జైళ్ల‌లో కుల వివ‌క్ష .. దోపిడీ!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………………… 

జైళ్ల‌లో కుల వివ‌క్ష దోపిడీ దారుణంగా న‌డుస్తాయి అంటే నిజ‌మా అన్నారు ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య‌.
అప్ప‌ట్నించీ రాయాల‌నుకుంటున్నా … 1991 లో నేనూ కృపాసాగ‌ర్ అరెస్ట్ అయ్యాం … రాజ‌మండ్రి వెళ్లాం. జైల్లోకి ప్ర‌వేశించిన ఫ‌స్ట్ డే … ఈవెనింగ్ సాగ‌ర్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అన్నా … సిగ‌రెట్ కానీ బీడీ కానీ కాల్చాలి … త‌ప్ప‌దు అన్నాడు.

బాబూ … మ‌న ద‌గ్గ‌ర ఇంధ‌నం లేదు కదా … చూద్దాం రేపెల్లుండుల్లో టూ బీకి మారుస్తారు … అక్క‌డ సిగ‌రెట్లు దొరుకును. లేదా ఈ లోప‌ల మ‌న‌కి ఇంట‌ర్యూలు వ‌స్తాయి క‌దా డ‌బ్బులు ప‌డ‌తాయి కాబ‌ట్టి ఓ రెండు రోజులు ఓపిక ప‌ట్టు అన్నా. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమనగా … జైలు వాళ్లు నాకు గౌరవం ఇచ్చారు … సాగర్ ని నా కాడర్ గా చూశారు. అంటే నేను బ్రాహ్మడ్ని అని వాళ్లకి అర్ధమైంది .. అతను మాల అని కూడా అర్ధమైంది.

వాస్తవానికి అప్పట్లో అతను క్రియాశీలక కార్యకర్త … నేను ఆపద్దర్మ ముఖ్యమంత్రి లాంటివాడ్ని. అతనే కీలకం … అయినా సరే … కులం రీత్యా … నాకే నాయకత్వస్థానం ఇచ్చి ప్రతిదీ నాతోనే మాట్లాడారు జైలర్లు. అలా పేరు చూసి మనిషిని చూసీ … కులాన్ని అంచనా కట్టి దాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన కళ్లకి పుట్టుక రీత్యా అబ్బిన గ్యానం అన్నమాట … అది పక్కన పెడితే … క్వారంటీన్ ఫ‌స్ట్ బ్లాక్ అప్ స్టెయిర్స్ లో ఉన్నాం మేం …

తర్వాత అదే రోజు సాయంత్రం సాగర్ నా దగ్గరకు వచ్చి … అన్నా ఓ టెంప‌ర‌రీ ఏర్పాటు దొరికింది ..నీతో మాట్లాడ‌దామ‌ని వ‌చ్చా అన్నాడు. ఏంట‌ది అని అడిగా క్యూరియాసిటీ కొద్దీ ..కింద ఆర్డ‌ర్ లీ చెప్పాడు … సిగ‌రెట్లు బీడీలు వ‌డ్డీకి ఇస్తారంట ఓ క‌ట్ట తీసుకుంటే … మ‌న డ‌బ్బులు వ‌చ్చిన‌ప్పుడు రెండు క‌ట్ట‌లు ఇవ్వాలంట … ఏదైనా స‌రే … తీసుకున్న‌దానికి రెట్టింపు ఇవ్వాలంట … అన్నాడు.

అయితే ఏమంటావ్ ? అన్నా నేను కొంచెం విసుగ్గానే. సాగ‌ర్ హ‌ర్ట్ అయ్యాడు … అన్నా నువ్వు సిగరెట్లు తాగ‌వు క‌నుక నీకు అర్ధం కావ‌డం లేదు … ఒక్క క‌ట్ట బీడీలు తెచ్చుకుంటా నువ్వు ప‌ర్మిష‌న్ ఇస్తే అన్నాడు. స‌రే కానీ … నేను కూడా వ‌స్తా ప‌ద అన్నా … క్వారంటీన్ లో రెండు డ‌బుల్ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉంటాయి … లోప‌ల‌కి మామూలు బ్యార‌క్ లు ఉంటాయి… ఆ రెండో డ‌బుల్ స్టోరిడ్ బిల్డింగులో చివ‌ర‌కి తీసుకువెళ్లాడు ఆర్డ‌ర్ లీ.

అరేయ్ క‌నిక‌య్యా … ఈల్ల‌కి సిగ‌రెట్లో బీడీలో కావాలంట అని అరిచాడు. స‌ద‌రు క‌నిక‌య్యా అనే శాల్తీ ఎవురో కుర్రాడేమో అనుకున్నా నేను … కాదు … ఓ బ‌క్క‌ప‌ల్చ‌టి అర‌వై ఏళ్ల శాల్టీ వ‌చ్చింది. కొత్త‌గా వ‌చ్చారా అన్నాడు వ‌స్తూనే .. అవును అన్నాన్నేను. ఏ ఊరో అన్నాడు … బెజ‌వాడ అన్నా…  బీడీలు కావాలా సిగ‌రెట్లా అన్నాడు … అదో క‌ట్ట ఇదో క‌ట్ట ఇవ్వు అన్నాన్నేను. ఓ పెన్ను కాగితం తెచ్చి మీ ఆర్ పీ నంబ‌ర్లు … వేసి ఇవ్వండి అన్నాడు … స‌రే వేసి ఇచ్చా …

మీకు రేపే ఇంట‌ర్యూ రావ‌చ్చు … మీ బంధువులు డ‌బ్బులు వేయ‌వ‌చ్చు. అయినా స‌రే రెండు బీడీ క‌ట్ట‌లు ఇవ్వాల రెండు సిగ‌రెట్ ప్యాకెట్లు ఇవ్వాల … అన్నాడు క్లియ‌ర్ గా … స‌ర్లే అలాగే ఇస్తాం ఇది దారుణ‌మైన వ‌డ్డీ క‌ద‌య్యా అన్నా.  మీకు కొత్త‌గా చెప్ప‌డం లేదు … ఇక్క‌డ న‌డుస్తోందే చెప్తున్నా … ఇక్క‌డ ఎంత మందికి ఇచ్చుకోవాల మేం … అన్నాడు.

స‌ర్లే కానీ ఇవేనా? ఇంకేవైనా ఇస్తావా? అని అడిగా … ఇవే న‌డుస్తాయి … అంటూ కేసేంటీ దొమ్మీనా అడిగాడు. కాద‌య్యా మేం రాడిక‌ల్స్ మి … మొన్న న‌ల‌భై ఎనిమిది గంట‌ల బంద్ పిలుపు సంద‌ర్భంగా జ‌రిగిన బ‌స్సు ద‌హ‌నాల్లో భాగంగా అరెస్ట్అయి ఇక్క‌డ‌కి వ‌చ్చాం అన్నా ..

అంతే … ఒరేయ్ నాగేశ్వ‌ర్రావ్ చెప్ప‌వేరా? ఈళ్లు అన్న‌లంట‌గా … అని … నా వేపు తిరిగి అన్నా … సారీ … ఏమ‌నుకోకు … ఈ రోజో రేపో మిమ్మ‌ల్ని లోప‌లికి మారుస్తారు … అప్పుడు ముర‌ళ‌ల‌న్న‌ను అడిగాన‌ని చెప్పు … ఈ రెండూ మీరు వాడుకోండి … వీలైతే ఇవ్వండి … లేక‌పోయినా ప‌ర్లేదు అన్నాడు.

అమ్మ‌య్య అనుకున్నా.  ఓ బీడీ క‌ట్టా సిగ‌రెట్ ప్యాకెట్టూ జేబులో పెట్టుకుని మా వాడు క‌ళ‌క‌ళ‌లాడ‌డం మొద‌లుపెట్టాడు.
నెమ్మ‌దిగా ఫ‌స్ట్ బిల్డింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి పైకి వెళ్లి వాట‌ర్ ట్యాంక్ ఎక్కి దూరంగా క‌నిపించే రోడ్డు చూస్తూండ‌గా వార్డ‌ర్ పైకి వ‌చ్చి బాబూ లాక‌ప్ అని అరిచాడు … రూమ్ లోకి ప్ర‌వేశించాం ..

త‌నో గ‌ది నేనో గ‌ది … ఇక్క‌డ ఓ విష‌యం చెప్పాలి … జైల్లో ఇద్ద‌ర్ని ఓ గ‌దిలో వేయ‌రు. ఒక్క‌డ్ని వేస్తారు లేక‌పోతే ముగ్గురిని వేస్తారు … అంచేత మేమిద్ద‌రం చెలో లాక‌ప్పులో ఉన్నామ‌న్న‌మాట … నులక‌తాడుతో అల్లిన ప‌ట్టాలు ఓ దుప్ప‌టీ ఇస్తారు … వాటిని కిందేసుకుని ప‌డుకోడ‌మే … తెల్లారి పావుత‌క్కువ ఆరింటికి లాక‌ప్ తీశారు. ఇద్ద‌రం కింద‌కి వ‌చ్చాం… కాల‌కృత్యాలు తీర్చుకునే ప‌ని మీద‌…
స్నానాల తొట్టె ద‌గ్గ‌ర ఉండ‌గా … నిన్న సాయంత్రం అప్పిచ్చిన వ‌డ్డీ వ్యాపారి క‌ల్సాడు. అన్నా లోప‌ల‌కి క‌బురు పోయింది … ఫైల్ల్లో అడుగుతారు .. మిమ్మ‌ల్ని కూడా అడుగుతారు … సాయంత్రం లాక‌ప్ త‌ర్వాత లోప‌లికి పంపుతారు మిమ్మ‌ల్ని అన్నాడు. నీకెలా తెల్సు అన్నాన్నేను ఆశ్చ‌ర్యంగా … న‌వ్వాడు … త‌ప్ప స‌మాధానం చెప్ప‌లేదు …
స‌ర్లేగానీ నీదే కేసు అన్నా..  307లే అన్నాడు … అంటే అటెంప్ట్ టూ మ‌ర్డ‌ర్ అన్న‌మాట …
ఎవ‌ర్ని అని అడిగా … మా బంధువే … చిన్న స‌రిహ‌ద్దు త‌గాదా … పార‌తో కొట్టా … చావాల్సినోడే బ‌తికాడు … లేక‌పోతే లైఫ‌ర్ అయ్యేవాణ్ణి వివ‌రించాడు. రాజీ ప‌డిపోతే పోయేదిగా అన్నా …
అయ్యేవాళ్ల‌మే … మా ఆడాళ్లు ప‌డ‌నిచ్చారు కాదు … అదంతా ఎందుకులే … మూడో ఏడు … అయిపోయింద‌న్నా …
అన్నా అన‌కు యాపారం బాగానే చేస్తున్న‌ట్టున్నావ్ గా అన్నా …
నా యాపారం కాద‌న్నా అది … అవ‌త‌ల బ్యారెక్కుల్లో ఉండాడులే … రామిరెడ్డి అని … అన‌ప‌ర్తోడు … లైఫ‌రు ..
ఆడిది యాపారం … నేను ఆడి ద‌గ్గ‌ర గుమ‌స్తా అంతే … అయినా మాల‌నాకొడుకుని నేను వ‌డ్డీ యాపారం చేయ‌డం ఏంటి అన్నాడు…

జైల్లో కి ఓ వ్య‌క్తి ఎంట‌ర్ అవ‌గానే వాడి కులం తెల్సిపోతుంది. కులాన్ని బ‌ట్టే వాడ్ని ఎక్క‌డ వేయాలో నిర్ణ‌యం తీసుకుంటారు. జైల్లో కనుక కుల గణణ తీస్తే … అధిక శాతం దళితులే ఉంటారు. అగ్రకులాల వారు తక్కువమోతాదులోనే ఉంటారు.దట్టూ వారు పెద్ద పెద్ద నేరాలు చేసిన వారై ఉంటారు. మర్డర్లు … ఆర్ధిక నేరాల వాళ్లల్లోనే అధికంగా అగ్రకులాల వారు ఉంటారు. ఇక పెటీ కేసుల్లో అరెస్ట్ అయ్యే వాళ్లల్లో అధికులు దళితులు. బీసీలు. మైనార్టీలు.

ఇలా జైళ్లకు వచ్చే వచ్చే దళితులు చాలా వరకూ అగ్రకుల ఖైదీల దగ్గర పాలేరు పని చేస్తూ గడిపేస్తారు. జైళ్లలో పాలేరు పనేంటి అని ఆశ్చర్యపోకండి … బీడీలకు సిగరెట్లకూ డబ్బులు లేనోళ్లు ఇట్టా పాలేరు పనికి చేరతారు. అంటే తమకు బీడీ కట్టలు కూలీగా ఇచ్చేవారికి అన్నం పడతారు. అంటే … అన్నం బల్ల వస్తుంది కదా … అప్పుడు వీల్ల ప్లేటు కూడా తీసుకెళ్లి అన్నం పప్పు అవీ పట్టి తీసుకొచ్చి వీల్లకి వాళ్లగదుల దగ్గర అందచేస్తారు. తిన్నాక ప్లేట్లు కడుగుతారు.

అంతే కాకుండా వాళ్ల రూమ్ లు శుభ్రంగా ఊడుస్తారు. కడుగుతారు. దుప్పట్లు బట్టలు ఉతుకుతారు. వీళ్లు ఈ పన్లన్నీ చేస్తూనే జైలు అధికారులు చెప్పే పన్లూ చేస్తూంటారు. జైలంతా ఊడ్వడం … టాయిలెట్లలో ఫినాయిలు వేయడం వాటిని కడగడం ఇలా అనేక పన్లు వీళ్లే చేస్తారు. కర్మ దారుణంగా కాలిపోయి అగ్రకులాల్లో పుట్టీ దిక్కులేని పరిస్థితుల్లో డబ్బుల్లేక జైల్లో గడుపుతూ … సిగరెట్లు బీడీలు అవసరమైన బ్యాచ్ కూడా ఒకటుంటుంది.

వాల్లకి కాస్త గౌరవ ప్రదమైన పన్లు చెప్తారు… అలా నడుస్తుందన్నమాట … రాజమండ్రి రైతుకూలీ సంఘం సభలప్పుడు అరెస్ట్ అయినప్పుడు మొదటిసారి రాజమండ్రి చూశాను. ఆ తర్వాత మళ్లీ వెళ్లింది క్రుపాసాగర్ తోనే … తను తర్వాత రెండువేల తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు.. కానీ తరచూ గ్యాపకానికి వస్తూంటాడు. నన్ను అనేక విధాల ఆదుకున్న వాళ్లల్లో సాగర్ ఒకడు ..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!