One story, three movies….
సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ తొలిసారిగా వేంకటేశ్వరుని పాత్రలో ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు.(పుల్లయ్య పేరుతో మరో దర్శకుడు కూడా ఉన్నారు..ఆయన చిత్తజల్లు పుల్లయ్య ..ఆయన లవకుశ తీశారు)‘మాయాబజార్’ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకాదరణ పొందిన ఎన్టీఆర్ కి ఈ వేంకటేశ్వరుని పాత్ర మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో శ్రీనివాసుడిగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం తర్వాతే ప్రజలు ఆయనను సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అవతారంగా భావించి, ఆయన ఫోటోలకు పూజలు చేయడం ప్రారంభించారు. తిరుపతి యాత్రకు వెళ్లిన వారు తప్పనిసరిగా మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ని చూసి వచ్చేవారు.
ఆ రోజుల్లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద ఎన్టీఆర్ వేంకటేశునిగా కనిపించే కటౌట్లను పెట్టారు. సినిమా చూసేందుకు వచ్చిన జనం ఆ కటౌట్లకు భక్తితో పూజలు చేసేవారు. కొబ్బరికాయలు కొట్టేవారు. థియేటర్ల వద్ద నిర్మాతలు హుండీలు కూడా ఏర్పాటుచేయడంతో కానుకలు కూడా సమర్పించుకునేవారు. అలా వచ్చిన ఆ మొత్తాలను నిర్మాతలు తిరుమల – తిరుపతి దేవస్థానం వారికి పంపించే వారు.
దర్శకుడు పి. పుల్లయ్య 1939లో నిర్మితమైన ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. అందులో వెంకటేశ్వరునిగా సి. ఎస్. ఆర్, పద్మావతిగా శాంతకుమారి నటించారు. పుల్లయ్య సతీమణే శాంతకుమారి. ఆ సినిమా కూడా విజయవంతమైంది.
రెండోసారి పద్మశ్రీ పిక్చర్స్ సొంత బ్యానర్ పై మళ్ళీ ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ తీశారు. ఇందులో ఎన్టీఆర్,ఎస్ వరలక్ష్మి , సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. శాంత కుమారి వకుళ మాత గా,భృగు మహర్షిగా గుమ్మడి నటించారు. తొలి చిత్రం మాదిరిగానే ఈ చిత్రం కూడా సంచలనం సృష్టించింది.
రెండో సారి తీసిన సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ఆత్రేయ సమకూర్చగా ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి ఒక్కో పాట రాశారు. పద్యాలను నారపరెడ్డి రాశారు.పియల్ రాయ్ తన కెమెరాతో పుల్లయ్య ఆలోచనలకు తగినట్టుగా సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అద్భుతమైన బాణీలు అందించారు.
‘శేష శైలావాస శ్రీ వేంకటేశా, శయనించు మా అయ్య’ పాటలో ఘంటసాల మాష్టారు నటించారు. సినిమా లో అన్నిపాటలు బాగుంటాయి. ఈ సినిమా హక్కులు ఈ టీవీ విన్ వారి వద్ద ఉన్నాయి. పాటలు మాత్రం యూట్యూబ్ లో ఉన్నాయి.
1979 లో ఇదే సినిమాను ‘తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’ పేరిట ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పై తిరిగి నిర్మించారు.. ఆయనే డైరెక్ట్ చేశారు. ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ స్వామి వారి వైభవాన్ని చూపిస్తే, ఈ సినిమా ప్రధానంగా స్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని, ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరిగిన వివాహ వృత్తాంతాన్ని చూపుతుంది.
ఇందులో ఎన్టీఆర్ మరల శ్రీనివాసునిగా నటించగా, జయప్రద పద్మావతిగా,లక్ష్మిదేవిగా జయసుధ ,వకుళగా అంజలీ దేవి నటించారు. హీరో బాలకృష్ణ నారదుడిగా నటించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. డీవీ నరసరాజు స్క్రిప్ట్ సమకూర్చారు.అలా మొత్తం మీద శ్రీ వేంకటేశ్వరుని చరిత్ర మూడు సార్లు తెరకెక్కింది. రెండింటిలో ఎన్టీఆర్ హీరో కావడం విశేషం. 

