విలక్షణ వాచకమే ఆయన ప్రత్యేకతా ?

Sharing is Caring...

An unforgettable Telugu actor……

చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలియదు..  కానీ సీఎస్సార్ అనగానే  కొంతమంది చప్పున గుర్తు పట్టేస్తారు. తనదైన వాచకం .. అభినయంతో ప్రేక్షకులను  అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రలతో  ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందు  శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు.

తర్వాత కాలంలో  ప్రతినాయకునిగాను .. ఇతర పాత్రల్లోనూ  హాస్యం పలికిస్తూ దూసుకు పోయారు. డైలాగులు చెప్పడం లో ఆయన స్టైల్ వేరే. విభిన్నమైన డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేది సీఎస్సార్ తోనే మొదలైందని చెప్పుకోవచ్చు . సీఎస్సార్  వాయిస్ కూడా భిన్నంగా ..  ఆయన డైలాగ్ చెప్పే విధానం మరింత డిఫరెంట్ గా ఉండేవి. అలాగే అరుపులు .. కేకలు  లేకుండా విలనిజాన్ని పండించడం కూడా సీయస్సార్ తోనే మొదలైంది.

రంగస్థలం నుంచి సినీరంగానికి వచ్చిన సీఎస్సార్ కొద్ది రోజుల్లోనే  వెండి తెరకు అనుగుణంగా తనను తాను మలుచుకొని, రెండు రంగాల్లోనూ సమాన ప్రతిభ చూపారు. ఆయన 1907 జూలై 11న నరసరావుపేటలో  పుట్టారు. పొన్నూరు, గుంటూరుల్లో  చదువుకున్నారు. మద్రాసులో స్థిర పడ్డారు.  చిన్నతనంలోనే నాటకాలు వేసిన అనుభవం ఆయనది.

నాటకరంగంలో  ఆడ పాత్రలు వేసే పురుషుడిగా ప్రతిష్ఠ సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు పక్కన కీలక పాత్రల్లో  సీఎస్సార్  నటించే వారు. వారి కాంబినేషన్ ను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చేవారట. నాటకాలలో సీఎస్సార్  డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే వారు..  సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగింది.  ఆయన డైలాగ్స్ లోని విరుపులు ప్రేక్షకులకు గమ్మత్తుగా అనిపించేవి.

నాటకాలలో రాణించినవారు సినిమాల దిశగా అడుగులు వేసినట్టుగానే  సీఎస్సార్  ప్రయాణం కూడా సినిమా వైపుకు సాగింది. ‘ద్రౌపది వస్త్రాపహరణం’ సినిమాలో కృష్ణుడి పాత్రను పోషించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ సినిమాలో కన్నాంబ ద్రౌపదిగా నటించారు.  అంతకుముందు స్టేజ్ పై కృష్ణుడి పాత్రను పోషించిన అనుభవం ఉండటంతో  టెన్షన్  ఫ్రీ గా చేశారు. ఆయనకు పద్యాలన్నీ కూడా కంఠతా వచ్చు. 

స్టేజ్ పై నటించడానికి .. సినిమాల్లో కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉందనే విషయం  సీఎస్సార్కి కొద్ది రోజుల్లోనే అర్ధమైంది. ఇక స్టేజ్ పైన మూమెంట్స్ మాదిరిగా  సినిమాలో స్వేచ్ఛ లేకపోవడం ఆయనకి నచ్చలేదు. పద్యం పాడుతున్నపుడు కట్ చెప్పడం .. మళ్ళీ మూడ్ తెచ్చుకుని పద్యం పాడటం విసుగు అనిపించేది. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోదామనుకున్నారు. 

అయితే తొందరపడొద్దని సన్నిహితులు చెప్పడంతో ఆగిపోయారు.మొత్తం మీద ఓర్పుతో  ‘ద్రౌపది వస్త్రాపహరణం’ సినిమా పూర్తి చేశారు. సీఎస్సార్ ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాగానే ఆడింది.  అయితే  వెంట వెంటనే అవకాశాలు రాలేదు.  పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది. హీరోగానే నటిస్తానంటే .. ఇండస్ట్రీలో నిలదోక్కుకోవడం కష్టమనే  విషయాన్ని సీఎస్సార్ గ్రహించారు.

అప్పటి నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా ..  విలన్ గా .. కామెడీ విలన్ పాత్రలు  పోషించారు. ఈ క్రమంలో కొన్నాళ్ళు పోయాక తనకి తిరుగులేదనిపించుకున్నారు. ‘హే రాజన్ .. శృంగార వీరన్’ అంటూ ‘జగదేక వీరుని కథ’లో మంత్రి పాత్రలో, ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా’ అంటూ ‘మాయా బజార్’లో శకుని పాత్రలో, ‘నమ్మిన చోట చేస్తే మోసం .. నమ్మని చోట చేస్తే లౌక్యం’ అంటూ తనదైన శైలి డైలాగులతో  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  నాటి రచయితలు కూడా ప్రత్యేక శ్రద్ధతో సీఎస్సార్ కి  డైలాగులు రాసేవారు.

‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులుగా ఆయన నట విన్యాసాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక ‘ఇల్లరికం’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు సీఎస్సార్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు తెరపై శకుని పాత్ర ఆయనలా చేసిన వారు లేరు. తర్వాత  కాలంలో ఆ పాత్ర ఎవరు వేసినా …మాయాబజార్ సినిమా  చూసి తమదైన సొంత శైలిలో  నటించేవారు.  అదీ ఆయన గొప్పతనం. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే … ఒకసారి వినేసి చెప్పడం సీఎస్సార్  ప్రత్యేకత. ఆయన గొంతుని అనుకరించడం అసలు కుదిరే వ్యవహారం కాదు. 

సాంఘిక చిత్రాల్లో  కుట్రలు .. కుతంత్రాలు చేసే విలన్ పాత్రల్లోనూ కూడా ఆయన రాణించారు.  ఇక తెరపై ఆయన ఎంత కఠినంగా కనిపిస్తారో .. బయట అంత సున్నితమైన మనసున్నవారని అంటారు. అవకాశాల కోసం వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నవారికి సాయం చేసేవారని చెబుతారు. అందరితో కలుపుగోలుగా ఉండటం ఆయన ప్రత్యేకత . టాకీలు మొదలైన తొలినాళ్లలో .. తెరపైకి వచ్చిన తొలితరం నటుల్లో సీఎస్ఆర్ ఒక ఆణిముత్యం. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!