A trembling covid………………………………………………
చైనాను కరోనా వైరస్ (Corona virus) హడలెత్తిస్తోంది. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షలు కొంత మేరకు సడలించినప్పటికీ.. వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. కోవిడ్ బాధితులు మాత్రం ఆసుప్రతులకు వెళుతున్నారు.
ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ మరణాల(Covid Deaths)పై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. నగరాల్లోని శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడాన్ని బట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం జీరో కొవిడ్ (zero-Covid) పాలసీకి స్వస్తి పలికిన తర్వాత భారీ సంఖ్యలో కొవిడ్ పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. లోకల్ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అక్కడ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిన రోజుల్లో భారత్ సహా పలు దేశాల్లో కనిపించిన దృశ్యాలే ఇప్పుడుచైనా లో కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లూ జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో కేసులు బయటపడకుండా చూసుకున్న చైనా.. ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. కఠిన ఆంక్షలను సడలించింది. దీంతో 15 రోజులు తిరగకముందే ఆ దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం అక్కడ తన ప్రతాపం చూపిస్తోంది.
బీజింగ్ సహా పలు ప్రధాన నగరాల్లో కొవిడ్ కేసులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆస్పత్రుల వద్ద తమ వంతు కోసం పేషెంట్లు క్యూ కడుతున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో కనిపించాయి. కొందరైతే సెలైన్లతో కార్లలోనే వేచి చూస్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో క్లినిక్కుల వద్ద నిల్చుంటున్న చిత్రాలూ బయటకొచ్చాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, దౌత్య అధికారులు, జర్నలిస్టులు ఇలా ఎవర్నీ కొవిడ్ కేసులు వదిలిపెట్టడం లేదు.
ఒకప్పుడు జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన నిబంధనలు అమలు చేసిన చైనా ప్రభుత్వం.. ఇప్పుడు దాదాపు వాటన్నింటికీ స్వస్తి పలికింది. ఎవరైనా ఒకరు వైరస్ బారిన పడితే ఆ వ్యక్తి సన్నిహితులను సైతం క్వారంటైన్కు తరలించేవారు. ఇప్పుడు చాలా వరకు క్వారంటైన్ సెంటర్లను మూసివేశారు. టెస్టింగ్ సెంటర్లను సైతం అక్కడి ప్రభుత్వం కుదించింది.
డెల్టా వేరియంట్ తరహాలో ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అక్కడి ఎమిడమాలజిస్టులు చెబుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని స్థానిక అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
చైనాలో కొవిడ్ మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో గరిష్ఠ స్థాయికి(మూడింట ఒక వంతు జనాభా) కొవిడ్ కేసులు పెరుగుతాయని ఆ సంస్థ అంటోంది.
ఆ సమయానికి మరణాలు 3.22 లక్షలకు చేరుకోవచ్చని చెబుతోంది. వచ్చే ఏడాది చివరి నాటికి మరణాల సంఖ్య 10 లక్షలకు పెరిగే ప్రమాదముందని భావిస్తోంది.