సుయోధనుడు కేరళ వెళ్లాడా ??

Sharing is Caring...

సుమ పమిడిఘంటం…………..

దుర్యోధనుడ్ని హీరోగా చూపుతూ 800 వందల పేజీల నవల రాశారు రచయిత ఆనంద్ నీలకంఠన్. ఇది రెండుభాగాలుగా వచ్చింది. ఈ రచయిత మలయాళీ. కొచ్చిన్ ఊరిబైట శివారు గ్రామం వీరిది. IOC లో ఇంజనీర్. ఇతనికి పురాణాలపై అభిలాష అధికం. అయితే  పురాణాలలో, ఇతిహాసాలలోని పరాజితులే ఇతగాడికి నాయకులుగా కనిపిస్తారు.

జాతీయ స్థాయిలో బెస్ట్ సెల్లర్ గా ప్రథమస్థానంలో నిలిచిన వీరి మొదటి పుస్తకం “అసుర” అద్భుత విజయాన్ని చవిచూసింది. రెండవ పుస్తకం “అజయ” .. ఇది  విజేతల దృక్కోణం నుండి చెప్పే సాధారణ కథకు విరుద్ధంగా పరాజితుడైన దుర్యోధనుడి దృక్కోణం నుండి రాసిన కథ. సుయోధనుడిని నాయకుడి గా విశ్లేషించిన నవల.

ఈ నవల రాయడానికి ముందు రచయిత సమీప గ్రామం పోరువాళి లో జరుగుతున్న ఒక తిరుణాల   
చూడటానికి వెళ్లారు. అక్కడ స్థానికులు చెప్పిన వివరాల మేరకు స్ఫూర్తి పొంది నవల రాశారు. అక్కడి మలనాడ ఆలయంలో వెలసిన అధిష్టాన దైవాన్ని కొలవటానికి వెళ్ళే ఊరేగింపులో లక్షమంది భక్తులు పాల్గొన్నారట.

భక్తులలో అన్నివర్గాలకు, కులాలకు చెందినవారున్నారు. అక్కడి ఆ ఆలయంలోని అధిష్టాన దైవం భారత పౌరాణిక సాహిత్యంలో అత్యధిక ద్వేషానికి గురైన దుర్యోధనుడు.అక్కడ సుయోధనుడికి ఆలయం కట్టించడానికి మూలమైన ఒక అద్భుతమైన ఐతిహ్యం ప్రచారంలో ఉన్నది.

అజ్ఞాతంలో వున్న పాండవులను వెదుకుతూ దుర్యోధనుడు ఆగ్రామం వెళ్ళాడట.తిరిగి తిరిగి అలసిపోయాడు .. దాహంతో గొంతెండిపోయి ఒక వృద్ధురాలిని దాహంగా ఉందని నీరు కావాలని అడిగాడు. అనాలోచితంగా ఆమె తన దగ్గరున్న తాటికల్లు పాత్ర ఇచ్చింది. రాకుమారుడు గటగటా తాగేశాడు.

అతను క్షత్రియ యోధుడనీ తను కురతిజాతి అస్పృశ్యరాలినని నిజం చెబితే మరణదండన.. చెప్పకపోతే మోసం. ప్రాణాపాయానికి సిద్ధపడి నిజం చెప్పేసింది ఆమె . ఇంతలో గ్రామస్తులు అక్కడ గుమిగూడారు.

వృద్ధురాలు శిక్ష కొరకు వేచివుండగా “ఆకలి దప్పులకు కులం లేదమ్మా. అపాయం అని తెలిసీ నా దాహార్తి తీర్చావు. ఈగ్రామ పరిసరాలలో ఒక ఆలయం కట్టుకోండి. ఐతే ఆలయంలో ఏవిగ్రహమూ ఉండకూడదు. అంటరానివారే ఆలయ పూజారులుగా ఉండాలి” అని ప్రకటించాడట హస్తినాపుర రాకుమారుడు.ఆలయం కోసం స్థలం కూడా ఇచ్చాడని చెబుతారు.తర్వాత కాలంలో అక్కడ గుడి కట్టారు. 

ఇప్పటికీ అక్కడ ఎలాటి విగ్రహ ప్రతిష్ఠాపన లేదు గానీ అక్కడి అధిష్ఠానదైవం దుర్యోధనుడు, ఉపదేవతలుగా భానుమతి, గాంధారి, కర్ణుడు పూజలందుకుంటున్నారు. అస్పృశ్యులే ఇప్పటికీ పూజారులు. ప్రతీ సంవత్సరం అక్కడ జాతర జరుగుతుంది.పేదవారినీ, బలహీనులను కాపాడటానికి సుయోధనుడి ఆత్మ అక్కడే నివశిస్తుందని నమ్ముతారు. 

అంతేగాదు రోగాలతో బాధపడేవారు, కోరికలు నెరవేర్చమని మొక్కునేవారిని ఈదైవం కాపాడుతుందనీ స్థానికులు నమ్ముతారు.

ఇవన్నీ తెలుసుకుని “హస్తినాపురం నుండి కేరళ వరకూ వచ్చాడా దుర్యోధనుడు? “ఆశ్చర్యపోతూ అడిగాడట రచయిత. “ఏం రాలేడా!? మాప్రాంతం నుంచీ శంకరాచార్యులు కేదారనాథ్ కాలినడకన ఎన్నిసార్లు వెళ్ళిరాలేదూ. రథాలూ, గుర్రాలూ వున్న రారాజు హస్తిన నుండి కేరళ వచ్చిపోలేడా!” అన్నారు గ్రామస్తులు. రచయిత కు నోట మాట రాలేదట. 

సుయోధనుడి ఆలయం విశేషాల గురించి మరో పోస్టులో చెప్పుకుందాం. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!