ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసిందా ?

Sharing is Caring...

Ravi Vanarasi ………….

మనం చూసే ప్రతి అద్భుతం వెనుక ఒక అంతులేని కథ ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవిత ప్రయాణం కావచ్చు, ఒక కష్టం నుండి సాధించిన విజయం కావచ్చు, లేక  కలల సాకారానికి జరిగిన నిశ్శబ్ద పోరాటం కావచ్చు. అలాంటి ఒక కథే అనోక్ యాయ్ ది.

మోడలింగ్ ప్రపంచంలోకి తుఫానులా దూసుకొచ్చిన ఈ నల్లజాతి యువతి ఇప్పుడు కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు, ఒక ఆదర్శం. ఒక గంటకి 15,000 డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగి, “ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోడల్” అనే బిరుదును అందుకున్న ఆమె ప్రయాణం అద్భుతం. 

1997లో ఈజిప్ట్‌లోని కైరో నగరంలో పుట్టిన అనోక్ యాయ్, పుట్టుకతోనే ఒక పోరాటాన్ని చూసింది. ఆమె తల్లిదండ్రులు దక్షిణ సుడాన్‌కు చెందినవారు. అక్కడ సాగుతున్న అంతర్యుద్ధం, హింస, అనిశ్చితి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం, ఒక సురక్షితమైన జీవితం కోసం వారు తమ మాతృభూమిని వదిలి వెళ్లక తప్పలేదు.

ఆశ, భయం కలగలిపిన ఒక ప్రయాణం అది. పగలూ రాత్రి తేడా లేకుండా, ఎప్పుడు ఎక్కడ నుండి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు నడిచారు. ఆ దారిలో వాళ్లకు దొరికిన ఆశ్రయం ఈజిప్ట్‌లోని కైరో. అక్కడ ఆమె పుట్టారు. కానీ, అది కూడా వారికి శాశ్వత గృహం కాలేకపోయింది. సురక్షితమైన జీవితాన్ని వెతుక్కుంటూ, జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాలని వాళ్ళు చివరికి అమెరికాకి వలస వచ్చారు.

ఆ రోజులు గుర్తు చేసుకుంటే, అనోక్ యాయ్‌కి కొన్ని అస్పష్టమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఆమె అమెరికా వచ్చినప్పుడు ఐదేళ్ళ బాలిక. ఆ ఐదు సంవత్సరాలు కూడా ఒక చోట స్థిరంగా ఉండని జీవితం ఆమెది. న్యూ హ్యాంప్‌షైర్‌లోని మాంచెస్టర్ నగరంలో వారికి కొత్త జీవితం మొదలైంది. ఒక కొత్త దేశం, కొత్త భాష, కొత్త సంస్కృతి. వాళ్ళ కలలన్నీ ఈ కొత్త గడ్డపైనే ఆధారపడ్డాయి.

అనోక్ తల్లిదండ్రులు ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. అనోక్ చదువుపై దృష్టి పెట్టింది. జ్ఞానమే తనను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని ఆమె బలంగా నమ్మింది. డాక్టర్ కావాలనే కలలు కన్న ఆమె, ప్లైమౌత్ స్టేట్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ చదివింది. మోడలింగ్ అనేది ఆమె కలలో కూడా ఊహించని ఒక కొత్త ప్రపంచం.

అది 2017వ సంవత్సరం, అక్టోబర్ నెల. ప్రపంచం అనోక్ యాయ్ గురించి తెలుసుకునే ముందు జరిగిన ఒక సాధారణ సంఘటన అది. హావర్డ్ యూనివర్సిటీలో హోమ్‌కమింగ్ వారోత్సవాలు జరుగుతున్నాయి. అనోక్ యాయ్ ఆ వేడుకలకు వెళ్ళింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ గడుపుతున్న ఆమె, అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ స్టీవ్ హాల్ కంటపడింది.

స్టీవ్ ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, అతను కళాత్మక దృష్టితో మనుషులను చూస్తాడు. అనోక్ అందం, ఆమెలో ఉన్న ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం, ప్రపంచంలోకి తొంగి చూస్తున్న ఆమె కళ్ళు, ఈ మూడు స్టీవ్‌ని ఆకర్షించాయి. ఆమె అసాధారణమైన సౌందర్యం ఆయనను కదలకుండా నిలబెట్టింది. వెంటనే ఆమె అనుమతి తీసుకుని ఫోటోలు తీశారు.

ఆ ఫోటోలను ఎడిట్ చేయకుండానే, ఎక్కడా కలుషితం కాని సహజమైన అందాన్ని చూపిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఆ ఒక్క ఫోటోతో అనోక్ యాయ్ జీవితం పూర్తిగా మారిపోయింది. గంటల్లోనే ఆ ఫోటో లక్షల మందిని చేరుకుంది. ఆ ఫోటో కింద “ప్రపంచంలోనే అందమైన అమ్మాయి” అని ఒకరు, “మోడలింగ్ ప్రపంచం కోసం పుట్టిన సౌందర్యం” అని మరొకరు కామెంట్లు పెట్టారు. ఆ ఫోటోకి వచ్చిన స్పందన అసాధారణమైనది.

మోడలింగ్ ఏజెన్సీలు, ఫోటోగ్రాఫర్లు, ఫ్యాషన్ డిజైనర్లు… అందరి దృష్టి ఒక్కసారిగా అనోక్ పై పడింది. అనోక్ ఫోన్ మోగుతూనే ఉంది. వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ లెక్కలేదు. మొదట ఇది ఏదో జోక్ అనుకుంది. కానీ, ప్రొఫెషనల్ మోడల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు ఆమెతో మాట్లాడాలని కోరుకుంటున్నారని తెలిసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. తనని ఒక మోడల్‌గా వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? అనే ప్రశ్న ఆమెను వేధించింది.

అందరితో పోలిస్తే అనోక్ యాయ్ లోని ఆకర్షణ ఏంటంటే, ఆమె నల్లని చర్మం. అది ఒక రంగు కాదు, అది ఒక అద్భుతమైన షేడ్. కాంతిలో, చీకటిలో అది తన రంగును మారుస్తూ ఉంటుంది. ఆమె ఎత్తైన శరీర ఆకృతి, ఆత్మవిశ్వాసంతో కూడిన నడక, కళ్లతోనే కథ చెప్పే ఆమె చూపులు. మోడలింగ్ ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్తదనం ఆమెలో కనిపించింది.

దశాబ్దాలుగా ఉన్న ఒకే రకమైన మోడల్స్ కు భిన్నంగా, అనోక్ ఒక కొత్త శకాన్ని సృష్టించింది…ప్రపంచ ఫ్యాషన్ రంగంలో చరిత్ర సృష్టించిన క్షణం!ఆ ఫోటో వైరల్ అయిన నాలుగు నెలల్లోనే, అనోక్ యాయ్ ప్రముఖ సంస్థ “నెక్స్ట్ మోడల్ మేనేజ్‌మెంట్” తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికే ఆమె చదువు పూర్తి చేసి, మోడలింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె జీవితంలో తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం.

డాక్టర్ కావాలనే తన కలను పక్కన పెట్టి, ఒక కొత్త, తెలియని ప్రపంచంలో అడుగు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. కానీ, ఆమె  ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది.2018లో ఫ్యాషన్ ప్రపంచం అనోక్ యాయ్‌ని చూసి ఆశ్చర్యపోయింది.

ఫ్యాషన్ దిగ్గజమైన ప్రాడా తన ఫ్యాషన్ షోలో అనోక్‌ను ప్రారంభ మోడల్‌గా నడిపించింది. ఇది ఒక చిన్న విషయం కాదు. ఫ్యాషన్ చరిత్రలో మొదటి నల్లజాతి మహిళా సూపర్ మోడల్ నయోమి క్యాంప్‌బెల్ తర్వాత, ప్రాడా ఫ్యాషన్ షోలో ప్రారంభ మోడల్‌గా నడిచిన రెండవ నల్లజాతి మోడల్ గా అనోక్ చరిత్ర సృష్టించింది.

వేలాది మంది ఫ్యాషన్ విమర్శకులు, డిజైనర్లు, ప్రముఖులు ఒకే చోట ఉన్నారు. ఆ ర్యాంప్‌పై అడుగుపెట్టినప్పుడు అనోక్ ఒళ్ళంతా పులకరించి ఉంటుంది. ఆమె అడుగులు కేవలం ర్యాంప్‌పై మాత్రమే కాదు, ఫ్యాషన్ చరిత్రలో పడ్డాయి. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, మోడలింగ్ ప్రపంచంలో ఉన్న పాత మూస పద్ధతులను బద్దలు కొట్టి, వైవిధ్యాన్ని, అసలైన అందాన్ని స్వాగతించిన ఒక చారిత్రక ఘట్టం.

ఆ తర్వాత అనోక్ యాయ్  వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక బ్రాండ్ గా మారింది. ఆమె ఫోటోలు, ర్యాంప్ వాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాషన్ పరిశ్రమ అనోక్ ను ఆరాధించింది. ప్రముఖ మ్యాగజైన్ “వోగ్” ఆమెను “న్యూ సూపర్స్” జాబితాలో చేర్చింది. 2023లో, మోడల్స్.కామ్ నిర్వహించిన పోల్‌లో, ఇండస్ట్రీ, అభిమానులు  ఆమెను “మోడల్ ఆఫ్ ది ఇయర్”గా ఎంపిక చేశారు.

ఇది ఆమెపై ఉన్న అభిమానానికి, ఆమె పనికి లభించిన గుర్తింపు. ఆమె కేవలం అందంతోనే కాదు, తన కష్టంతో, వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో ఈ స్థానానికి చేరుకున్నారు.వోగ్, ఐ-డి వంటి అంతర్జాతీయ మ్యాగజైన్‌ల కవర్‌లపై ఆమె కనిపించింది.  ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు. అమెరికన్ వోగ్ కవర్‌పై మూడు సార్లు కనిపించిన అతి కొద్ది మందిలో ఆమె ఒకరు.

ఇవన్నీ ఆమె అసాధారణమైన కెరీర్‌కు నిదర్శనం. ఆమె ఒక ఐకాన్ గా, ఒక ఫ్యాషన్ రోల్ మోడల్ గా మారింది. ఆమె ర్యాంప్ వాక్, ఆమె పోజులు, ఆమె ఫ్యాషన్ సెన్స్… అన్నీ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచానికి ఒక కొత్త ట్రెండ్.అనోక్ యాయ్ ప్రయాణం కేవలం మోడలింగ్ తో ఆగిపోలేదు. ఆమె ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే ఆ బ్రాండ్ విలువే మారిపోతుంది.

వెర్సెస్, ఫెండీ, బర్బరీ, లూయీ విట్టన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండ్ల కోసం ఆమె ర్యాంప్ వాక్ చేసింది.అంతేకాదు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటుకుంది. లిల్ యాచి, ట్రావిస్ స్కాట్ వంటి అంతర్జాతీయ కళాకారుల మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించి మరింత పాపులర్ అయ్యింది.

ఆమె కేవలం ఒక ర్యాంప్ మోడల్ మాత్రమే కాదు, ఒక పూర్తిస్థాయి కళాకారిణి. ఆమె నటనా ప్రతిభ, ఆమె డాన్స్, ఆమె వ్యక్తీకరణ… అన్నీ ఆమె విజయానికి తోడ్పడ్డాయి. అనోక్ యాయ్ కేవలం ఒక అందమైన మోడల్ మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒకప్పుడు వలస వెళ్లి, జీవితం కోసం కష్టపడిన ఒక యువతి, తన ప్రత్యేకమైన అందంతో ప్రపంచాన్ని గెలుచుకుంది. 

ఆమె ప్రయాణం, ఒక మనిషి జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, తన కలలపై నమ్మకం ఉంటే సాధించగలరని నిరూపించింది. మోడలింగ్ ప్రపంచంలో ఒక మార్పును తీసుకువచ్చిన ఆమె, ఇప్పుడు కొత్త మోడళ్లకు ఒక రోల్ మోడల్. “అందాలంటే తెలుపు రంగులో ఉండే వాళ్లే” అనే అపోహను ఆమె పూర్తిగా తొలగించారు. అందానికి రంగుతో సంబంధం లేదని నిరూపించారు. నిజమైన అందం ఆత్మవిశ్వాసం, ఆశ, పోరాటంలో ఉంటుందని ఆమె మనందరికీ చూపించారు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!