మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Sharing is Caring...

Jaggaiah’s performance is amazing………………..

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.

అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కొచ్చిన దశలో రామచంద్రరావు కన్నుమూశారు. అక్కడనుంచి కేఎస్ఆర్ దాస్ సినిమాను పూర్తి చేశారు.

ఈ రామచంద్రరావు 1968 ..లో అసాధ్యుడు అనే సినిమాని డైరెక్ట్ చేశారు. కృష్ణ  హీరో.. అందులో సీతారామరాజు నాటకం పెట్టారు. దాన్ని శ్రీశ్రీ రాసారు. అప్పటినుంచే ఆ పాత్రపై కృష్ణ మనసు పడ్డారు.

ఇక అసలు విషయానికొస్తే  ఈ సినిమాలో రూథర్ ఫర్డ్ పాత్ర గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. కలెక్టరు రూథర్‌ఫర్డ్‌ని కొంత సౌమ్యుడిగా చూపారు.రూథర్ ఫర్డ్ కి అన్ని వ్యవహారాలపై అవగాహన వున్నట్టు, సీతారామరాజంటే గౌరవం కూడా వున్నట్టు డైలాగ్స్ ద్వారా చెప్పించారు.

అలాగే ఆ ఇద్దరు కలసినప్పుడు రామరాజును రూథర్ ఫర్డ్ మెచ్చుకున్నట్టు  చూపించారు. అయినా ప్రభుత్వం మాట వినని  రామరాజును చంపించినట్టు సినిమాలో చూపించారు.అసలు “రూదర్ ఫర్డ్” ఎలాఉంటాడో చాలా మందికి తెలీదు.

సీతారామరాజు చిత్రంలో ఆపాత్రకు నటుడు జగ్గయ్య ప్రాణ ప్రతిష్ట చేశారు. తన కంచుకంఠం తో  డైలాగులు చెబుతుంటే జనం సినిమాలో మమేకమైనారు. జగ్గయ్య వేషదారణ కోసం మేకప్‌ మ్యాన్‌ మాధవరావు చాలా కృషి చేశారు. నీలిరంగు కాంటాక్ట్‌ లెన్సులను అమర్చి బ్రిటిషు అధికారి రూపాన్ని తీర్చిదిద్దారు.జగ్గయ్య రూథర్ ఫర్డ్ ను మన కళ్ళముందు ఉంచారు. క్లైమాక్స్ లోని  రామరాజు … రూథర్ ఫర్డ్ సంవాద దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి.

ఇక వాస్తవానికొస్తే రూథర్ ఫర్డ్ ఉద్యమాల కు వ్యతిరేకి అని అంటారు.పల్నాడులో  పుల్లరి వ్యతిరేక ఉద్యమాన్నికఠినంగా తొక్కేసాడు. దానికి నాయకత్వం వహించిన కన్నెగంటి హనుమంతు కాల్చివేతలో తెరవెనుక పాత్ర రూథర్ ఫర్డ్ దే  అని కొందరు అంటారు. కానీ ఆ మాట తప్పు .. ఆయన పాత్ర ఏమీలేదని కూడా చెబుతారు. కింది స్థాయి అధికారులు రూథర్ ఫర్డ్ కి తెలీకుండా నిర్ణయాలు తీసుకున్నారని అంటారు. సీతారామరాజు విషయంలో కూడా అలాగే జరిగిందని చెబుతారు.

జగ్గయ్య కూడా గుంటూరు జిల్లా వాడే కావడంతో రూథర్ ఫర్డ్ గురించి తెలుసుకుని ఆ పాత్ర మరీ కఠినంగా ఉంటే బాగుండదని నిర్మొహమాటంగా చెప్పారట. అందుకే కొంత సౌమ్యంగా ఉన్నట్టు మార్చారట. గుంటూరు లో పుల్లరి ఉద్యమం చల్లారిన పిదప రూథర్ ఫర్డ్ మన్యం కు వచ్చాడు.అప్పటికే అక్కడ విప్లవం ఆఖరిదశలో ఉంది.రామరాజు అనుచరగణం తగ్గిపోయాక, గ్రామాలను బూడిద చేసి, ప్రజలను భయభ్రాంతులను చేసాడని అంటారు.

గిరిజనులను కష్టాలపాలు చేసి వారికోసం రామరాజు తనంతట తానే లొంగిపోయేలా వ్యవహరించారని చెబుతారు. అదలా ఉంటే రూథర్‌ఫర్డ్‌, రామరాజు ఎన్నడూ ఎదురుపడలేదు.  సినిమాలో మాత్రం రూథర్‌ఫర్డ్‌ మన్యానికి వచ్చి లంచగొండితనం , వెట్టిచాకిరియే విప్లవానికి మూలకారణమని గ్రహించినట్టు చూపించారు.

కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగ్గా లేదు  టెలిఫోన్‌ తీగలు పెట్టించాడని చూపించారు.సంస్థానాధీశులనుండి సైనికులకు ఆహారపదార్థాలు తెప్పించాడని కథ అల్లారు. నిజానికి ఇవన్నీ“బ్రాకెన్”‌ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉన్నపుడు జరిగాయని అంటారు.

1924 మే 7 న రామరాజు  ఏటి ఒడ్డున కూర్చుని ఒక కోయ వ్యక్తి  ద్వారా పోలీసులకు కబురంపాడు. వాళ్లు వచ్చి కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడ గుడాల్‌కు, అల్లూరికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.దాంతో గుడాల్‌ గొలుసులతో చెట్టుకు కట్టించి, రివాల్వర్‌తో కాల్చి రామరాజు ను చంపారని అంటారు.

తర్వాత తమకు చెప్పకుండా రామరాజును కాల్చి చంపడం తో రూథర్‌ఫర్డ్‌ గుడాల్‌ పై మండిపడ్డారని  చెబుతారు. ఇలా చంపినట్టు బయటకు వస్తే బ్రిటిష్‌ సర్కారుకి అవమానమని, పారిపోతూ వుంటే కాల్చామని స్టేటుమెంటు ఇప్పించారు. అయితే సినిమాలో కథ ఇందుకు భిన్నంగా ఉంటుంది.

ఆ సన్నివేశాలన్నీఅత్యంత నాటకీయంగా చిత్రీకరించారు.ఏది ఏమైతేనేమి సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. నటుడు కృష్ణ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. కథ జరిగిన మన్య ప్రాంతంలోనే సినిమా తీయాలని  కృష్ణ రాజీ పడకుండా యూనిట్ మొత్తాన్ని అక్కడికే తరలించి సినిమా తీశారు. అల్లూరి సీతారామరాజు ఈ మన్య ప్రాంతంలోనే గిరిజన ప్రజలతో కలసి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు.

గిరిజన హక్కులను కాలరాచి ,అటవీ సంపదను దోచుకుంటున్న బ్రిటిష్ సర్కార్ ను  రెండేళ్ల పాటు గడగడ లాడించారు. చింతపల్లి…. మరికొన్ని పోలీసు స్టేషన్లను ‌దోచుకున్నారు. ఆయుధాలు తీసుకుపోయారు.. ఉద్యమ నేపథ్యంలో ఎక్కువ మంది చనిపోవడంతో రామరాజు ఉద్యమానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ కథ తయారు చేసిన రచయిత మహారథి తొలుత దీన్ని ఎన్టీఆర్ కి చెప్పారు. ముగింపు లేని కథ కావడంతోఎన్టీఆర్ సినిమా తీయడానికి ఆసక్తి చూపలేదు. తర్వాత మహారథి అదే కథను సూపర్ స్టార్ కి చెప్పారు.అపుడు దర్శకుడు రామచంద్రరావు,మహారథి,ఆరుద్ర, జగ్గయ్య తదితరులు ముగింపు గురించి చర్చలు జరిపారు. క్లైమాక్స్ ఖరారు చేశారు. మహారథి కూడా చింతపల్లి అడవుల్లో కూర్చొని స్క్రిప్ట్ రాశారు. దాని ప్రకారమే సినిమా తీశారు.

సీతారామరాజు గురించి అనేక పుస్తకాలు, నాటకాలు, బుర్రకథలు వచ్చాయి.ఆయన అసలు పేరు శ్రీరామరాజు అంటారు. సీత పాత్ర కల్పితమని చెబుతారు. రామరాజు ఇమేజ్ మరింత పెంచేందుకు  సినిమా కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి .అయితే ఆ పాత్ర ఔచిత్యం ఎక్కడా దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకున్నారు.

సీతారామరాజు  షూటింగ్ కూడా చింతపల్లికి దగ్గరలోవున్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల ప్రాంతాల్లో జరిగింది. అల్లూరి సీతారామ రాజు స్మారకార్థం ఈ మన్యం లో  ఒక పార్క్ నిర్మించారు. నర్సీపట్నం నుండి  28 కిమీ దూరంలో .. కృష్ణ దేవి పేట గ్రామం నుండి 2 కిమీ దూరంలో ఈ పార్క్ ఉంది. అటు వెళ్లిన వారు చూడొచ్చు.

 ———– K.N.Murthy

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!