ఎన్టీఆర్ కల నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ !

Sharing is Caring...

హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు.

ఈ డ్రీమ్ ప్రాజెక్టు గురించి అనుకున్నదే తడవుగా సాధ్యాసాధ్యాలపై ఇంజనీర్లతో చర్చించారు. వాళ్ళు పెట్టడం సాధ్యమే అన్నారు. వెంటనే ప్రముఖ శిల్పి SM గణపతి స్థపతి ని పిలిపించారు. ఆయన కూడా ఆలోచన బావుందన్నారు.అయితే ఎన్టీఆర్ అనుకున్నంత సులభంగా విగ్రహ ప్రతిష్ట జరగలేదు. ఆటంకాలు ఎదురైనాయి.

తాను పదవిలో ఉండగా విగ్రహ ప్రతిష్ట జరగాలని ఎన్టీఆర్ భావించారు. 1985 లో ఈ ప్రాజెక్టు పనులు మొదలైనాయి.1990 జనవరి నాటికి పూర్తి అయ్యాయి. నల్లగొండ సమీపంలోని రాయగిరి ప్రాంతంలో మేలైన తెల్ల గ్రానైట్ దొరుకుతుందని తెలుసుకుని గణపతి స్థపతి వెళ్లి పరిశీలించారు. పెద్ద గ్రానైట్ బండ లభ్యమైంది.దాన్ని ఏక శిల బుద్ధ విగ్రహంగా మలిచారు.

58 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని రూపొందించడానికి దాదాపు 200 మంది శిల్పులు పనిచేశారు. విగ్రహం బరువు 350 టన్నులు. విగ్రహం తయారీకి సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టింది. అదలా ఉంటే ఎన్టీ రామారావు 1989 లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. తెలుగు దేశం పార్టీ 74 సీట్లకే పరిమితమైంది.

డా. మర్రి చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన సీఎం గా ఉన్న సమయంలోనే  1990 మార్చిలో బుద్ధ విగ్రహాన్ని హుసేన్ సాగర్ మధ్యలో నిర్మించిన ‘జిబ్రాల్టర్ రాక్’ పై ప్రతిష్టించే ప్రయత్నాలు జరిగాయి. 192 చక్రాలు గల వాహనంపై విగ్రహాన్ని పడుకోబెట్టి ట్యాంక్ బండ్ వద్దకు తీసుకొచ్చారు.ఈ వాహనం హైదరాబాద్ లోకి రావడానికి రోడ్లు వెడల్పు చేయాల్సి వచ్చింది.అందుకు చెన్నారెడ్డి ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. 

ఇంత కష్టపడి జిబ్రాల్టర్ రాక్’ పైకి తరలిస్తుండగా విగ్రహం జారి నీటిలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. అపుడు పడిపోయిన విగ్రహం అలాగే కొన్నాళ్ళు ఉండి పోయింది. కాంగ్రెస్ సర్కార్ కొన్నాళ్లు విగ్రహం విషయంలో తర్జన భర్జన పడింది. తర్వాత స్వల్ప కాలానికే చెన్నారెడ్డి పదవి నుంచి దిగిపోయారు.

ఆయన తర్వాత వచ్చిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి కూడా సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. 92 అక్టోబర్ లో కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎం అయ్యారు. కోట్ల కూడా ప్రత్యక శ్రద్ధ తో విగ్రహాన్నివెలికి తీయించారు. అలా డిసెంబర్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటినుంచి హుసేన్ సాగర్ కి కొత్త కళ వచ్చింది. పర్యాటక ప్రదేశం గా గుర్తింపు పొందింది.

1994 లో మళ్ళీ సీఎం అయ్యాక ఎన్టీఆర్ ఒక రాత్రి వేళ సతీ సమేతంగా వచ్చి విగ్రహాన్ని చూసి ఆనందపడ్డారట. విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు 3 కోట్లు వ్యయం అయిందని అంటారు. కాంగ్రెస్ నేతలు పూనుకోకపోతే విగ్రహం అలాగే నీటిలో ఉండిపోయేదేమో ? మొత్తానికి ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అలా పార్టీ అయింది. 

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!