మరణం వెనుక చిల్లర ప్రచారాలా ?

Sharing is Caring...

ఎస్పీ బాలు మరణం ఆయన అభిమానులకు నిజంగా షాకే. అందులో సందేహమే లేదు. సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే వారు బాలును ఎంతగా అభిమానిస్తున్నారో ఇట్టే అర్థమౌతోంది. బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వెళ్లలేదని … మీడియా ముఖంగా నివాళులు అర్పించి చేతులు దులుపుకున్నారని పెద్ద ఎత్తున అభిమానులు విమర్శిస్తున్నారు. అందరూ బాలును అవసరానికి వాడుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.
నిజం చెప్పుకోవాలంటే బాలుకి సినిమా వాళ్లకు ఉన్నది వ్యాపార బంధమే. అంతకు మించి ఏముంటుంది ?ఒక వేళ అంతకు మించి బంధం ,అభిమానం ఉన్నప్పటికీ వారు వెళ్లలేని పరిస్థితులు వారికి ఉంటాయి . వాళ్లంతా అవసరమైన సందర్భంలో బాలుచేత పాటలు పాడించుకున్నారు .. డబ్బులు ఇచ్చారు. గౌరవించారు.
బాలు పాడిన పాటల్లో కొన్ని హిట్, మరికొన్ని ఫట్ అయ్యాయి . మళ్ళీ అవకాశాలు ఇచ్చినవారు ఇచ్చారు . లేని వారు లేదు. అంతే.గతంలో ఏదైనా వేడుకలు జరిగితే బాలును పిలిచారు. అలాగే బాలు కూడా వారిని పిలిచివుండవచ్చు . ఇష్టమైన వారు , కుదిరిన వారు వెళ్లిఉండవచ్చు. లేకుంటే లేదు. అది వెనకటి పరిస్థితి. దాని గురించి చర్చ అనవసరం.
ఇక ఇపుడు పరిస్థితి వేరే. తండ్రి /తల్లి /భార్య/భర్త / చనిపోతే భయపడిపోయి భౌతిక కాయాన్ని ఇంటికి కూడా తీసుకురాకుండా … హాస్పిటల్ నుంచే శ్మశానానికి తరలిస్తున్న రోజులివి. బంధువులకు తెలిసినప్పటికీ కనీసం పరామర్శకు కూడా రాని/వెళ్లలేని దరిద్రపు పరిస్థితిలో ఉన్నాం. పరామర్శలు ,పలకరింపులు అన్ని వీడియో కాల్స్ లోనే ముగించేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం అంత్యక్రియలకు వెళ్లనంత మాత్రాన అభిమానం లేదు అనుకోవాలా ? ముందే చెప్పుకున్నట్టు వ్యాపారాలకు అతీతంగా అభిమానం ఉంటే వాళ్ళు కూడా వెళ్లేవారేమో. అభిమానం ఉన్నవారు కూడా వెళ్ళలేదు . అలా ఉన్న కొందరు ధైర్యం చేసి వెళ్లారు. కరోనా నేపథ్యంలో వెళితే ఏమౌతోంది అనే విషయం అందరూ ఆలోచిస్తారుగా.
ఈ చిన్న పాయింట్ ను ఎక్కడో మిస్ అవుతున్నాం. దానికి తోడు జన సందోహంలోకి సెలబ్రిటీలు వెళితే సెక్యూరిటీ సమస్యకూడా ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే అదికూడా నిజమే. వీళ్ళు వెళ్ళినప్పటినుంచి ఫోకస్ అంతా వీళ్ళ మీదనే ఉంటుంది. అది కూడా ఇబ్బందికరమే.ఇవన్నీ అందరికి తెలిసినవే. అందుకే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు.
కరోనా సమయం లో వెళితే వెళ్లారని అంటారు . వెళ్లకపోతే వెళ్లలేదని విమర్శిస్తారు. అభిమానులు తెలిసో తెలియకో ఏవేవో పోస్టులు పెట్టి వారి బాధను వ్యక్తపరుస్తున్నసమయంలోనే కొందరు సందట్లో సడేమియా అన్నట్టు సోషల్ మీడియాలో బాలు మరణం వెనుక ఎన్నో చిల్లర ప్రచారాలు చేశారు .
ప్రోగ్రాం షూటింగ్ కోసం రామోజీ రావు పిలిస్తే …. బాలు ఆలోచించకుండా వెళ్లి కరోనా అంటించుకుని ప్రాణాలపైకి తెచ్చుకున్నారని విమర్శించిన వారుకూడా ఉన్నారు .జనంలోకి వెళితే కరోనా ముప్పు ఉందని … మాస్ గేదరింగ్ తగదని తెలిసి కూడా సెలెబ్రిటీలు బాలు భౌతిక కాయం చూడటానికి వెళ్లలేదని కూడా అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాం అనిపించడం లేదా ?
ఇక బాలుని పిలిచి రామోజీ పాపం మూట కట్టుకున్నారని ఒక మెసేజ్ వాట్సాప్ లో వైరల్ అయింది. రామోజీ వ్యాపారవేత్త కాబట్టి ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతి ఇచ్చాక బాలు ని రమ్మని ఉండొచ్చు. బాలు తన వయసును బట్టి ఆలోచించి కొన్నాళ్ళు షూటింగ్ ను వాయిదా వేయమని అడిగివుంటే బాగుండేది. రామోజీ కూడా తగు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ప్రోగ్రాం లో పాల్గొనే వారందరికీ టెస్టులు చేయించుకు రమ్మని చెప్పి ఉండాల్సింది. నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఉండాల్సింది. ఆ ప్రోగ్రాం లో పాల్గొన్న ఒకరిద్దరికి కరోనా ఉందని వారి ద్వారానే బాలుకి సోకిందనే కథనాలు కూడా వైరల్ అయ్యాయి. వాళ్లంతా ఆ కథనాన్ని ఖండించారు కూడా. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇదంతా రామోజీ కి కూడా లెసన్ లాంటిదే. అలాగే ఇతర సెలెబ్రెటీలకు కూడా.
ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. రామోజీ ప్రోగ్రాం ముందో తర్వాత బాలు తమిళనాడులో ఒక ప్రోగ్రాం లో పాల్గొన్న వీడియో కూడా వైరల్ అయింది . అందులో రకరకాల వస్తువులను ముట్టుకుని బాలు ముక్కుకు రాసుకోవడం చూపారు. ఈ వీడియో ను బట్టి బాలుకి ఎక్కడ కరోనా సోకిందో నిర్ధారించలేము. నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి.
బాలు మరణాన్ని రామోజీ ఖాతాలో వేయాలని ఒక వర్గం … బాలు కుటుంబం హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని … వెంకయ్య నాయుడు కుమార్తె బిల్లు కట్టిందని మరోవర్గం…ప్రచారాలు చేశాయి. ఆ ప్రచారాన్ని వెంకయ్య కుమార్తె ఖండించారు అనుకోండి. చివరికి బాలు ఏ కులమో , ఏ శాఖో కూడా కనుక్కొని లేనిపోని పుకార్లు పుట్టించి వాట్సప్ లో పంపి అనవసర ప్రచారాలు చేశారు. దీని వలన వాళ్ళ చిల్లర బుద్ధులు బయట పడ్డాయి తప్ప ఒరిగిందేమి లేదు.
సామాన్య స్థితి నుంచి గొప్ప స్థితికి ఎదిగిన బాలు వంటి వ్యక్తిని కులాలకు, మతాలకు అతీతంగా చూడలేకపోవడం ఏ మాత్రం హర్షణీయం కాదు.
——–KNMURTHY
Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY September 29, 2020
error: Content is protected !!