కన్నవారే మోసం చేసారా ?

Sharing is Caring...

Pleasures on screen are hardships in life ……………………..

“మా ఊళ్ళో ఒక పడుచుంది .. దెయ్యమంటే భయమన్నది” అన్న పాట వినగానే టక్కుమని గుర్తుకొచ్చేది  ఒకనాటి హీరోయిన్ కాంచన. కాంచన …. చక్కని పేరు,పేరుకి తగినట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం సినిమా ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి తెలియదు. ఆ మధ్య గూగుల్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే కాంచన ఫోటో కనిపించింది. పాత తరం తమిళ నటి అని రాశారు. 

తెలియని వాళ్ళు అది నిజమే అనుకుంటారు. కాంచన అసలు సిసలు తెలుగు నటి. వాళ్ళ అమ్మగారిది ఒంగోలు దగ్గర కరవది గ్రామం. పీసపాటి వెంకటరాయశర్మ గారు కాంచన తాతగారు. శర్మగారి కుమార్తె విద్యుల్లత ను పురాణం రామకృష్ణ శాస్త్రి వివాహం చేసుకున్నారు. ఈ పురాణం వారిది విజయవాడ. మద్రాస్ లో సివిల్ ఇంజనీర్ గా చేసేవారు.

కాంచన మద్రాస్ లో పుట్టింది. అక్కడే పెరిగింది. చెన్నైలో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చదవడం వలన కాంచన కు ఆంగ్ల భాష పై మంచి పట్టు ఉండేది. చిన్నప్పుడే భరత నాట్యం కూడా నేర్చుకుంది. కాంచన అసలు పేరు వసుంధర. చిన్నపుడు కరవది వచ్చినపుడు ఒక కోయదొర ఆమెను చూసి బంగారు భవిష్యత్ ఉందని జోష్యం చెప్పాడు. ఆమాటపెద్దయ్యాక నిజమైంది.

ఆమె పేరులోకి బంగారం వచ్చి “కాంచన” అయింది. తమిళ దర్శకుడు శ్రీధర్ ఆమెకు ఆపేరు పెట్టాడు. సినిమాల్లోకి రాకముందు తండ్రి ఉద్యోగం మానేసి , వ్యాపారం చేయడం, అందులో ఆర్ధికంగా దెబ్బతినడం తో కుటుంబ సంరక్షణ కోసం కాంచన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరింది.

కోల ముఖం, కొనదేరిన నాసిక, విశాలమైన కళ్ళు ,చక్కని పలు వరుస తో కూడిన నవ్వు, స్లిమ్ పర్శనాలిటీ కాంచన సొంతం. ఆ సమయంలోనే కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నశ్రీధర్ పరిచయమై తన సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చాడు. సినిమాల్లో ఆదాయం బాగుంటుంది కనుక తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. కాంచన అలా “కాదలిక్క నేరమిల్లయ్” (ప్రేమించే సమయం లేదు ) సినిమాలో నటించింది.

అది సూపర్ హిట్ కావడం తో ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు. ఇదే తెలుగులో “ప్రేమించి చూడు” గా వచ్చింది. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని సరసన రాజశ్రీ నటించగా, జగ్గయ్య పక్కన కాంచన నటించింది. తెలుగులోకూడా తొలి సినిమా హిట్ కావడంతో అప్పటి దర్శకులు కాంచన కు అవకాశాలు ఇచ్చారు.

“వీరాభిమన్యు” లో హీరో శోభన్ బాబు పక్కన నటించి అందరి మెప్పుపొందింది. కె విశ్వనాధ్ మొదటిసారి దర్శత్వం చేపట్టిన ‘ఆత్మగౌరవం’ లో హీరోయిన్ గా అక్కినేని పక్కన నటించింది. ఇది కూడా హిట్ కావడంతో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నిలదొక్కుకుంది.

తన పాత్రకు తానే డబ్బింగ్  చెప్పేది. ఆమె డైలాగు డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్,అక్కినేని ,కృష్ణ ,శోభన్ బాబు తదితర హీరోలతో నటించింది. తమిళంలో ఎంజీఆర్ ,శివాజీగణేశన్, జెమినీగణేశన్ వంటి పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా చేసింది.   

కన్నడం లో రాజ్ కుమార్, అంబరీష్ సరసన,మలయాళం లో ప్రేమ్ నజీర్ తదితరులతో నాయికగా నటించింది. 70 వ దశకంలో ‘క్వీన్ అఫ్ సెవెంటీస్’ అని కాంచనను అందరూ పొగిడేవారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.

సాత్విక లక్షణాలు ఎక్కువగా ఉన్నకాంచన నిజ జీవితంలో  చాలా సెన్సిటివ్ గా ఉండేవారు. ఆమె ఎవరినో ప్రేమించిందని .. అతగాడు తిరస్కరించడంతో పెళ్లి చేసుకోలేదని అంటారు. ఈ వ్యవహారంలోనే తల్లి తండ్రులతో గొడవలు జరిగాయనే కథనాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. 

ఈక్రమంలోనే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆమె ఎవరి కోసమైతే కష్టపడ్డారో …ఎవరికోసమైతే సినిమాల్లో వేషాలు ఆతల్లి తండ్రులు ఆమెను మోసం చేసారు. వేరే పని కోసమంటూ తెల్లకాగితంపై సంతకం చేయించుకుని  ఆస్తి మొత్తం సొంతం చేసుకున్నారు. 

కన్న కూతురిపైనే లేనిపోని ప్రచారాలు చేశారు. వారి మాట వినలేదని అక్కసుతో కాంచనను శత్రువుగా చూసారు.ఈ మోసాన్ని భరించలేకపోయిన కాంచన బెంగళూరు వచ్చి చెల్లెలు గిరిజ ఇంట్లో తల దాచుకున్నారు. సంపాదించిన కోట్ల ఆస్తి మొత్తం పోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.చెల్లెలు ఇంటికి దగ్గర్లో ఉన్న గుడి లో సేవలు చేస్తూ కాలం గడిపింది. 

చెల్లెలు, ఆమె భర్త సహకారంతో తల్లితండ్రులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించింది. ఆ ఆస్తులలో దాదాపు 15 కోట్లకు పైగా విలువ గల స్థలాలను 2010 లో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేసింది. ఏ నటి ఇంతవరకు అంత పెద్ద మొత్తంలో తిరుమల వెంకన్నకు విరాళంగా ఇవ్వలేదు.

‘రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె’ ….   ‘అందెను నేడే అందని జాబిల్లీ ..నా అందాలన్నీ ఆతని వెన్నెలలే’ ….  ‘పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం’ …..  ‘పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా’ ….’మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల’  వంటి పాటలు విన్నపుడు కాంచన ఎవరికైనా కళ్ళముందు కదులుతుంది. చెల్లెలు సంరక్షణలో ఉంటున్న కాంచన ఆ మధ్య అర్జున్ రెడ్డి సినిమాలో నటించింది. ఆ తర్వాత సీరియల్స్ లో నటించమని ఎందరో అడిగినా అంగీకరించలేదు.

———-  K.N.MURTHY

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!