ఆయనను పట్టుకోగలరా ?

Sharing is Caring...

రష్యా భీకర దాడులకు గత 24 నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ నగరాలు చివురుటాకుల్లా వణికిపోయాయి. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనను సహించలేని పుతిన్ యుద్ధోన్మాదిగా మారిపోయారు.ఫలితంగా మారణహోమం సాగుతోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 32.50 లక్షల మంది ప్రజలు వలస పోయారు. కొందరైతే బంకర్లలో తల దాచుకుంటున్నారు.

పౌరులను టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే యుద్ధ నియమాలను పుతిన్ ఉల్లఘించారని ప్రపంచ దేశాధినేతలు అంటున్నారు.గత కొద్దీ రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాలపై రష్యా సేనలు నిప్పుల వర్షం కురిపించాయి. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలనూ రష్యా సేన విడిచిపెట్టడం లేదు.

యుద్ధం కారణంగా ముందెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు తమ తప్పు లేకపోయినా హింసకు,భయానికి గురయ్యారు. సన్నిహితులను కోల్పోయారు. ఇక అమెరికా ఐరోపా సమాఖ్య విధించిన ఆంక్షలతో రష్యాతో పాటు ఇతర దేశాల  ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నారు. వీటన్నింటికి కారణం ఎవరు ?  పుతిన్.

అందుకే ఆయనను విచారిస్తామని శిక్షిస్తామని అంతర్జాతీయ కోర్టులు అంటున్నాయి. ఇదంతా సాధ్యమేనా ?  అదంత సులభమేనా ? సహజంగా యుద్ధ నేరస్తులను విచారించడానికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. యుద్ధం జరిగే సమయంలో  ఘాతుకాలకు పాల్పడమని ఎవరు ఆదేశాలు ఇస్తే వారిని కూడా విచారిస్తారు.

యుద్ధంలో అలాంటి ఘాతుక చర్యలకు సైనికులు పాల్పడుతున్నారని తెలిసి కూడా నిరోధించ లేకపోయిన సైనిక అధికారులు కూడా చట్టపరంగా శిక్షార్హులవుతారు. ఉక్రెయిన్ వార్ లో ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నట్టు ..   వస్తోన్న వార్తలను బట్టి చెప్పుకోవచ్చు. పుతిన్ దేశాధినేతగా యుద్ధం మొదలు పెట్టారు కాబట్టి  ఆయనపై  విచారణ కూడా ఈ కోణం నుంచే జరగవచ్చు అంటున్నారు. 

యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ద్వారా విచారణ జరపుతారు లేదంటే పుతిన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఒక దాన్ని అనుసరించవచ్చు.  ఇంకో పద్ధతి అయితే అమెరికా, నాటో, ఐరోపా సమాఖ్య సంయుక్తంగా  పుతిన్‌పై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని కానీ, ట్రైబ్యునల్‌ను కానీ నియమించవచ్చు. ఇప్పటికే అమలులో ఉన్నచట్టాల ప్రకారం కూడా యుద్ధ నేరాలపై విచారణ చేపట్టవచ్చు. 

జర్మనీలో ఈ తరహా చట్టం అమలులో ఉంది. ఆ చట్టం ప్రకారమే ఇప్పటికే పుతిన్‌పై విచారణ ప్రారంభించింది.ఇదిలా ఉంటే నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును రష్యా గుర్తించడం లేదు. అమెరికా కూడా ఈ కోర్టు విచారణ పరిధిని ఆమోదించడం లేదు. కాబట్టి ఐక్యరాజ్యసమితి లేదా కొన్ని దేశాలతో కూడిన కమిటీ సూచించిన దేశంలో పుతిన్‌పై విచారణ  చేపట్టే అవకాశాలున్నాయి. అయితే ముందే చెప్పుకున్నట్టు పుతిన్ విచారించడం అంత సులభమేమి కాదు. ముందుగా తానే లొంగి పోవాలి. పుతిన్ వచ్చి లొంగి పోతాడని ఎవరూ అనుకోరు.

అంతర్జాతీయ కోర్టులనే లెక్కచేయని పుతిన్ ఆ కోర్టుల ముందుకు వచ్చి లొంగిపోరు. మరెలా విచారిస్తారు ? వేచి చూడాల్సిందే. అంతర్జాతీయ కోర్టులు .. మానవతా చట్టాలు గురించి పుతిన్ కి బాగానే తెల్సు ఆయన రాత్రికి రాత్రే ప్రెసిడెంట్ అయిపోలేదు. ఈ చట్టాలు వాటి అమలు .. కోర్టుల శక్తి సామర్ధ్యాలు ఏమిటో పుతిన్ కి తెల్సు. ఒక అగ్ర దేశాధినేత గా శాంతి కోరుకోవాల్సిన పుతిన్ పంతానికి  వెళ్లారు. ఇగో ప్రాబ్లమ్ తో సమస్యలు తెచ్చుకున్నారు.

శాంతి చర్చలకు అవకాశం వచ్చినా మెట్టు దిగి రాలేదు. యుద్ధోన్మాది అని ముద్ర వేయించుకున్నారు. ఇప్పటికైనా పుతిన్ యుద్ధం ఆపి చర్చలకు వెళితే పరిస్థితులు వేరేగా ఉంటాయి. లేదంటే ఎలా గోలా పట్టుకునే  ప్రయత్నాలు చేస్తారు. మరిన్ని ఆంక్షల్లో ఇరికిస్తారు. ఈ లోగా పుతిన్ ఇగో కి ప్రజలు బలై పోతారు.  

రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా నాజీ జర్మనీ, జపాన్‌ నేతలను, న్యూరెంబర్గ్‌, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. అలాగే  బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నేతలను  ట్రైబ్యునళ్లలో విచారించారు. 1990లలో యుగోస్లావియా విడిపోయినప్పుడు రక్తపాతానికి కారణమైన నాయకులను శిక్షించారు. ఆ తరహాలోనే పుతిన్ కి శిక్ష విధించాలని అమెరికా భావిస్తున్నా అసలు ఆయన కోర్టుకు రావాలి కదా . 

కానీ ఎవరిని లెక్కచేయని పుతిన్  .. తన జోలికొస్తే అణ్వస్త్రాలు వేస్తామని బెదిరిస్తున్న పుతిన్ ను ఎలా పట్టుకుంటారు అనేది అసలు ప్రశ్న. అయితే ఏదో ఒక దశలో దొరక్కబోరు.. దొరక్క పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. పుతిన్ ను పట్టుకోవడం కోసం మరింత సైన్యాన్ని ప్రయోగించాల్సిన అవసరం కూడా రావచ్చు.రాకపోవచ్చు.  ఇవన్నీ ఊహాగానాలే..   ఏమి జరుగుతుందో  చూద్దాం.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!