Goverdhan Gande…………………..
Simplified economic policies…………………………..”సరళీకరణ విధానాలవలన దేశంలోని అన్ని రంగాల్లోనూ అసమానతలు పెరిగాయి.కేవలం ఆర్థికరంగం మీదనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలపైన ఆ ప్రభావం పడింది.” అదెలా జరిగిందో చూద్దాం.
గొంగళి వినియోగానికి వీలుకాకుండా జీర్ణమై పోయింది. ఎందుకు అలా? దాన్ని అక్కడే ఎందుకు వేశారు? అది ఇంకా అక్కడే ఎందుకున్నది?30 ఏళ్ళ తరువాత ఈ ప్రశ్నలు వేయక, వేసుకోక తప్పడం లేదు. నిజానికి గొంగళి అక్కడే వేద్దామనుకోలేదు. ఆ పాత గొంగళిని దులిపి శుద్ధి చేద్దామనుకున్నారట!కాదు, కాదు, గొంగళి స్థానంలో కంబళి వేద్దామనుకున్నారట! దాని పేరే సరళీకరణ? ప్రపంచీకరణ? ప్రైవేటీకరణ?
ఈ విధానానికి 30 ఏళ్ళ క్రితం తలుపులు బార్లా తెరిచి పెట్టింది మన దేశ రాజకీయ నాయకత్వం.తెరిచిన ఈ తలుపులు సాయంతో దేశ రూపురేఖలు సమూలంగా మారిపోతాయని ఊదరగొట్టారు.అప్పటి వరకు అమలులో ఉన్న మిశ్రమ ఆర్థిక విధానం, పెట్టుబడి దారీ విధానంగా మారిపోయింది. చెప్పినట్లుగానే చాలా మార్పులొచ్చాయి. రోడ్లు విశాలంగా మారిపోయాయి.రంగురంగుల దీపాలు ఆ రోడ్లను తళతళ లాడించాయి. ప్రపంచ నలుమూలల్లో తయారైన విలాసవంతమైన, ఖరీదైన కార్లు మన రోడ్లను పావనం చేశాయి. కడుపులో చల్ల కదలకుండా సుఖ ప్రయాణం చేయగల అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లోకి రంగుల టీవీ వచ్చింది.బట్టలు ఉతికే మెషీన్ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి రకరకాల గృహోపకరణాలు మధ్య తరగతి ఇళ్లను పావనం చేసి పడేసాయి. వంట సులభమైపోయింది.టెలి కమ్యూనికేషన్ల రంగంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ల్యాండ్ ఫోన్ స్థానంలోకి మొబైల్ ఫోన్లోచ్చాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచం నలుమూలల్లో సంభవించే పరిణామాలను క్షణాల్లో తెలుసుకోగలిగే అవకాశం చేజిక్కింది. అంటే గుప్పిట్లోనే విశ్వం ఇమిడి పోయిందన్న మాట!వీటిలో ఎక్కువ సౌకర్యాలు (మొబైల్,టీవీ లాంటివి మినహా)అందుబాటులోకి వచ్చింది మాత్రం సంపన్నులు,ఎగువ మధ్య తరగతి వారికి మాత్రమే.పేద వర్గాల జీవితంలో పెద్దగా మార్పు లేదు.మొత్తానికి మార్పు లేదనడం సరైంది కాదు గాని.కాలంతో పాటు ఈ వర్గంలో కొద్ది పాటి మార్పు వచ్చింది. వీళ్ళ ఆదాయాలు కొద్దిగా పెరగాయి. జీవన ప్రమాణాల్లో కూడా కొద్దిపాటి మార్పు మాత్రమే వచ్చింది. అయితే కొత్త ఆర్థిక విధాన లక్ష్యం ఇది కాదు. అమెరికా,యూరప్ దేశాలతో సమ అభివృద్ధి సాధించాలనేది కదా లక్ష్యం.మన దేశంలో ఇప్పుడు వినియోగంలో ఉన్న అనేక వస్తువుల్లో మెజారిటీ విదేశీ ఉత్పత్తులే. ఇవన్నీ పారిశ్రామిక దేశాల్లో తయారై అక్కడి అవసరాలు తీరిన తరువాత మిగిలిన అదనపు సరుకు అన్న మాట. కాదు ఉన్నమాటే.అలా కాకపోతే అదే టెక్నాలజీని వినియోగించి మన దేశంలో తయారు చేసిన వస్తువులన్న మాట. కానీ సరళీకరణ అందుకోసమని మన రాజకీయ నాయకత్వం చెప్పలేదు.
స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకొని ఆయా వస్తువులను ఇక్కడే ఉత్పత్తి చేసుకొని ఇక్కడి అవసరాలు తీరిన తరువాత అవసరమైన దేశాలకు విక్రయించి ఆర్థిక సమృద్ధిని సాధించడం అసలు లక్ష్యమని అందుకే సరళీకరణ అని నమ్మబలికాయి.కానీ వాస్తవంలో అలా జరగలేదు. దేశీయ కుటీర పరిశ్రమ కుదేలైపోయింది. అనేక చిన్న పరిశ్రమలు మూత పడ్డాయి. దేశీయ పెట్టుబడిదారీ వర్గం ఉత్పాదక రంగంగా మార్పు చెందకుండా అదే పాత పద్ధతిలో మర్చంట్ రంగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అమ్ముకునే పాత పద్ధతినే అనుసరించాయే తప్ప,కొత్త టెక్నాలజీ ని అభివృద్ధి పరిచే పరిశోధక రంగంలో దృష్టి సారించకుండా సులువైన పాత పద్ధతిలోనే కొనసాగుతున్నది.ప్రభుత్వం సైతం పరిశోధన,అభివృద్ధి రంగంపై పెద్దగా చేసింది ఏమీ లేదు.
పరిశోధన,అభివృద్ధి రంగాల్లో నిధులు వెచ్చించకుండా సాంకేతిక అభివృద్ధి సాధ్యం కాదు.అదీ కాకుండా దేశీయ పబ్లిక్ రంగాన్ని ఒక్కొక్కటిగా పావలాకి అణాకి అమ్మివేస్తూ పోతే 70 ఏళ్ళ శ్రమ సంపద అంతా బూడిదలో పోసినట్లే కదా. ప్రభుత్వ ధోరణి ఫలితంగా 70 ఏళ్ళ దేశ శ్రమ శక్తి ఫలితమైన అనేక పీ ఎస్ యూ లు ఒక్కోటిగా నిర్వీర్యపోతున్నాయి. అనేక జాతీయ బ్యాంకులు విలీనమో,ప్రైవేటు పరమో అయ్యాయి.బీ ఎస్ ఎన్ ఎల్ అవసాన దశకు చేరుకున్నది. ఎల్ఐసీ అదే దిశలో పయనించబోతున్నది. మొత్తం ప్రభుత్వ రంగమే కనుమరుగు కాబోతోంది.ఇలాగే కొనసాగుతూ వస్తువులను దిగుమతి చేసుకుంటూ, పోతే దేశంలో ఉత్పత్తి అయిన శ్రమ సంపద అంతా పరాయి దేశాలకు తరలిపోతుంది కదా.దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో ఏ మాత్రం మెరుగుదల సాధించలేని, దేశ సంపదను మెరుగు పరిచే చర్యలేమీ చేపట్టకుండా, చేపట్టిన ఈ విధానాన్ని సరళీకరణ,ప్రైవేటీకరణ,ప్రపంచీకరణ అనే అందామా ?