సువేరా…………………………………………..
నీకు శాశ్వతమైనది మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది.!ఈ భూమి నాది అన్నవాడిని చూసి భూదేవి ఫక్కున నవ్వుతుంది.ఈ సింహాసనం, ఈ అధికారం, ఈ సంపదలు, ఈ పదవులు, ఈ అందం/దేహసౌందర్యం, ఈ మమకారం శాశ్వతంగా నాకే సొంతం అన్నవాడిని చూసి శ్మశానం నవ్వుతుంది.
అధికారగర్వంతో అహంకారంతో, ధనమదంతో, కండకావరంతో విర్రవీగేవాడిని చూసి పంచభూతాలు నవ్వుకుంటాయి.జ్ఞానంతో బ్రతికేవాడి కాళ్ళు భూమిమీద ఆనతాయి, సత్యంతో ఆనందంగా జీవిస్తూ సుఖంగా కన్నుమూస్తాడు.
అజ్ఞానాంధకారంతో బ్రతికేవాడు ఇవి అన్నీ శాశ్వతం అనుకుంటూ, నావే అనుకుంటూ ఊహల్లో గాల్లోకి విహరిస్తూ అసత్యం కౌగిలిలో చిక్కుకుని దుఖఃతో జీవిస్తూ బాధతో మరణిస్తాడు.అనాదిగా గోల్కొండకోట, చార్మినార్, మూసీనది, ఉస్మానియా ఆసుపత్రి, పంజాగుట్ట శ్మశాన వాటిక , మహాప్రస్థానం లాంటి నగరంలోని శ్మశాన వాటికలు మహామహులు ఉద్దండులు లాంటి ఎందరెందరో బ్రతికున్నప్పుడు మిడిసి పడినవాళ్ళ జీవితచరిత్రలను కథలను, గాధలను వింటూ ఫక్కున నవ్వుకుంటాయి.!
రాజూ – పేద, తాజా – మాజీ, ముప్పూటలా కడుపునిండివాడు – పూట గడవక పస్తులున్నవాడు, చలువరాతి సౌధాల్లో సేదతీరినవాడు – పూరిగుడిసెలో ప్రాణం విడిచినవాడు, రాజలాంఛనాలతో మందిమాగధులతో ఊరేగినవాడు – అనాధగా కన్నుమూసినవాడు, ప్రజలకు జ్ఞానబోధ చేసినవాడు – ప్రజలను వంచనతో మోసగిస్తూ బ్రతికినవాడు, ఆడంబరాలతో అతిశయోక్తులతో బ్రతికినవాడు – నిరాడంబరంగా నిజాయితీగా బ్రతికినవాడు” అంతిమంగా చేరేది అక్కడికే….ఒక్కచోటుకే.!
కనురెప్పపాటు ఈ జీవితాన్ని, ఈ జీవితనాటకాన్ని, ఈ మాయను ఎరిగి బ్రతకడమే మోక్షం.!