ఉగ్రవాద బృందాన్ని వేటాడే ఇద్దరు పోలీసు అధికారుల చుట్టూ కథ తిరుగుతుంది.
ఇందులో విశ్వనాధ్ పాత్ర పోలీస్ఆఫీసర్ అయిన కమల్ తో సన్నిహితంగా ఉంటూ .. ఉగ్రవాదుల ఏజంట్ గా పని చేస్తూ…… పోలీసుల కదలికల సమాచారాన్ని టెర్రరిస్టులకు చేరవేస్తుంటాడు. ఈ పాత్రను విశ్వనాధ్ సమర్ధవంతంగా పోషించాడు.
సీబీఐ అధికారులు ప్రశ్నించడానికి వచ్చినపుడు బాత్రూం లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటారు. తమిళంలో వచ్చిన సినిమాను తెలుగులో అనువదించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ నిర్మాత కాగా కన్నడ హీరో అర్జున్, నటి గౌతమిలు కూడా ఇందులో నటించారు. కమర్షియల్ గా సినిమా హిట్ అయింది.
విలన్ వేషం వేస్తే ఆ తర్వాత మంచి పాత్రలు రావేమోనని విశ్వనాధ్ ఏమాత్రం సంకోచించలేదు.ఎందుకంటే పాత్రల కోసం ఆయన ఎదురుచూడలేదు.శ్రీనివాసన్ పాత్ర క్లిక్ అవుతుందని అనుకోలేదు. కానీ, ప్రేక్షకులను అది బాగా ఆకట్టుకుంది.
అయితే ‘ద్రోహి’ తర్వాత మరే చిత్రంలో విలన్‌గా చేయలేదు. అంతేకాకుండా, మొక్కుబడికి ఐదారు సీన్లు ఉన్న పాత్రలు కూడా చేయ లేదు. కీలకంగా ఉండే మంచి పాత్రలే చేశారు.
ఇక మొదటి సారిగా ఆయన శుభసంకల్పంలో కీలక పాత్ర పోషించారు. తండ్రిగా, కుటుంబ పెద్దగా.. తప్పులు చేస్తే మందలిచ్చే తాతయ్యగా విశ్వనాధ్ వెండి తెరపై కనిపించి ప్రేక్షకులను అలరించారు.
దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన విశ్వనాథ్.. అసలు నటుడిగా మారడానికి ప్రముఖ గాయకుడు బాలు యే కారణం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా ‘శుభ సంకల్పం’ సినిమా ప్రారంభించారు.ఈ సినిమాకు దర్శకుడు విశ్వనాథే.. అందులో ‘రాయుడు’ పాత్ర చాలా ముఖ్యమైనది. కమల్‌హాసన్ ఎప్పుడూ చేతులు కట్టుకుని ఆయన ముందే నిలబడతాడు.
కాబట్టి, కాస్త గంభీరమైన వ్యక్తిని పెడదామనుకున్నారు . తొలుత శివాజీ గణేశన్‌ను అనుకున్నారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆయనకు కుదరలేదు.ఈలోగా సినిమా షూట్ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి.’ఇంతకీ రాయుడు పాత్రధారి ఎవరో తేల్చవేమిటి’ అని ఓసారి ఎస్పీ బాలుని విశ్వనాధ్ అడిగారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ‘ఆయనెవరో ఆల్రెడీ మేం నిర్ణయించుకున్నాంలే’ అని బాలు చెప్పారు.’అదేమిటోయ్, నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు’ అని విశ్వనాథ్ అన్నారు.. దానికి బాలు ‘ఆ పాత్రను మీరే పోషిస్తున్నారు’ అన్నారు. అందుకు విశ్వనాధ్ స్పందిస్తూ ‘చాల్లే వేళాకోళం’ అన్నారు.
‘వేళాకోళం కాదు, నిజంగానే చెబుతున్నాను. ఆ పాత్రకు మీరైతేనే సూటవుతారు’ అని బాలూ అన్నాడు. విశ్వనాథ్ కి కోపమొచ్చి ‘ఏం మాట్లాడుతున్నావ్? నేను డైరెక్షన్‌లో ఉన్నానంటే మరో విషయాన్ని పట్టించుకోనని నీకు తెలుసు కదా. అలాంటిది ఏకంగా పెద్ద పాత్రనే పోషించమంటావేంటి’ అన్నారు.
అలా ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. చివరికి బాలూ ‘మీరేమన్నా చెప్పండి. కథ చెప్పేటప్పుడే ఆ పాత్రకు మీరైతేనే సరిగ్గా సరిపోతారని నాకనిపించింది. మీరా పాత్ర పోషించేటట్లయితేనే సినిమా తీద్దాం. లేదంటే మానేద్దాం’ అని కోపంగా వెళ్లిపోయాడు. దీంతో విశ్వనాథ్ ఇరుకున పడ్డారు ..కమల్ కూడా ఒత్తిడి చేశారు.
యూనిట్‌లో మరికొందరు వచ్చి నచ్చజెప్పారు. అలా కళాతపస్వి మొదటిసారి ముఖానికి రంగు వేసుకున్నారు. రాయుడు పాత్రలో జీవించారు.బాలు ఊహించినట్టు కరెక్ట్ గా విశ్వనాధ్ ఆ పాత్రకు సూట్ అయ్యారు.
ఇక శుభ సంకల్పం తర్వాత… కలిసుందాం రా లో – వెంకటేశ్‌కు తాతయ్యగా..నరసింహ నాయుడు లో – బాలకృష్ణ తండ్రి పాత్రలో.. నువ్వు లేక నేను లేను లో – తాతయ్య పాత్ర
సంతోషం లో – హీరోయిన్‌కు తండ్రిగా.. స్వరాభిషేకంలో – శ్రీకాంత్‌కు అన్నయ్యగా..
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లో – త్రిషకు తాతయ్య పాత్రలో.. పాండురంగడు లో – బాలయ్యకు తండ్రి పాత్రలో..మిస్టర్ పర్‌ఫెక్ట్ లో – తాప్సీకి తాతయ్యగా..నటించారు.
తెలుగుతోపాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ ఆయన కీలకపాత్రలు పోషించారు. ‘హైపర్’ తర్వాత ఆయన తెలుగులో ఏ చిత్రంలోనూ నటించలేదు.