చైనా ‘పవర్’ తగ్గుతోందా ?

Sharing is Caring...

crises……………………………………………………….

క‌రోనా వైర‌స్ దెబ్బతో  చైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క కరోనాయే  కాకుండా వివిధ రంగాల్లో వేలకోట్ల తో  పలు మేజర్ ప్రాజెక్టులు చేపట్టడం, వ్యాపారాలు స్థంభించి ..ఆదాయం తగ్గడం .. ఖర్చులు పెరగడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.  

వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధించడం మూలంగా ఆర్ధిక కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో దెబ్బ తిన్నాయి. గత రెండేళ్లుగా అభివృద్ధి మందగించింది. మళ్ళీ ఆర్ధిక వ్యవస్థను గాడిలో  పెట్టడానికి నేతలు కింద మీద పడుతున్నారు.  ఏడాదిగా రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పలు కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. ఆయా కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలుతున్నాయి.

ఈ క్రమంలోనే కొద్దీ రోజుల క్రితం దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ హాంకాంగ్‌ లిస్టెడ్‌ షేర్ల విలువ దాదాపు 15శాతం కుంగింది. దీంతో ఈ కంపెనీ కో ఛైర్మన్‌  యాంగ్ హుయాన్ సంపద  2 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది.గత ఏడాది హుయాన్‌ నికర సంపద విలువ 23.7 బిలియన్‌ డాలర్లు కాగా  ఆ మొత్తం 11.3 బిలియన్‌ డాలర్లకు తగ్గిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ చెబుతోంది. ఏడాది వ్యవధిలోనే హుయాన్‌ సంపద 52 శాతానికి పైగా ఆవిరైపోయింది. 

చైనా స్థిరాస్తి రంగంలో అప్పులు పెరగడంతో అడ్డగోలుగా రుణాలు సమీకరించకుండా ఉండేందుకు 2020లో చైనా కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని నియంత్రణ సంస్థలు కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతో  రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వద్ద నగదు ప్రవాహం తగ్గింది. ఫలితంగా ఎవర్‌ గ్రాండే , సునక్‌ వంటి దిగ్గజ సంస్థలు దివాలా అంచుకు చేరాయి. 

చేతిలో సొమ్ములేక  ఈ ప్రాజెక్టులు నిర్మాణాలు నిలిపివేశాయి. దీంతో ఈ సెగ మధ్యతరగతి వర్గాన్ని తాకింది. వారు ఇళ్ల కొనుగోళ్లకు చెల్లింపులు చేసినప్పటికీ.. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో అక్కడి ప్రజలు రుణ చెల్లింపులను నిలిపివేశారు.  

చైనాలోని  అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం  ఎవర్‌గ్రాండే  ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్‌ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ సంస్థ 280 నగరాల్లో దాదాపు 1300 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపట్టింది. చైనా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో 20 శాతం వాటా దీనిదే. 15లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎవర్‌గ్రాండే సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది. 

2008లో 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.  చైనా జంక్‌ బాండ్స్‌ ఈల్డ్‌ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగించింది..ఇక ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అధ్యక్షులు జిన్‌పింగ్ పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు  వినిపిస్తున్నాయి.

నిపుణుల అంచనా ప్రకారం.. చైనా జీడీపీలో 29శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచే లభిస్తోంది. కొన్నాళ్ల నుంచి చైనాలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్ మందగించడం ఎవర్‌గ్రాండేపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ రంగం  కుప్పకూలితే ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం మొదలవుతుంది.

అదే జరిగితే చైనాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయి.  చైనాకు ఆర్థిక కష్టాలు వస్తే యురోపియన్‌ దేశాల విలాసవంతమైన వస్తువుల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ రంగాలకు  50 శాతం ఆదాయం చైనా నుంచి వెళుతోంది. 

చైనా దగ్గర దాదాపు 1.1 ట్రిలియన్‌ డాలర్ల అమెరికా బాండ్లు ఉన్నాయి. రుణాల చెల్లింపుల కోసం వీటి విక్ర యించవచ్చు. లేదా యువాన్‌ విలువ తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ ఇరు దేశాల సంబంధాలను  దెబ్బ తీయవచ్చు. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

అంటే చైనాలో వచ్చే చిన్న ఆర్థిక సంక్షోభాలు కూడా ఈ దేశాల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటున్నారు నిపుణులు. చైనా ఆర్థిక భవిష్యత్తుపై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆందోళన మొదలైంది.  రాజకీయ భవిష్యత్తుఫై ఈ ప్రభావం పడవచ్చు అంటున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!