Dr.Yanamadala Murali Krishna ……………………….
రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని అత్యంత సూక్ష్మక్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడి శక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురైంది.
వైద్య ప్రపంచం వేగంగా కదిలి, గొప్పమేధస్సుతో ఉపశమన వైద్యాన్ని, జబ్బు నుండి రక్షణ కలిగించే టీకాలను త్వరలోనే తీసుకు రాగలిగింది. దీంతో విలయాన్ని కొంత మేరకు నివారించగలిగాము.2021 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో డెల్టా రూపంలో విరుచుకుపడ్డ కొరోనావైరస్ లక్షలాది ప్రాణాలను తీసి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కోలుకున్న కోట్లాది మంది బ్రతుకుని ఇబ్బందికరం చేసింది. 20 21 నవంబరు 24న దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ రూపంలో… ప్రకృతి అత్యంత శక్తిమంతమైన, దుష్ప్రభావాలు లేని సహజమైన వాక్సిన్ ని మానవాళికి అందించింది. తీవ్రమైన వేగంతో వ్యాపించి, ముందు ఉన్న రకరకాలైన తీవ్రమైన జబ్బును కలుగచేసే రూపాలను తొలగించి… ఒమిక్రాన్ ప్రపంచాన్ని ఆక్రమించింది.
ఒమిక్రాన్ సోకిన వారిలో సహజంగా చేకూరిన వ్యాధి నిరోధకశక్తి…అనేక టీకాల మూలంగా సంక్రమించే రోగ నిరోధక శక్తి కంటే చాలా చాలా శక్తిమంతమైనది. తాజా అధ్యయనాలలో దేశావ్యాప్తంగా, అన్ని వయసుల వారిలో దాదాపు 98 శాతం మందిలో… ఒమిక్రాన్ మూలంగా అయితేనేమీ, టీకాల వల్ల అయితేనేమీ వ్యాధి నిరోధక యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది.
దీంతో 2022 ఫిబ్రవరి 24 గురువారం నుండి కోవిడ్ కి సంబంధించిన అన్ని అంక్షలను ఎత్తి వేస్తున్నట్లుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ బారిన పడ్డ వారు ఐదు రోజులు విడిగా ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి ఉచిత కోవిడ్ పరీక్షలను కూడా నిలుపుదల చేస్తున్నారు.
డెల్టా వేరియంట్ కాలంలో హాస్పిటల్ కి వచ్చిన ప్రతి వెయ్యి మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులలో 13 మంది మృత్యువాత పడగా, ఇప్పుడు మరణాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. దీంతో ప్రపంచానికి, మీదు మిక్కిలి బ్రిటన్ ప్రజలకు కోవిడ్ నుండి ప్రమాదం లేదని ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. ఇక మీదట కోవిడ్ పీడ ఉండదు. ముందు వున్నట్లే స్వేచ్చగా జీవితాన్ని గడపవచ్చునని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా కోవిడ్ పీడ నుండి త్వరలోనే విముక్తి రావాలని కోరుకొందాం.