ఈ రొమాంటిక్ హీరో.. లవ్ లో ఫెయిల్ అయ్యారా ?

Sharing is Caring...

Romancing With Life …………………………………..

హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో.  సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 

నవ్‌కేతన్ బ్యానర్‌ పై దేవానంద్ చాలా సినిమాలు తీసాడు. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్ వంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల ను తన సినిమాలకు పెట్టుకునే వాడు. అందుకే నవ్‌కేతన్ బ్యానర్ సినిమాలంటే  మంచి పాటలు ఉండేవని ప్రసిద్ధి.కథ నడపడంలో,పాటల చిత్రీకరణలో విజయానంద్ తన ప్రత్యేకతను చూపేవాడు.ఈ విజయానంద్ దేవానంద్ తమ్ముడే.  

దేవానంద్  అసలు పేరు ధరమ్ దేవ్ ఆనంద్. పంజాబ్‌లోని  గురుదాస్‌పూర్ అనే చిన్నఊర్లో పుట్టాడు. తండ్రి న్యాయవాది.పెద్ద కుటుంబం.చిన్న వయసులోనే తల్లి మరణించింది.తమ్ముడు విజయానంద్ ను వీపు మీద ఎక్కించుకుని తిరుగుతూ ఉండేవాడు.ఆడపిల్లలతో మాట్లాడ్డానికి దేవానంద్ భయపడేవాడు.  

అలాంటి దేవానంద్ తర్వాత రోజుల్లో రొమాంటిక్ హీరో కావడం విశేషం.లాహోర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. దేవానంద్ డిగ్రీ పూర్తి చేసేనాటికి  కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు.పై చదువులు చదవడానికి వీల్లేకపోయింది.

ఏదైనా  ఉద్యోగం చూసుకోమని తండ్రి దేవానంద్‌కు చెప్పాడు. అది అతనికి ఇష్టం లేదు. ఇంట్లో చెప్పకుండా, జేబులో ముప్పై రూపాయలతో, పందొమ్మిదేళ్ళ వయసులో, ఫ్రాంటియర్ మెయిల్ ఎక్కి తన భవిష్యత్తును వెతుక్కొంటూ బాంబే చేరుకున్నాడు.

సినిమాల్లో నటించాలని కోరిక. బొంబాయి చేరాక ఎక్కడా అవకాశాలు దొరకక ఇబ్బందులు పడ్డాడు. కొన్నాళ్లకు అన్నచేతన్‌ ఆనంద్ కూడా బొంబాయికి చేరాడు.అదే సమయంలో దేవానంద్‌కు మిలిటరీలో ఉత్తరాలు సెన్సార్ చేసే ఉద్యోగం వచ్చింది.

అన్నఇల్లు సినిమా పట్ల ఉత్సాహం ఉన్నయువ కళాకారులకు అడ్డా గా మారింది. యాక్టింగ్ అవకాశాలు వెతుక్కోవడానికి వీలు కావటంలేదని ఉద్యోగం మానేసిన రోజునే, ప్రభాత్ స్టూడియో తీస్తున్న  ‘హమ్ ఏక్ హై’  చిత్రంలో పి.ఎల్. సంతోషీ దర్శకత్వంలో హీరోగా చేసే అవకాశం వచ్చింది.

తర్వాత ప్రముఖ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథతో, ఆమె భర్త షహీద్ లతీఫ్‌ దర్శకత్వంలో హీరో వేషం దొరికింది. పూనాలో ఉన్న రోజుల్లోనే అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తున్నగురుదత్ పరిచయమయ్యాడు. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తాను నిర్మాత ఐతే ‘గురుదత్‌’ను దర్శకుణ్ణి చేస్తానని ‘దేవానంద్’, తాను దర్శకుడైతే ‘దేవానంద్’ హీరోగా సినిమా తీస్తానని ‘గురుదత్’ అనుకున్నారు.

అన్నచేతనానంద్ నిర్మాత దర్శకుడిగా మారి ‘నీచా నగర్’ లాంటి ఆర్ట్ సినిమాలు తీసి చాలా పేరూ, అవార్డులతోపాటు, నష్టాలూ సంపాదించాడు.అదే సమయంలో దేవానంద్ తనతో నటిస్తున్న ఆనాటి టాప్ హీరోయిన్ ‘సురయ్యా’తో ప్రేమలో పడ్డాడు.

అన్న దర్శకుడిగా, ‘సురయ్యా’ హీరోయిన్‌గా, తాను హీరోగా ఒక సినిమా తీయాలని నిశ్చయించుకొని నవ్‌కేతన్ బ్యానర్ స్థాపింఛాడు. ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గురుదత్‌కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ ‘బాజీ’ చిత్రం తీసాడు. ఆ చిత్రంలో నెగెటివ్ షేడ్ పాత్రలో దేవానంద్‌కి కొత్త ఇమేజ్ తెచ్చాడు గురుదత్.

నాటి నుంచి దేవానంద్  రొమాంటిక్ హీరోగా దశబ్దాల పాటు హిందీ తెరను ఏలాడు.  తమ్ముడు విజయానంద్ నవ్‌కేతన్ సంస్థ చిత్రాలకు దర్శకుడయ్యాక కొన్ని హిట్ మూవీస్ తీసాడు. ‘ప్రేమ్ పూజారి’ చిత్రంతో దేవానంద్ దర్శకుడిగా మారాడు.

తనకు నచ్చిన సబ్జెక్టులపై కొత్త తారలతో చిత్రాలు తన దర్శకత్వంలో నిర్మించాడు. నటుడిగా,నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను అనేక పురస్కారాలు అందుకున్నాడు. ప్రభుత్వం ఆయనను  ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం తో సత్కరించింది. ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించినా తీసుకోలేదు.రొమాంటిక్ హీరో గా పేరుగాంచిన దేవానంద్ నిజజీవితంలోనూ ఎన్నో రొమాంటిక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. 

హీరోయిన్ ‘సురయ్యా’తో ప్రేమను ఆమె కుటుంబం అంగీకరించలేదు ..ముఖ్యంగా ఆమె నాయనమ్మ అభ్యంతరాలవల్ల ఆ ప్రేమ కథ ముందుకు సాగలేదు.అఫ్సార్ షూటింగ్ లో వజ్రపు ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాడు దేవానంద్ సురయ్యా.. కు.. ఆమెకు ఇష్టమే. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

ఆ తర్వాత తనతో హీరోయిన్‌ గా నటించిన కల్పనా కార్తిక్ ( మోనా సింఘా)తో ప్రేమలోపడ్డారు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. ఒక దశలో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలో నటించిన జీనత్ అమన్‌ ను కూడా ప్రేమించాడు. ఆమెకు తన మనసులో మాట చెబుదామనుకునే లోగా ఆమె రాజ్‌కపూర్’ సత్యం శివం సుందరం’లో నటించడానికి నిర్ణయించుకుంది. దాంతో సైలెంట్ అయిపోయాడు. 

ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ, విసి.శుక్లాల తరపున ప్రచారం చేయటానికి నిరాకరించినందుకు దేవానంద్ వేధింపులకు గురయ్యాడు. 1977 ఎన్నికల్లో బాహాటంగా జనతాపార్టీకి మద్దతు ప్రకటించి, తోటి నటులచే ప్రచారం చేయించాడు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాడు కానీ ఎందుకో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. 

దేవానంద్  నిర్మాతగా చాలామంది కొత్త కళాకారులకు అవకాశాలు ఇచ్చాడు. గురుదత్, రాజ్ ఖోస్లా, విజయానంద్ వంటి టెక్నీషియన్లు, శత్రుఘ్న సిన్హా, జాకీ ష్రాఫ్, టీనా మునిమ్, టాబు లాంటి యాక్టర్లు దేవానంద్ పరిచయం చేసినవారే. 2007లో దేవానంద్ తన జీవిత కథను Romancing With Life పేరిట పబ్లిష్ చేసాడు. అందులో ఈ విషయాలన్నీ రాసుకున్నాడు.  

——-KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!