కొవిడ్ పురిటిగడ్డ ‘వుహాన్’ లో మళ్ళీ లాక్ డౌన్ !

Sharing is Caring...

Again lock down ……………………………………

యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి… లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో (Wuhan) పుట్టిందని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ వుహాన్ లోనే కొవిడ్ ఉద్భవించిందని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. అక్కడే మళ్ళీ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో చైనా కలవర పడుతోంది.

వెంటనే అధికారులు వుహాన్ లోని  పలు జిల్లాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు.సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్ లోని హనీయాంగ్ జిల్లాలో ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు.

ఈ లాక్ డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయి.. పరిస్థితులను బట్టి తదుపరి కూడా కొనసాగవచ్చు . ప్రపంచంలోనే తొలిసారి లాక్ డౌన్ లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్ రికార్డుల్లో కెక్కింది. అటువంటి వుహాన్.. ఏప్రిల్ 2020 నాటికి వైరస్ నుంచి బయటపడింది. తాజాగా ఈ ప్రాంతంలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.

వుహాన్ లో 10 లక్షల జనాభా కలిగిన జియాంగ్ షియా జిల్లాలో ఇటీవల లాక్ డౌన్ విధించారు. షాషి ప్రావిన్సులోని డాటొంగ్ నగరంతో పాటు గువాంగ్ ఝువాలోనూ కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొద్దీ రోజులక్రితమే హన్యాంగ్ లోనూ లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇలా వుహాన్ తోపాటు చైనాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూనే దానితో కలిసి జీవించే విధానాన్ని ప్రపంచ దేశాలు అవలంబిస్తుండగా.. చైనా మాత్రం జీరో-కొవిడ్ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు విధిస్తోంది. కానీ పెద్దగా ఫలితాలు లేవు. చైనా కఠిన నిబంధనలపై స్వదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పటికీ అధ్యక్షుడు షి జిన్ పింగ్ మాత్రం తమ విధానాన్ని సమర్థించుకుంటూ వెళుతున్నారు. మొత్తం మీద చైనా ను మాత్రం కోవిడ్ వదలడం లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!