సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ మహారాష్ట్ర అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. మెల్ఘాట్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ దగ్గర లోని హరిసాల్ గ్రామంలో తన క్వార్టర్స్‌లో దీపాలి సర్వీసు రివాల్వర్‌తో నిన్న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అటవీ మాఫియాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన దీపాలి ‘భర్త రాజేశ్ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో దీపాలి పేర్కొన్న నిందితులను అరెస్ట్ చేసేంత వరకు ఆమె మృతదేహానికి అంత్య క్రియలు జరిపేదిలేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.తన పై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు చిత్రహింసలకు గురిచేశాడంటూ దీపాలి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది.
కాగా ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. బెంగళూరు వెళ్లేందుకు రైలు కోసం ఎదురు చూస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు అతగాడిని అమరావతికి తరలించారు. శివకుమార్ తనను లైంగికంగా ఎలా వేధించాడో ? ఏ విధంగా టార్చర్ పెట్టాడో ?దీపాలి తన నోట్‌లో పూసగుచ్చినట్టు వివరించారని పోలీసులు చెబుతున్నారు.
శివకుమార్ అరాచకాలపై దీపాలి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అటవీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. వారి నిర్లక్ష్యం మూలంగా దీపాలి బలైపోయింది. శివకుమార్ పబ్లిక్‌గా, ప్రైవేటుగా తనను అసభ్య పదజాలంతో దూషించేవాడని, శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడని దీపాలి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న దీపాలిని శివకుమార్ బలవంతంగా పెట్రోలింగ్ కోసం తీసుకెళ్లాడు.ఆమె గర్భిణి అన్నవిషయం తెలిసీనప్పటికీ ఎన్నో కిలోమీటర్ల దూరం నడిపించాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది.ఈ చిత్రహింసలు భరించలేక దీపాలి ఆత్మహత్యకు పాల్పడింది.
దీపాలి ఆరోపణలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ నిందితులెవరినీ వదిలి పెట్ట బోమని … విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు. 2013 లో ఉద్యోగంలో చేరిన దీపాలి అంటే ఫారెస్ట్ మాఫియా కు టెర్రర్.ఎన్నో మార్లు ఆమె స్మగ్లర్లకు తన సత్తా ఏమిటో చూపారు.