couple with great determination ……………………………కరోనా సమయంలో పై ఫొటోలో కనిపించే జంట గొప్ప సంకల్పం తీసుకుని నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఈ దంపతులు హిమాంశు కలియాస్ (42) ట్వింకిల్ కలియాస్ (39) కరోనా మృతులను తమ అంబులెన్స్ వాహనాల ద్వారా ఉచితంగా శ్మశానవాటిక తరలిస్తున్నారు. అంతే కాదు మృతులకు గౌరవప్రదమైన వీడ్కోలు చెబుతున్నారు. దగ్గరుండి దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఏ క్షణంలో ఎక్కడ నుంచి ఫోన్ వచ్చినా వీరు కానీ వీరి సిబ్బంది కానీ హాజరవుతారు. ఇంటి నుంచి ఆసుపత్రికి కానీ ఆసుపత్రి నుంచి ఇంటికి కానీ లేదా శ్మశానానికి కానీ అంబులెన్స్ సేవలు ఉచితంగా అందిస్తున్నారు.
ప్రస్తుత సమయంలో అంబులెన్స్ నిర్వాహకులు 10 వేలనుంచి 30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శ్మశానంలో చితి పేర్చి దహన క్రియలు నిర్వహించేందుకు అక్కడి సిబ్బంది 20 నుంచి 30 వేలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ జంట మాత్రం పైసా తీసుకోకుండా ఈ సేవలన్నీఉచితంగానే అందిస్తున్నారు. వీరికి 12 సొంత అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. ఈ తరహా సేవలు చేయడానికి హిమాంశు కి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది.
చిన్నతనంలో హిమాంశు తండ్రి కి యాక్సిడెంట్ అయింది. తండ్రిని ఆసుపత్రి కి తరలించేందుకు ఎందరినో సహాయం అడిగాడు. ఎవరు ముందుకు రాలేదు. డబ్బులిస్తేనే ఆటోవాలాలు తీసుకెళ్తామన్నారు. చివరికి ఒక ఆటోవాలా వచ్చి సహాయ పడ్డాడు. అయితే కొన్ని గంటలు లేటు కావడంతో హిమాంశు తండ్రి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన కోలుకోవడానికి కొన్నిఏళ్ళు పట్టింది. ఆ సమయం లోనే హిమాంశు ప్రజలకు అంబులెన్సు సేవలు అదీ ఉచితంగా అవసరమని గుర్తించాడు. పెరిగి పెద్దయ్యాక సేవారంగం లోకి దిగాడు. భార్య ట్వింకిల్ కూడా అందుకు సహకరిస్తున్నది. ఇద్దరూ బీమా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. సంపాదించిన సొమ్ముతో అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేశారు.
దంపతులు ఇద్దరూ వాహనాలు నడుపుతారు. వీరికి 18 మంది తో కూడిన ఒక టీమ్ సహకరిస్తోంది. ఎక్కడ నుంచి ఏ కాల్ వచ్చినా అటెండ్ అవుతారు. ఆరు వాహనాలు ఇంటి వద్ద ఉంటాయి. మరో ఆరు వాహనాలు ఢిల్లీ లోని ఇతర ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. రోజుకు 20-25 మంది రోగులను ఆసుపత్రులకు తరలిస్తుంటారు. ఈ కరోనా సమయంలో బాగా బిజీ అయిపోయారు. ఇప్పటిదాకా 80 మందికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు … ఇతర ఏర్పాట్ల కోసం మరో 1000 మందికి సహకరించారు. ఇద్దరి సంపాదనలో 40 శాతం పైగా సామాజిక సేవకు ఖర్చుపెడుతున్నారు. వీరి సేవా నిరతిని గుర్తించి పలు సంస్థలు అవార్డులు కూడా ఇచ్చాయి. ఈ అంబులెన్సు జంటకు తర్జని తరపున అభినందనలు.